Showing posts with label గోవిందాశ్రిత గోకుల బృందా......... Show all posts
Showing posts with label గోవిందాశ్రిత గోకుల బృందా......... Show all posts

భగవంతుని నమ్మిఆశ్రయించాలా వద్ద అనేసందిగ్దం లో కొట్టుమిట్టాడుతున్న ఓ ప్రముఖ బ్లాగర్ తన జీవితాన జరుగుతున్న ఆదైవలీలలను చూసి తబ్బిబ్బయిపోతున్నాడు .తనపేరు చెప్పవద్దని ,అదితనకు అహంకారాన్ని పెంచుతుందేమోనన్న వినయంతో ఆయన పేరు చెప్పవద్దనగా ఆయనపేరు వెల్లడించటం లేదు. ఇక ఆయన మాటలలోనే చదవండి ఆకొండలరాయుని లీల

------------------------------------------------------------------------------------------------

విరోధి నామ సంవత్సర, ఆశ్వీయుజ మాసం బహుళ సప్తమి తిథి.
(10 Oct, 2009)

ప్రతి యేడు తిరుపతికి వెళ్ళడం మా ఇంట ఆచారం, నాకు మానసికంగా ఉత్తేజం చేకూర్చే ఓ అలవాటు. కొన్నేళ్ళుగా వెళ్ళలేదు. అయితే ఎందుకో సంకల్పం కలిగింది. అదీ ఒక వారం ముందు మాత్రమే. శుక్రవారం రోజు ఉన్నపళాన బెంగళూరునుండి, తిరుపతి బస్సెక్కాను, రాత్రి. బయల్డెరే ముందు ఓ విషయం అనుకున్నాను. దర్శనం లేట్ అవుతుంది అన్నట్లయితే, వాపస్ వచ్చేసి, తిరిగి మళ్ళెప్పుడయినా చూడాలి అని.

సరే, శనివారం పొద్దున తిరుపతి బస్ స్టాండ్ వద్ద సుదర్శనం క్యూలో నించున్నాను. ఓ మూడు గంటల తర్వాత ఉదయం 9 కు దర్శనం టికెట్ దొరికింది. 9 లోపల స్నానాదులవీ ముగించి, క్యూలో నిలబడితే, 9:45 కంతా దర్శనం అయిపోయింది. ఇది ఒక వింత. ఇదివరకు నేను ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా ఇంత తక్కువ సమయంలో నేను తిరిగి వచ్చింది లేదు.

తిరుపతికి వెళ్ళడానికి ప్రేరణ - అనుకోని సమస్యలలో చిక్కుకొని, ఎవరూ పరిష్కారం చూపలేక, చివరకు "అన్యథా శరణం నాస్తి" అని స్వామిని వేడుకోవడం కోసమే.

నేను జన్మ రీత్యా బ్రాహ్మణుణ్ణి. చిన్న వయసులోనే
మా నాన్న గారు ఉపాకర్మ జరిపి, మా తాతగారి సహాయంతో, సంధ్యావందనాదులు, నిత్యకర్మ మొదలైనవి ఆచరించేట్టు చూశారు. కొన్ని యేళ్ళ క్రితం మా
అమ్మ స్వర్గస్తులయారు. అప్పుడు కొన్ని సంఘటనల వలన నేను నాస్తికుణ్ణి (నాస్తికత్వం అన్నది చింతన మాత్రమే, ఆస్తిక ద్వేషం కాదు) కావడం జరిగింది. సంధ్యావందనాదులు
పక్కన పెట్టాను. పూజలు, అవీ అసలు లేవు.

ఆ తర్వాత గతవారం నుండీ మళ్ళీ నిత్యకర్మలు చేస్తున్నాను. తిరుపతి నుండీ వచ్చిన తర్వాత రోజు ఉదయం 5:30 కు నాకు, ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోను ఎత్తగనే, "వెంకటేశా" అని పిలిచారెవరో.
(రాంగ్ నంబర్ అది). అలా ఆ రోజూ ఉదయమే లేచి నిత్యకర్మ ఆచరించాను. (ఆ కాల్ రాకపోయి ఉంటే చాలా నిదానంగా లేచేవాణ్ణి). ఆ తర్వాత కొన్ని సమస్యలు నేను కల్పించుకోక
ముందే పరిష్కారమయాయి, విచిత్రంగా. ఇంకా ఏమి జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

(పొద్దున 5:30 కు ఎవరో రాంగ్ నంబర్ కాల్ చేసి, నిద్రలేపడం అన్నది దైవలీల మాత్రమే. సరే కాకతాళీయం అనుకుందాం. నేను నిద్ర లేచినా, కాసేపలా బద్ధకంగా ఉన్నాను. కాసేపటి తర్వాత మళ్ళీ ఇంకొక కాల్ (అదే నంబర్ అనుకుంటాను). ఈ సారి ఓ పెద్దావిడ. సౌమ్యంగానే ఏదో అడిగింది. ఆమే ఏమన్నదో నాకు గుర్తు లేదు. అప్పటికి నాకు పూర్తిగా మెలకువ వచ్చింది)

ఇంకో విచిత్రం. మా ఆవిడ ఉద్యోగం గత ఐదు యేళ్ళుగా డోలాయమానంగా ఉంది. అంటే, ఉద్యోగానికి ప్రమాదమంటూ ఏదీ లేదు కానీ, పర్మనెంట్ అవడానికి ఏవేవో ఆటంకాలు. తిరుపతి నుండి వచ్చిన రెండవ రోజు, ప్రభుత్వపు జీవో వచ్చింది. ఆమె ఉద్యోగం పర్మనెంట్ కానున్నట్టు. అయితే - మరో చిక్కు వచ్చింది. ఆమె సర్టిఫికెట్లు సొసయిటీ వారికి దాఖలు చేసినవి, ఎక్కడో మిస్ అయాయి అని వారి సొసయిటీ నుండీ ఉత్తరం వచ్చింది. ఆమె ఖంగారు పడింది. నేను సౌమ్యంగా ఉండమని, స్వయంగా కడపకు వెళ్ళి, సొసయిటీ అధికారులను మాట్లాడమని చెప్పాను. మరుసటి రోజామె కడపకు బయలుదేరింది. (కడపకు వెళ్ళాలంటే, కదిరిమీదుగా వెళ్ళాలి కదా అనుకున్నాను మనసులో నేను. కదిరిలో యోగలక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నాడు). సాయంత్రానికి ఆమె పని చక్కబడింది. . అయితేనేం, పని అనుకున్న దానికన్నా సులువుగా జరిగింది.ఇది స్వామి దయమాత్రమే అని నాకు అనిపిస్తున్నది.
ఇంకా విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. నిన్న పాత మితృడు, నా రూమ్మేటు, పది యేళ్ల తర్వాత కలిశాడు, తనంతట తనే నన్ను వెదుక్కుంటూ వచ్చి. తన పేరు - "శేషాద్రి". ఆ మితృడితో, ఏమి చేయిస్తాడో, ఏమి చేయించుకుంటాడో ఆ స్వామి, ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

అబ్బాయి పెళ్ళిసంబంధం నిశ్చితార్థ ముహూర్తం కోసం ఆ దంపతులు మా దగ్గఱికొచ్చారు. మాటల సందర్భంలో "అభిజిన్ముహూర్తం సర్వశ్రేష్ఠమైనది. శ్రీరామచంద్రులవారి పెళ్ళి అందులోనే జఱిగింది" అని చెప్పాము. "రాముడూ, సీతా ideal couple కాదు గదా ! వాళ్ళ ముహూర్తం మనకెందుకు ?" అన్నాడా అబ్బాయి. అనడం ఇంగ్లీషులోనే అన్నా అవి రాములవారి చెవిలో పడనేపడ్డాయి. సరే, మొత్తం ముహూర్తం పెట్టడం అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు.

మర్నాడే ఆ ముసలిదంపతుల నుంచి ఫోను : "మా కాబోయే కోడల్ని ప్రేమిస్తున్నాను, చేసుకోకపోతే విషం తాగి చచ్చిపోతానంటూ ఆమె కొలీగ్ ఒకడు తన పేరెంట్సుతో సహా వచ్చి గోల చేస్తున్నాడట. ఒకరోజంతా ఆలోచించి చెబుతానని మా కాబోయే కోడలు అతనితో చెప్పిందట. ఆమె ప్రవర్తన ఎందుకో మాకు అనుమానస్పదంగా ఉంది. ఏం చెయ్యమంటారు ?" అని ! "చేసేదేముంది ? ఆమెకి అతని మీద ఏదో ఒక అభిప్రాయం లేకపోతే అతనికలా టైమివ్వదు. ఆమె ప్రవర్తన మంచిది కాదు. తెగతెంపులు చేసుకుంటున్నట్లు ఆమె తల్లితండ్రులకి తెలియజెయ్యండి" అన్నాము.

సాయంకాలానికే మళ్ళీ ఫోను. "మా కాబోయే కోడలు సూట్ కేసు సర్దుకొని అమ్మానాన్నా చూస్తూండగానే ఆ కొలీగ్ తో లేచిపోయిందట" అని అప్ డేటు. ఏం చేద్దాం ? ఇలా ఉన్నారు సిటీలో అమ్మాయిలు, చదవేస్తే ఉన్నమతి కాస్తా పోయినట్లు ! "పోన్లెండి, మీవాడు నక్కని తొక్కాడనుకోండి. అలాంటి అమ్మాయిని చేసుకొని ఆ తరువాత ఆమె అంతకుముందే పెద్ద హీరోయిన్ అని తెలిసినప్పుడు పడే బాధ కన్నా ఆదినిష్ఠూరంగా అంతటితో పోయిందని సంతోషించండి."అని ఓదార్చాము. వరుడు మాత్రం చాలా దుఃఖంలో ఉన్నాడు. ఆ పిల్ల అందగత్తె కావడంతో అతను పీకలలోతు ప్రేమలో మునిగిపోయి ఉన్నాడు. అతన్ని ఓదార్చడం సాధ్యం కాలేదు. కానీ ఒక మాట చెప్పాము. "సాక్షాత్తు భగవంతుడైన రాములవారిమీదా, సీతమ్మవారి మీదా నువ్వలా కామెంట్ చెయ్యడం తప్పు. ఆ ఆదిదంపతుల శాపాలు తగుల్తాయి. ఈ అమ్మాయే కాదు. ఏ అమ్మాయీ నీ మొహం చూడని పరిస్థితి వస్తుంది." అని !

ఇంకాస్త తరువాత రాస్తాను.

--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఆది మధ్యాంత రహితుడు కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుడు మా జీవితం లో ఎల్లప్పుడూ అపారమైన ప్రేమను కురిపిస్తూ ,ఆపన్న హస్తం అందిస్తూనే వున్నాడు . ఆదేవదేవుడుఇ ఎన్నోసార్లు మమ్మల్ని ఆదుకుని తన భక్తపాలన చాటుకున్నాడు.

నాపేరు విజయ లక్ష్మి . నాభర్త పేరు దుర్గా లక్ష్మణ బాబు. మాది ప్రేమ వివాహం .ఎన్నో అవాంతరాలెదురైనా స్వామి దయవలన మా వివాహం 2002 లో ప్రశాంతం గా జరిగినది. మేము తిరుమలక్ కాలినడకనవచ్చి తలనీలాలు సమర్పించుకుని స్వామి వారి మొక్కు తీర్చుకున్నాము. ఆతరువాత మాకు 2003 లో బబు పుట్టాడు. వాడు పుట్టేముందు కూడా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగినది మాజీవితం లో .

మేమిద్దరం బాగా చదువు కున్నప్పటికీ మా ఇద్దరికీ ఉద్యోగ విషయం లో ఇంకా స్వామి వారి అనుగ్రహం కలగలేదు. మాది పెద్ద సంసారం. ఈయన ఒక్కరే మగపిల్లవాడు మా అత్తమామలకు .నలుగురు చెల్లెల్లు .వారి లో ఇద్దరికి పెల్లిల్లయ్యాయి. ఇద్దరు ఇంఇకా చిన్నవాల్లు. మా మామగారు లేరు . కనుక బాధ్యతంతా మా ఆయనదే.

మా పెల్లై నేను కాపురానికొచ్చేటప్పటికి రెండో ఆడపడుచు ప్రసవానికి వచ్చి వున్నది. ఆ అమ్మాయికి సిజేరియన్ చేయటం వలన ఉన్న డబ్బు చాలక ,ఆ అమ్మాయి గొలుసునే తాకట్టు పెట్టి ప్రసవం చేపించాల్సి వచ్చినది.రోజులు గడుస్తున్నాయి .కష్టం గా. ఆ అమ్మాయి ప్రసవానికి చేసిన అప్పే తీరలేదు. నాకు ప్రసవ సమయము దగ్గరపడినది. ప్రేమ వివాహం కావటం వలన పుట్టింటికి పోయే అవకాశం లేదు. దాం తో ఈ బాధ్యత కూడా మావారిదే.అందువల్ల ఎవరిని అప్పుడగాలి? అనే చింతలో మేముండేవారము. అయినవారు అర్ధం చెసుకునే స్థితి లో లేరు . స్నేహితులనడుగుదామనుకుంటే మొహమాటం. మావరు " నువ్వు టెన్షన్ పదకు స్వామి వారే రక్షిస్తారు మనలను అని ధైర్యం చెబుతుండేవారు. కానీ మనిషికి సహజమైన భయం మనసులో వుంటుంది కదా?

అలాంటి స్థితిలో స్వామిని కాపాడమని ప్రార్ధిస్తూ వున్న సమయం లో స్వామి లీల ప్రారంభమైనది. ఎప్పుడో మేము కులాంతరవివాహం చేసుకున్నందుకు గాను ప్రోత్సాహక బహుమతి కోసం సాంఘీక సంక్షేమ శాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోవడం వలన రూ .10000/- ఇస్తున్నామని కబురు అందింది. ఇదంతా ఆ ఆపదమొక్కులవాని దయవలనే అవసరమగు సమయానికి అందింది. మేమిద్దరం ఆ ఫీసుకు వెళ్ళి సంతకం చేసి డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకున్నాము.

ముండుగా ఏలూరు లోని రామచంద్రరావు పేటలో ఉన్న శ్రీ వేంకటేశ్వరుని సన్నిధికి వెళ్ళి నమస్కరించుకుని అక్కడనుండి బాంక్ కు వెళ్ళి డబ్బుతెచ్చుకున్నాము. ఆమర్నాడే నాకు సుఖ ప్రసవమయ్యినది. అందుకే మా బాబుకు విష్ణు అని పేరు పెట్టు కున్నాము. ఆపద్భాంధవుడైన కలియుగ ప్రత్యక్ష దైవమై న శ్రీనివాసుడు ఇలా రక్షిస్తుంటాడు ఆర్తులను. కోరకనే కావలసినవన్నీ తీర్చే కరుణాంత రంగుడు ,సర్వాంతర్యామి అయిన ఆపన్న చింతామణి స్వామి . గోవిందా ........ గోవిందా ..

- పసుపులేటి విజయా దుర్గాలక్ష్మణ్ బాబు ....ఏలూరు. ప. గో . జిల్లా





2006 వ సంవత్సరం. రేపు హోళీ పండుగ రోజు చిలుకూరి బాలాజీ గుడి కి వెళదామా... మిత్రుడి సలహా. అప్పటికే ఆ గుడి గురించి విని ఉండటంతో అందరమూ
చిలుకూరికి వెళదామని నిర్ణయించుకున్నాము. హోళీ పండుగ రోజు అందరమూ కలిసి చిలుకూరికి బయలుదేరాము. ఆలయంలోకి ప్రవేశించగానే, అక్కడ
అప్పటికే చాలామంది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అది చూసి మాలో ఒకడు...ఇక్కడ మొదట పదకొండు ప్రదక్షిణలు చేసి, మనం ఏదైనా కోరిక కోరుకోవాలి. కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి 108 ప్రదక్షిణలు చేయాలి అన్నాడు. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. ఎలాగూ ఇంతదూరం వచ్చాం కాబట్టి, 108 ప్రదక్షిణలు ఇప్పుడే చేద్దాం అన్నాను నేను. అందరమూ కలిసి గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేశాము. అప్పట్లో నాకు పెద్దకోరికలేమీ లేకపోవడంతో, అలాగే దేవుణ్ణి ఏమి కోరుకోవాలో తెలియక "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి, దేవుణ్ణి దర్శించుకొని ఏమీ కోరకుండానే వచ్చేశాను.

చిలుకూరి నుంచి తిరిగి అమీర్ పేట కు వచ్చేటప్పటికి సాయంత్రం అవ్వడంతో, ఛాయ్ తాగుదామని అందరమూ మా రూముకు దగ్గరలో వున్న కెఫే కు వెళ్ళాము. మా ప్రక్క టేబుల్ లో ముగ్గురు కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళల్లో ఒకడు, మామా... GATE ర్యాంకు వచ్చింది కదా, మంచి పార్టీ ఇవ్వాలి అన్నాడు. అది విన్న నాకు అనుమానమొచ్చి, వాళ్ళను అడిగాను ఇవ్వాళ GATE రిజల్ట్స్ వచ్చాయా అని. అవునని సమాధానం చెప్పారు వాళ్ళు. నేను GATE exam అంత బాగా వ్రాసి ఉండకపోవటంతో, ర్యాంకు రాదన్న గట్టి నమ్మకంతో దాని గురించి పట్టించుకోవడం మానేశా. కాని కనీసం qualify అన్నా అయ్యానో లేదో తెలుసుకుందామని ప్రక్కనే వున్న ఇంటర్నెట్ కెఫే కి వెళ్ళాను. సైట్ లో నా నంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చూడగానే not qualified అని వచ్చింది. exam సరిగ్గా వ్రాయలేదని తెలుసుకాబట్టి qualify కాకపోయినా లైట్ తీసుకున్నాను. కాని ఎందుకో అనుమానమొచ్చి, మళ్ళీ నంబర్ చూసుకొని ఎంటర్ చేశాను. అంతే నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. నా శరీరంలో చిన్న వణుకు. నాదో కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికి బయట వున్న ఫ్రెండుగాడిని పిలిచి అడిగా. వాడు చూసి నాదేనని కన్ఫర్మ్ చేశాడు. అంతే ఒక్కసారిగా గాల్లో తేలిపోయా. మిగతా ఫ్రెండ్సుకు చెబుదామని, మా కాలేజీలో ఉన్న ఫ్రెండ్సుకు ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళు పగలబడి నవ్వడం మొదలుపెట్టారు. జోకులాపి పని చూడరా అన్నారు. నేనెంత చెప్పినా వాళ్ళు నమ్మలేదు. ఆఖరికి నా హాల్ టికెట్ నంబర్ ఇచ్చి, కావాలంటే మీరే రిజల్ట్స్ చూసుకోండిరా అని చెప్పాను. నాకు ర్యాంకు వచ్చిందనే విషయాన్ని, మా కాలేజీలో ఎవ్వరూ నమ్మలేకపోయారు. ఆఖరికి నా రూమ్మేట్స్ కూడా. నీకు ర్యాంకు వచ్చిన సంగతిని మేమెవ్వరమూ జీర్ణించుకోలేకపోతున్నాం రా అన్నారు కొద్దిమంది స్నేహితులు. వాళ్ళు జీర్ణించుకోలేకపోవడానికి, మా కాలేజీ లో ఎవ్వరూ నమ్మలేకపోవడానికి మరో పెద్ద ఫ్లాష్ బ్యాక్ వుంది. ఏదేమైనా నేనేమీ కోరకున్నా, నాకు కావలిసినదేంటో అనుగ్రహించిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి వేన వేల దండాలు.


--ధన్యవాదములతో
నాగప్రసాద్.
ఇంజనీరింగ్ విద్యార్ధి ,మరియు తెలుగుబ్లాగర్


అది 1991-92.అప్పట్లో నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. బంధువులచే
మోసగించబడి సమారు అప్పుచేసి తెచ్చిన డబ్బు 5.5 లక్షలవరకూ వారిచే
మోసగింపబడి భార్యాపుత్రులతో అత్తవారింట్లో ఆశ్రయం పొందుతున్నరోజులవి.
నిరుద్యోగిగా సుమారు 2.5 సంవత్సరములు గడిచినవి.భార్య భారతి సుగరు
వ్యాధితో మంచం పట్టింది.కాలిలో కురుపు(డయాబెటిక్ ఫుట్)తో నెల రోజులు
తణుకులో హాస్పిటలులో ఉన్నా డాక్టరుగారి నిర్లక్ష్యవైద్యం వల్ల
తగ్గకపోయినా ఇంటికి తీసుకుని వచ్చిన పరిస్థితి.అప్పుడే నాకు హైదరాబాదులో
ఉద్యోగం దొరికితే ఒక్కణ్ణీ వెళ్ళి జాయినయ్యాను.రెండో రోజునే భారతి
డయాబెటిక్ ఫుట్ కురుపు చీముపట్టి వాసన వస్తోందని కబురు.వెంటనే మెరుగైన
వైద్యం కోసమని ఆవిడను తణుకునుంచి హైదరాబాదు రైలులో పంపించారు.గౌతమి
ట్రైను సికిందరాబాదు స్టేషను చేరేసరికే ఆవిడకు ఇన్ఫెక్షనువల్ల జ్వరం కూడా
వచ్చింది. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం కావటం చేత వెంటనే పెద్ద డాక్టరు ఎవరూ
దొరకక పోవటం, మర్నాడు సాయంత్రం డాక్టరు ఎప్పాయింట్మెంట్ దొరికింది.
మధురానగర్ దగ్గరలోని సిక్ బే హేస్పిటలులో చేరాం. వైద్యం ఇంకా
మొదలుపెట్టకుండానే ఆ రాత్రే ఆమె కోమా లోనికి వెళ్ళిపోవటం జరిగింది.
శ్రీనివాస రెడ్డిగారనే డాక్టరుగారు ఆమెకు వెంటనే చికిత్స మొదలుపెట్టి
నాలుగు సీసాల రక్తం ఎక్కించి ఆవిడను తిరిగి స్ప్రహ లోనికి తెచ్చారు.ఆ
సమయంలో పేషంటు పరిస్థితిని గురించి ఏమీ చెప్పలేమనిన్ని, చివరి చూపుకోసం
మా అబ్బాయిని కూడా హైదరాబాదు పిలిపించుకోమనీ కూడా డాక్టర్లు చెప్పటం
జరిగింది. మా అబ్బాయినికూడా పిలిపించాం.మానవ ప్రయత్నాలన్నీ ఎన్ని
చేస్తున్నా దేవుని మీద భారం వేసి తిరుపతి వెంకన్నకూ(నా స్వామి),
సిర్డిసాయిబాబాకు(మా ఆవిడ ఇస్టదైవం) మొక్కులు మొక్కుకున్నాం.
డాక్టర్ల కృషిచేతనూ,దైవం మాయందుండటం చేతనూ కష్టం గడిచి ఆవిడ కోలుకోవటం
జరిగింది. సమారుగా నెలరోజులు పైగా హాస్పిటలులో ఉండాల్సొచ్చింది.ఆ సమయంలో
హైదరాబాదులోనే కాపురం ఉంటున్న మా ఆవిడ అన్నయ్య(కజిన్),ఇంకా
ఇతరబంధువులు(ఆవిడ తరఫువారే) చేసిన సహాయాన్ని మేమెప్పుడూ మర్చిపోలేము.
అప్పుడు జరిగిన హడావుడీ కంగారూ ఇంతింతని చెప్పలేను.
తరువాత గత పదిహేను సంవత్సరాలలోనూ కూడా ఇంకో రెండుసార్లు ఆ కాలికీ
రెండోకాలికీ కూడా ఇన్ఫెక్షన్లు రావటం బాగు చేసుకోవటం కూడా
జరిగింది.వైద్యనారాయణులకృషితో పాటుగా ఆ శ్రీమన్నారాయణుని కృపకూడా మామీద
ఉండబట్టి ఆవిడ క్షేమంగా రోగాలనుండి బయటపడింది.--ఇవి నా జీవితంలో మేము
ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలూ దైవకృపతో ఆ గండాలను దాటిన వైనమూను.




వ్రాసినవారు :- మల్లిననరసింహరావుగారు


బస్తిపాడు గ్రామ మునుసబుగనన్న చిన్నశేషిరెడ్డి జ్యేష్ట పుత్రుడు లక్క్ష్మి కాంతా రెడ్డికి ఐదు సంవత్సరముల క్రిందట మనస్సు స్ఠాయితప్పి, అతడు పిచ్చి చేష్టలను చేయుచుండెను. అతనిని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించినపట్టికిని ఏమియు ప్రయోజనము లేకుండెను.
ఏమి చేయుటకును తోచక, ఒకనాడు చిన్న శేషి రెడ్డి తన కుమారుని నాతావునకు పిలుచుకునివఛ్చి, అతిని పరిస్థిని తెలియజేసి, అందుండి బయట పడుటకు మార్గమును ప్రసాదింపుడుని విన్నవించుకొనెను. సర్వశక్తివంతమగు రామనామము ను నిండుభక్తితో జపించుచుఁడిన తమ బాధలన్నియూ తీరునని ధైర్యము చెప్పితిని
తదుపరి నేను శ్రీరాములను హృదయ పూర్వకముగా స్మరించి ధ్యానమగ్నుడనై ఒక గంటకు పైగా ఏకధారగా శక్తికిరణములను ప్రసరింపజేసితిని. అందువలన ఆయన కుమారుని మనసు ప్రశాంతతనొంది స్వాధీనములోనికి వచ్చెను.

చిన్నతనము నుండి లక్ష్మీకాంతరెడ్డి తనతండ్రి తోపాటు నావద్దకు వచ్చుచుండుటచే, అతనికి కూడ నా యందు విశ్వాసముండును. అందువలన అతనితో ' లక్క్ష్మికాంతా రెడ్డి, నీవు నా సమక్షమున అచ్చట ఎలాంటి అల్లరి చేయక మీ తండ్రి ఆజ్ఞానుసారము నకడుచుకొనవలెను. నీ మనస్సు స్థాయితప్పునను భీతి కలిగినప్పుడెల్ల, నీవు వెంటనే రామ నామమును జపించిన నీ మనస్సు తిరిగి ప్రశాంతతనొందును. నీవు నేను చెప్పిన అతడట్లుండటకు సమ్మతించెను. ఇంటికి వెళ్ళిన తర్వాత తన కుమారుడు ఏదైనా అల్లరి చేసిన నా తావునకు వెంటనె పిలుచుకొని రమ్మని చిన్నశేషి రెడ్డికి తెలిపితివి
అటు తర్వత , నేను శ్రీరామలను స్మరించి వారిని హ్రుదయ పూర్తిగ దీవించి కుంకుమ ప్రసాదమునిచ్చి పంపితిని .
తనమనస్సు స్వాధీనము తప్పుచున్నదన్న భీతి కలిగినప్పుడెల్ల లక్ష్మీ కాంతరెడ్డి వెంటనే తన గదిలోనికి పోయి నా పటము ముందు నిలుచుకుని కొంత తడువు శ్రీరామ నామమ్మును స్మరించుచుఁడెను. అప్పుడప్పుడు అతడు నాతావునకు వచ్చి నేను ధ్యానము నందుండగా నా ఎదుట కూర్చుని శ్రీరామ నామమును జపించుచుండెను. శ్రీరాముల అనుగ్రహ ప్రభావమున త్వరలోనే అతని కుండు మనోబాధంతయు నివారణమై మామూలు స్తాయిలోనికొచ్చి అంతకు ముందెన్నడూ లేని ప్రశాంతతో ఇంటిపనులన్నియూ చూచుకొను సమర్ధత కలిగెను.
[పసుపుల రామకృ ష్ణారావుగారి ,శ్రీరామ నామ మహిమ గ్రంథము నుండి]


పియుసి చదువుతున్నప్పటినుండి రాజేశ్వరి అనె బాలిక తన తల్లిదండ్ర్లులతో పాటు నావద్దకు వచ్చు చుండెడిది. త్వరలోనే ఆమెకు రామనామమునందు,మంచి విశ్వాసముకలిగెను. శ్రీరామానుగ్రహం వలన ఆమె వివాహము శుభకరము గా జరిగెను. అటుతరువాత కొంతకాలమునకు రాజేశ్వరియొక్క ఆరోగ్యము చెడి మిక్కిలి ప్రమాదస్థితిలో నుండుటచేత ఆమెను కర్నూల్ జనరల్ హస్పటల్ లో చేర్చిరి. అచ్చట చికిత్సవలన ఏమీ లాభం లేకుండినందున ఆమెను మరలా ఇంటికి తీసుకొనివచ్చిరి.
దినదినమునకు ఆమె బాధ ఎక్కువగుచుండెను. తుదకు రెండురోజులు పూర్తిగా నీళ్ళుత్రాగుటను కూడామాని వేసి రాత్రింబవళ్ళు విపరీతబాధపడుచుండెను. అట్లే కొంతకాలముండిన ఆమె గుండె ఆగి పోవు ప్రమదము కలుగవచ్చునని ఆమె తండ్రి భీతిల్లి నాతావునకు వచ్చి ఆమెస్థితిని తెలిపి ఆమెకేహాని లేకుండునట్లుగా దీవించుడని ఎంతో బాధతో విన్నవించుకునెను.
నేను శ్రీరాములను స్మరించి వెంటనే ధ్యాననిమగ్నుడనై ప్రశాంతశక్తి పూరిత ధ్యానకిరణములను ఆమె లోనికి పంపమొదలిడితిని. ఇట్లు సుమారు ఒక గంటకాలము గడపితిని. అదివరలో రెండురోజులుగా నిద్రాహారములు లేక మిక్కిలి బాధపడుచుండిన రాజేశ్వరికి నేను ధ్యానమును మొదలిడినప్పటినుండి యు శ్రీరామానుగ్రహము వలన మంచి నిద్రపట్టి తెల్లవారేవరకు ఆమె సుఖముగా నిద్రించెను . ఎనిమిది రోజులుగా కండ్లు తెరవబడకున్నందున ఆమె కంటి చూపుకు తీరని ప్రమాదము కలుగునేమోయని ఆమె తల్లిదండ్రులు భీతిల్లుచుండిరి.కానీ శ్రీరామానుగ్రహము ఆమె మరుసటి దినమే తన కళ్లను సునాయాసముగా తెరువగలిగెను. కంటి చూపు ఏకొంచెం చెడకుండా శ్రీరామానుగ్రహము ఆమెకున్ పూర్ణారోగ్యమును కలుగజేసి కోలుకొనులాగ చెసినది. తరువాత కాలేజీ లో చేరి సునాయాసముగా బి .ఏ. పరీక్షయందు ఉత్తీర్ణతనొంది తదుపరి ఎమ్.ఏ కూడా ఉత్తమశ్రేణిలో కృతార్ధురాలై గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ గా నియమింపబడెను.

[పసుపుల రామకృష్ణారావు,కర్నూల్ వారి శ్రీరామనామ మహిమ నుండి.]


మా నాన్నగారికి స్వయంగా అనుభవమైన సంఘటన ఇది. అప్పట్లో ఆయన ఆర్‌టీసీలో
వుద్యోగం చేస్తుండేవారు. తిరుపతి వెళ్ళాలని నిర్ణయించుకొని శెలవుకోసం
ప్రయత్నించారు. శెలవు దొరకక పోవటంతో సిక్ లీవు పెట్టి తిరుపతి
ప్రయాణమయ్యారు.

తిరుపతిలో దర్శనము అదీ బాగానే జరిగింది. సిక్ లీవులో వున్నారు కదా తల
నీలాలు సమర్పిస్తే మర్నాడు ఆఫీసులో తిరుపతి వెళ్ళిన విషయం తెలిసిపోతుందని
ఆ సారికి తలనీలాలు ఇవ్వలేదు. దర్శనం పూర్తయ్యి డార్మెట్రీ చేరుకోని
కొద్దిసేపు విశ్రమించారు. అంతలోనే చిన్న నిద్ర అందులో ఒక కల -

ఆయన కోనేరు దగ్గర వున్నారు. చేతిలోవున్న చిన్న బ్రీఫ్‌కేసు గట్టు మీద
పెట్టి కోనేట్లో స్నానానికి దిగారు. మూడు మునకలేసి చూస్తే ఏముంది - ఆ
బ్రీఫ్‌కేసు మాయం. హడావిడిగా ఆ చుట్టుపక్కలంతా వెతకటం మొదలుపెట్టారు.
ఇంతలో ఒక కానిష్టేబుల్ అక్కడికి వచ్చాడు.

మనిషి నల్లటి నలుపు, బాన బొజ్జ, పాత తరం పోలీసు వేసుకున్నట్టు నిక్కరు,
మోకాళ్ళదాకా సాక్సులు, ముఖాన తిరునామాలు.

"ఏమిటయ్యా వెతుకుతున్నావు..??" అడిగాడు
"నేను కోనేట్లో మునకేసి లేచేసరికి నా బ్రీఫ్‌కేస్ పోయింది సార్.."
ఆయన చిన్నగా నవ్వి అన్నాడు -

"బ్రీఫ్‌కేస్ పోతేనేమయ్యా నీ నెత్తిన జుట్టు వుందిగా.."
అంతే - కల చెదిరింది, నిద్ర మెలుకువ వచ్చింది. ఆ తరువాత మా నాన్నగారు
కళ్యాణకట్టకి వెళ్ళారని వేరే చెప్పాలా?? ఇంతకీ ఆ తిరునామాల కానిస్టేబులు
ఎవరంటారు? పోలీసు ఎంకటసామా..??

అంత వివరంగా తెలిస్తే అది దైవలీల ఎందుకౌతుంది??

[అరిపిరాల సత్య ప్రసాద్ ]


మంచి జరిగినా చెడు జరిగినా ఎల్లప్పుడూ కృష్ణభగవానుడు నావెంటే ఉన్నాడన్న భావన ఉన్నవాడిని నేను. భగవంతుని పూర్తిగా విశ్వసించిన వానికి ఆయన లీలలు ఎప్పుడూ మనకు అవగతమవుతూ ఉంటూనే ఉంటాయి. మన మొర సహేతుకమైతే ఆయన తప్పక ఆలకిస్తాడని, తీరుస్తాడని నా నమ్మకం. మన మంచి ప్రయత్నానికి ఆయన ఆశీస్సులు కూడా తప్పక ఉంటాయనడానికి నిదర్శనంగా ఎప్పుడో కాదు ఈ టపా వ్రాయడానికి ప్ర్రారంభించడం మొదలు పెట్టడానికి "వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన, వేంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి" అని తలస్తూ టైపు చేస్తూ ఉండగానే టీ.వీలో గంభీర స్వరంలో ఆ శ్లోకమే వినిపించింది.

ఇక అసలు విషయానికొద్దాం.శ్రీ దుర్గేశ్వర రావు గారు దైవలీలల గురించి మీ జీవితంలో జరిగిన సంఘటనలను తెలుపమన్నారు. 5 సంవత్సరాల క్రితం మా ఊరిలో జరిగిన ఒక సంఘటన ఒకటి మీకు తెలియచేయాలనుకుంటున్నాను

.

"వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన

వేంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి"

"బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు, శ్రీ వేంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు భూత భవిష్యత్కాలాలలోనూ లేడు,"

ఉండబోడన్న ప్రశస్తికి నిదర్శనంగా మా గ్రామంలో జరిగిన ఒక సంఘటన ఒక మచ్చుతునక మాత్రమే. మాది అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలంలోని మిట్టమీద కొట్టాలపల్లె అనే కుగ్రామం. మా గ్రామంలో ఒక చిన్నకారు రైతు ఏకైక 20 ఏళ్ళ కుమారుడు అంతుపట్టని జ్వరంతో బెంగుళూర్ మణిపాల్ హాస్పిటల్ లో చేర్పించబడ్డాడు. వైద్యులు తమ పరిశీలనలో అతనికి డెంగ్యూ జ్వరమని నిర్ధారించి icu లో ఉంచి వెంటిలేటర్ ద్వారా శ్వాసనిస్తూ చికిత్స ప్రారంభించారు. రోగికి దాదాపు 30 సీసాలవరకు రక్తం కావాలన్నారు. విషయం తెలుసుకున్న నేను మాఊరి యువకులతో మాట్లాడి వారినందరినీ సమాయత్తం చేసి వారినందరినీ బెంగుళూరుకు తీసుకొనిపోయి వారందరితో కలిసి రక్తదానం చేసాము. బెంగుళూరులోని మాబంధువులు కూడా వచ్చి రక్తదానం చేసారు. తర్వాత రోగిని చూద్దామని లోనికి వెళ్ళాను. గ్రామంలో మా కళ్ళెదుట ఆడుతూ, పాడుతూ తిరుగుతూ అందరికీ తన చేతనైనంత సహాయం చేసే అబ్బాయి నిస్తేజంగా పడుకొనిఉన్న తీరు చూసి దుఃఖం ఆపుకోలేక కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాను.అబ్బాయితండ్రికైతే ధైర్యం చెప్పాగానీ నాకైతే అబ్బాయి బ్రతికి బట్ట కడతాడనే నమ్మకం సన్నగిల్లింది. రోగి పరిస్తితి గురించి అక్కడ వైద్యులను ప్రశ్నించగా పరిస్తితి చాలా క్లిష్టంగా ఉంది మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఆపై భగవంతుని దయ అన్నారు. అపుడే నేను శ్రీవేంకటేశ్వరున్ని " శ్రీనివాసా! భక్తిప్రపత్తులతో నిన్నుకొలిచేవాడికి విపత్తులనుండి విముక్తి కలిగిస్తావుకదా ! కలియుగ ప్రత్యక్ష్య దైవం అయిన నీవు ఈ అబ్బాయికి స్వస్తత కలిగిస్తేనే నీవున్నట్లు" అని మనసారా ప్రార్తించాను. ఆర్తికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నా కూడా అతనికి డబ్బు వేరేవారి ద్వారా సమకూరడం, రక్తం కూడా లభించడం, తర్వాత మృత్యుద్వారం అంచులవరకు వెళ్ళిన అబ్బాయి అనూహ్యంగా కోలుకుని 3 నెలల తర్వాత మాముందు మామూలుగా తిరగడం చూస్తుంటే అంతా ఆ స్వామి లీలగాక మరేంటి ?

శ్రీనివాసుని ఎల్లప్పుడూ తలచుకుంటూ, భక్తిశ్రద్ధలతో కొలిచేవాడికి ఆపదలు సులభంగా తొలగి పోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతినిత్యం దీనజనులను కాపాడుచున్న ఆ దయాసాగరమూర్తి ,కలియుగ ప్రత్యక్ష్య దైవం శ్రీవేంకటేశ్వరున్ని నిత్యం స్మరిస్తూ స్వామి కృపకు అందరూ అర్హులు కావాలనికోరుకుంటూ…………..


మీ చిలమకూరువిజయమోహన్.(లీలామోహనం)

"ఆ అబ్బాయి పేరు హరిప్రసాద్. భాస్కర్ నాయుడుగారి కుమారుడు."