ధర్మఫలం
ధర్మాన్ని వ్యక్తికీ, జాతికీ అజరామ రత్వాన్ని ప్రసాదించే అమృతంగానూ, అధర్మవర్తనను కష్టాన్నీ, నష్టాన్నీ కలిగించే విషంతోనూ పోల్చవచ్చు. అంతేకాదు ధర్మంతో వచ్చే బలిమి, అణిమాది సిరులిచ్చే కలిమి కన్నా ఘనమైనది. ధర్మం మానవునికి ఉత్తమగతిని, ఉన్నత స్థితిని సొంతం చేస్తుంది. ధర్మాత్ముని నడవడి, ఋజువర్తన లోకానికి వెలకట్టలేని మేలు చేస్తాయి.
ధర్మజునికి భీష్ముని ధర్మబోధ మహాభారత యుద్ధానంతరం ధర్మరాజుకు అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు రాజధర్మంతోపాటు ధర్మ సూక్ష్మాలెన్నిటినో తెలియచేస్తాడు. ధర్మం యొక్క నిజమైన అర్థాన్ని చెప్పమని కోరిన ధర్మజునికి లోక సంక్షేమాన్ని, జనుల క్షేమాన్ని కోరేదే నిజమైన ధర్మమంటాడు భీష్ముడు. వేదాలలో ఋషిప్రోక్తంగా చెప్పబడినదీ, కన్నుల యెదుట కనపడేదీ, లోకరీతిని అనుసరించి ఆచరణలో ఉన్నదీ అనేవి ధర్మ విశేషాలను తెలుసుకోవడంలో మూడు దశలని భీష్మ పితామహుడు చెబుతాడు. అహింసా మార్గాన్ని అనుసరించడం, దానగుణాన్ని కలిగి ఉండటం, సత్యవ్రతాన్ని ఆచరించడం, క్రోధాన్ని విసర్జించడం అనేవి లోకాన పేర్కొనదగిన ఉత్తమమైన ధర్మాలనీ ధర్మజునికి తేటతెల్లం చేస్తాడు. ధర్మజుడు చేసిన ఉత్తమకార్యాలే పాండవుల అభ్యున్నతికి కారణమనీ, ధర్మఫలం అమోఘమైనదనీ మార్గదర్శనం చేస్తాడు. కౌరవుల వినాశనానికి వారి దుష్ప్రవర్తన, దుష్కర్మలే కారణమనీ, అధర్మవర్తనులై చరించినందున ఆ ఫలాన్నే అనుభవించారనీ ధర్మజునికి భీష్ముడు స్పష్టం చేస్తాడు.
రావణునికి హనుమ హితబోధ రామాయణంలో ధర్మానికి సంబంధించిన ప్రస్తావన విభిన్న పాత్రలతో పదేపదే ప్రస్తావించబడి ధర్మవిశిష్టతను లోకానికి తేటతెల్లం చేస్తుంది. లంకా నగరాన్ని విధ్వంసం చేసిన అనంతరం ఆంజనేయుని బంధించి రావణుని కొలువుకు తీసుకువస్తాడు ఇంద్రజిత్తు. అప్పుడు మహాబలశాలిగానే గాక వేదవేదాంగాలను అభ్యసించిన కుశాగ్రబుద్ధియైన ఆంజనేయుడు రావణునికి యుక్తాయుక్తాలను తెలుపుతూ, ధర్మం యొక్క ప్రశస్తిని నొక్కి వకాణిస్తాడు. "ఓ రాక్షసరాజా! నీవు తొలుత ధర్మాన్ని సదా ఆచరిస్తూ పెక్కు తపస్సులు చేసి ఆ పుణ్య ఫలితంగా సాధారణమైన రీతిలో మరణం పొందకుండా ఉండే వరాన్ని బ్రహ్మాదుల ద్వారా పొందావు. అయితే, సీతాదేవిని అపహరించి ఘోరమైన తప్పిదం చేయడమే కాక నీవు సంపాదించిన ధర్మఫలాన్ని చాలావరకు కరిగించేసుకున్నావు. ధర్మం షడ్రసోపేతమైన విందు భోజనమైతే, అధర్మం గరళంతో మిళితమైన ఆహారం లాంటిది.
మిక్కిలి విషపూరితమైన అన్నాన్ని భుజించి ఎంతటి ఆకలి గలవాడైనా జీర్ణించుకోలేడు కదా! కఠోర దీక్షతో, అకుంఠిత ప్రయత్నంతో సాధించిన నీ తపఃఫలితాన్ని, ప్రభావాన్ని చేతులారా నాశనం చేసుకోవడం ఏమాత్రం యుక్తం కాదు. ధర్మబలం, అధర్మఫలం ఎప్పుడూ కలిసి ఉండవు. ధర్మం యొక్క బలం నిరతమూ శ్రేయస్కరమైన శుభ ఫలితాలను ఇస్తుంది. అధర్మం ఒనగూర్చే ఫలం అశుభాన్నీ, అకాల వినాశనాన్నీ కొనితెస్తుంది. 'అవశ్యమను భోక్తవ్యమ్ కృతం కర్మ శుభాశుభమ్' అని కదా ఆర్యోక్తి. అందుకే ఇప్పటికైనా శ్రీరాముని ధర్మపత్నిని అతనికి అప్పగించి ధర్మాన్ని పాటించడమే గాక నీ ప్రాణాలను కూడా కాపాడుకోవయ్యా రాక్షసరాజా'' అంటూ హితబోధ చేస్తాడు.
కఠినమైనది ధర్మమార్గం ధర్మానికి దారితీసే మార్గం మిక్కిలి కఠోరమైనది, అమిత ప్రయాసతో కూడుకున్నది. వేయి అడ్డంకులను అధిగమించైనా శీలాన్ని సుప్రతిష్ఠితం చేసుకోవాలంటాడు స్వామి వివేకానంద. మహనీయులచే పలుకబడిన ఇటువంటి మధురోక్తులు మన జీవితానికి ఆలంబన కావాలి. ధర్మానికి సంబంధించిన వివేకమైన ఆలోచనే మనలో ఎల్లప్పుడూ వెల్లివిరియాలి. ధర్మాధర్మ విచక్షణ కలిగిన మానవుడు, వాటిని ఆచరణలో చూపిన నాడు మహనీయుడై నిలిచిపోతాడని చరిత్ర అనేక ఉదాహరణలతో నిరూపించింది. అధర్మ మార్గంలో వెళ్లే వాళ్లు తాత్కాలికంగా సుఖించినట్లు కనిపించినా, అంతిమ విజయం ఎప్పటికీ ధర్మవర్తనులదే! అందుకే ధర్మంగా చరిస్తూ, ఇతరులకు ఆ దిశలో మార్గదర్శనం కావిస్తూ, తమ జీవనంలో తరిస్తూ నిలిచేవారు తప్పక సత్ఫలాలనే పొందుతారు. జనహితానికి, జాతి ప్రగతికి పథ నిర్దేశకులుగా కీర్తిని పొందుతారు.
0 comments:
Post a Comment