మిత్రులందరికీ నమస్కారములు.
రెండు నెలల క్రిందట ఓ దంపతులు వచ్చి ప్రాధేయపడినారు వాళ్ళ అబ్బాయ జాతకమును చూపించి.
ఆరు సం. నిండుతున్నా ఇంకా మాటలు సరిగా రాలేదని, మందులు మాకులు ఇప్పించినాము అని.
ఆ కామాక్షిని తలుచుకొని మూకపంచశతిని ఉపదేశించి, రోజూ ఒక పర్యాయము చదువుతూ 40 రోజులు ఉపవాస దీక్షలో పారాయణ చేయమని చెప్పాను.
రోజూ వాగ్దేవీ మంత్రముతో అభిమంత్రించిన బ్రాహ్మీ ఘృతమును ఒకసారి పట్టమని సలహా ఇచ్చినాను. నియమము తప్పకుండా వాళ్ళు దానిని ఆచరిన్చినారు.
ఇప్పుడే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చినది, వాళ్ళ అబ్బాయికి మాటలు, తెలివి బాగా వచ్చినాయి అని, చాలా మార్పు వున్నదని కృతజ్ఞతలు తెలుపుతూ.
నమ్మి కొలిచే వాళ్ళకు భగవదర్శనం, అనుగ్రహం ఎలా దొరుకుతుందో దీనిని బట్టి తెలుస్తుంది...
ఆ తల్లి కామాక్షి లీలలు మరోసారి నిరూపించబడినవి. అమ్మా మహామాయీ ధన్యవాదములు నీకు, బిడ్డలను కాపాడుతున్నందులకు.
మీ
భాస్కరానందనాధ
------------------------------------------------------------------------------------
పూజ్య శ్రీ భాస్కరానందనాథ గారికి నమస్కారము,
అమ్మవారి యొక్క అద్భుతమైన లీలను మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదములు. నిజంగా మూక శంకరులు, కామాక్షి అమ్మ వారి అనుగ్రహముతోనే మాటలు వచ్చి ఐదు వందల శ్లోకాలు అమ్మని కీర్తిస్తూ చేయగలిగారు.
అటువంటి అద్భుతమైన మూక పంచశతి పారాయణ చేస్తే, ఇప్పటికి కూడా, అమ్మ అనుగ్రహం ప్రసరించి మాటలు రాని పిల్లవాడికి మాటలు వచ్చాయి అంటే, ఈ స్తోత్రం ఎంత మహిమాన్వితమైనదో, అర్ధం అవుతోంది.
అసందర్భం అనుకోకపోతే, చిన్న సందేహం, "బ్రాహ్మీ ఘృతము" అంటే ఏమిటో తెలియజేయగలరు. అదేమైనా ఆయుర్వేదముకి సంబంధించిన ఘృతమా?
మీ..
----------------------------------------------------------------------------------
అవును. బ్రాహ్మీ అంటే సరస్వతీ. గోమూత్రములో ముందుగా శుద్ధి చేసిన శీలాజిత్తు, సరస్వతీ ఆకు (బ్రాహ్మీ) చూర్ణము మరియి అశ్వగంధ చూర్ణము, శతావరీ చూర్ణము, తేనె ఇత్యాది దినుసులతో మరియి నేతితో చేయబడిన పాకమును "బ్రాహ్మీ ఘృతము" అని అందురు. ఇది చాలా గాఢమైనది. నాడీ మండలమును, మెదడును, స్వరపేటికను ఉత్తేజపరచును. మాటలు సరిగా రానివారికీ, నత్తిగా మాటలడుచున్న వారికీ ఇది దివ్యమైన ఔషధము. ఆయుర్వేదిక మందులషాపులలో దొరకును.
ఇట్లాంటిదే బ్రాహ్మీ లేహ్యము లేదా సరస్వతీ లేహ్యము ఆయుర్వేదిక మందులషాపులలో దొరకును. పిల్లలకు మంచి స్పురణ శక్తిని అందించును.
ఒక్కోసారి ఒక్క తంత్రము సరిపోదు. తంత్రముతో బాటు మంత్రము కూడా వుండాలి. మందుతో బాటు మంత్రము. మందు అనేది తంత్రము.
మీ
భాస్కరానందనాధ
Labels: దుర్గ 0 comments
దైవాన్ని ఆశ్రయించిన వారిని ఆదైవమెలా వెన్నంటి ఉండికాపాడుతాడో తెలిపే ఒక ప్రత్యాక్షనుభవాన్ని మీముందుంచుతున్నాము .
వినుకొండ లో ప్రముఖ విద్యాసంస్థ "రవీంద్రా హైస్కూల్" విద్యాసంస్థల అధినేత సుభాని గారి స్వానుభవాన్ని తెలియజేస్తున్నారు. ఈయన ముస్లిమ్ అయినా మొదటినుంచి ఏ బేధభావాలు లేకుండా హిందువుల గుడులకెళ్లి పూజలు చేయటం అలవాటు. వీరి నాన్నగారు కూడా తిరుపతికి టూరిస్ట్ బస్సులను తిప్పి జీవనం సాగించేవారు. చినతనం నుంచి వేంకటేశ్వరుని పూజిస్తారు .ఇప్పుడు ఆయన అనుగ్రహం తో సాయి మీద గురుభావం నిలచి పూజిస్తున్నారు. చిన్న స్కూలును పెట్టుకుని ఈరోజు రెండువేలమంది విద్యార్ద్థులతో పాఠశాలను నడపగలిగే స్థితి ఆ భగవంతుని దయవలన సిధ్ధించినదేనని వినయంగా చెబుతారాయన . తన జీవితం లో అడుగడుగునా కష్టాలనుండి ఎలా భగవంతుడు బయటకు లాగాడో చెబుతూ ఒక ఉదాహరణను చెబుతున్నారు.
" మొన్న మాపాఠశాల విద్యార్థులు 140 మందిని తీసుకుని విజయవాడ ఎక్సకర్షన్ కు బయలు దేరాము . నాకు ప్రతి సంవత్సరం అమ్మవారికి చీర రవికె సారెలుగా సమర్పించే అలవాటు ఉన్నది. గత రెండు సంవత్సరాలుగా కుదరలేదు వివిధ కారణాల వలన . మాటీచర్లు సార్ ! మనం అమ్మవారి మొక్కును వెనకేస్తున్నాము ,వెళదాము అని చెబుతున్నారు .అలాగే వెలదామని చెబుతున్నాగాని వీలు పడలేదు.
కాబట్టి విజయవాడైతే అన్నీ కలిసొస్తాయని బయలు దేరాము..నవంబర్ 26 న . వెళ్ళేప్పుడు దారిలో జొన్నలగడ్డ సాయి ఆలయం వద్ద హారతి ఇచ్చి టిఫెన్లు కానిచ్చాము. విజయవాడ వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని సారె సమర్పించాము . క్యూ లైన్లో నేను వెనుక వారికి దారిస్తూ పక్కగా నిలబడి అరగంట సేపు అమ్మవారిని దర్శిస్తూ తన్మయత్వం తో నిలబడ్డాను . అమ్మ అనుగ్రహమేమో అక్కడ సిబ్బంది నన్ను వెళ్ళమని గొడవ చేయలేదు . నాకు కళ్ళు మూసుకుని భగవంతుని ఎదుట నిలబడి ధ్యానించుకోవటం అలవాటు .
ఆ తరువాత విజయవాడలో పిల్లలకు వాటర్ వరల్డ్ తదితరాలు చూపి ,మంగళగిరి నరసింహుని దర్శించి సాయంత్రానికి గుంటూరు దాటి వేములూరి పాడు దాకా వచ్చాము , అక్కడ విశాలమైన ప్రాంగణం గల శివాలయం లో పిల్లలకు టిఫెన్ పెట్టాలని బస్ ఆపుకున్నాము . నేను మాటీచర్లు పిల్లలందరినీ కూర్చో బెడుతున్నాము . ఇంతలో ఒకమ్మాయి మినరల్ వాటర్ కొనుక్కోవాలని రోడ్డుకటువైపున్న షాప్ దగ్గరకు వెళ్ళాలను రోడ్డు కడ్డంగా పరుగెత్తు కెళ్ళింది . అది హైవే కావటం తో శ్రీశైలం నుంచి నూటాఇరవై కిలో మీటర్ల వేగంతో వస్తున్న అయ్యప్పలకు చెందిన టాటా సుమో ను గమనించలేదు . ఈ అమ్మాయి ఇలా హఠాత్తుగా పరిగెత్తు కొస్తుందని ఊహించని డ్రైవర్ షడన్ బ్రేకు ,హాండ్ బ్రేక్ వేశాడు .భీకరమైన శబ్దం సగం ఊరికివినపడింది . గుండెలు గుభిల్లుమన్నాయి .ఆశబ్దానికి తలతిప్పిచూసిన మాకు . అయిపోయింది నాపని కాపాడు స్వామీ ! అని కేక పెట్టి పరుగుతీసానక్కడకు .డ్రైవర్ దూకి పరుగెత్తు కెళ్ళాడెటో .జనం గుంపులుగా పరుగెత్తు కొచ్చారు. వాహనం లో అయ్యప్ప మాలధారులు గడగడా వణుకుతున్నారు . నాకైతే భయంతో సృహతప్పేలావుంది . వెళ్ళి చూస్తే నిజంగా నమ్మలేని చిత్రం .సినిమాటిక్ గావుంటుంది చెప్పాలంటే .
ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఆనుకుని నిలబడి పోయాయి టైర్లు . భయం తో ఆమె సృహతప్పి వున్నది . చేతుల్లోకెత్తుకుని ఆఊరిలో ఆర్ ఎం పీ దగ్గరకు పరు గెత్తు కెళ్ళాము . కొద్దిసేపు సపర్యలు చేసి ,ముఖం మీద నీల్లు చల్లి ప్రయత్నాలు చేశాక .ఆ అమ్మాయి కళ్ళుతెరిచింది . ఇక జనం ఆ స్వాములను నిందిస్తూ కొట్టబోతుంటే మేమే అడ్డుపడ్డాము . స్వామి తప్పు మా పాపదే . రోడ్డుకిరువైపులా చూడకుండా రావటం తప్పే . భగవంతుని అనుగ్రహం తో ఆ పాప ప్రాణాలు ,మేము రక్షింప బడ్దాము. ఆ అమ్మాయికేమన్నా అయితే మా స్థితి చెప్పతరంకాకుండా ఉండేది . ని చెప్పి మీడ్రైవర్ ఎక్కడున్నాడో ఫోన్ చేసి పిలిపించుకోండని చెప్పి , బయలుదేరాము . ఆ అమ్మాయిని నా పక్కనే కూర్చో బెట్టుకుని భయం తీరుస్తూ వినుకొండవచ్చి తల్లిదండ్రుల కప్పగించాము. మరుసనాడు ఆపాప మామూలుగానే బడికొచ్చినది
నిజంగా ఈ ప్రమాదం నుండి నన్ను ఆదైవం కాపాడుండక పోతే సర్వ నాశనం అయ్యేది నాస్థితి. ఆపదలో నున్న భక్తున్ని కనురెప్పలా కాపాడుతున్న ఆబాబా దయ ,నిరంతరం నేను స్మరించే దైవాల అనుగ్రహం నాపై ఉన్నందునే బయటపడగలిగాను . ఇలా నాజీవితం లో ఎన్నో ప్రమాదాలనుండి కాపాడుతున్న ఆదైవశక్తి కి మరోమారు నమస్కరించుకోవటం తప్ప నేనేమివ్వగలను."
Sk.M.Subhaani
ravindra high school
VINUKONDA....GUNTUR [DT]
Labels: దుర్గ 1 comments
| మంత్రానికి శక్తి ఉందా..? - ప్రఖ్యా మధు | ||
| శ్రీ కనక దుర్గ గుడి - కొండమీద రావి చెట్టు వటపత్రాన్ని గురించి చెప్పినప్పుడు ఒక అద్బుత దివ్యశక్తిని కూడా ప్రస్తావించవలసి ఉంది. ఆమే వటపత్ర కాళి. ప్రళయకాల హాలహలంతో సృష్టి అల్లలాడుతుంటే శివుడు తాగిన కాలకూటవిషంలోంచి ఉద్భవించిన వటపత్ర కాళిని, తమిళనాడులో కరుమారియమ్మన్ (ది మదర్ ఆఫ్ బ్లాక్ రైన్) అని పిలుస్తారు. ఆమె వటవృక్షం కింద కూచుని, కుండలినిశక్తి రూపమైన సర్పం కిరీటంగా, పాము పుట్టముందు కూర్చుని ఉంటుంది. పిల్లలకు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ అమ్మవారి కరుణ, శక్తి రెండు వర్ణానాతీతమే. ఒకసారి ధ్యానించినా, పూజించినా, దర్శించినా భక్తులని ఎల్లకాలం కనిపెట్టుకునే దేవతగా ఈమెను యోగులు గుర్తించారు. పెద్దైనా చిన్నైనా అనారోగ్యంతో బాధపడే పిల్లలకోసం ఈమెను పూజిస్తే త్వరగా ఆరోగ్యం చేకూరుతుందని నమ్మకం. మారియమ్మన్ దేవాలయాలు భారతదేశంలోనే కాక సింగపూర్, మలేషియాలలో కూడా వుండడం గమనార్హం. |
Labels: దుర్గ 1 comments
ఆశ్రితజనపోషకి ఆదిపరాశక్తి అనుగ్రహానికి ఉదాహరణ ఇది. నాపేరు సూరి వినుకొండలో రెడీమేడ్ క్లాత్ షోరూమ్ నాది. మేము ఇద్దరము అన్నదమ్ములము. మాకొక అక్కయ్య ఉన్నది .మాబావగారు గోళ్ళకోటేశ్వరరావు గారు కూడా వినుకొండలో నే ఫ్యాన్సీ షాప్ నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు .అమ్మాయిల వివాహము వాల్లకు పెద్దసమస్య అయినది. పిల్లలు ఒకమోస్తరు రూపవతులే. వారికి సంబంధాలు చూడటము మొదలెట్టిన కాడనుండీ అందరూ చూస్తున్నారు,కానీ తరువాత చెబుతామని వెల్లినవారు మరలా సమాధానము పంపటము లేదు. కొందరేదో జాతక దోషాలున్నాయని ,మరికొన్ని దోషాలని శాంతులు గట్రాచేయాలంటే మా అక్కయ్య పాపం అన్నీ చేపిస్తున్నది. మాబావగారికి కొద్దిగా భవంతుడంటె శ్రద్దతక్కువ. ఏదో రమ్మని బలవంతం చేస్తే గుడికి వచ్చి మమ అంటాడు.
చూసే సంబంధాలతో విసుగొస్తున్నది. మా అక్కయ్య కుదిగులు పట్తుకుని ఆరోగ్యం చెడేలావున్నది. దీనికితోడు మరికొన్ని సమస్యలు ఇంట్లో . మేనమామలుగా మాప్రయత్నాలన్నీ చేస్తున్నాము. ఫలితం కనపడటము లేదు.
ఒకసారెందుకో నాకు మేము వెళ్ళే శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం [రవ్వవరం] అక్కయ్యవాళ్లని తీసుకెళదామనిపించింది. పోయిన దసరాకు ముందుగా కుటుంబసభ్యులమంతా వెళుతూ మా అక్కయ్యవాళ్లను కూడా రమ్మనగా ఏకళనున్నాడో మాబావగారు కూడా నేనూ వస్తానని బయలుదేరాడు.
అక్కడ పూజ అవిపూర్తి చేసాక ,దుర్గన్నయ్యను[మీకు దుర్గేశ్వర గాపరిచయం] అన్నా ! అక్కయ్యవాళ్ల సమస్య ఎలా తీరుతుంది అని అడిగాము. దాని కాయన మీరు ఇక్కడదాకా వచ్చి అమ్మనుదర్శించుకుని కూడా మీసమస్యగూర్చి బాధపడుతున్నారంటే మీరు పరిపూర్ణముగా అమ్మను ఆశ్రయించలేదని అర్ధము.అన్నారు .ఏమిచేయమంటారో చెప్పండి అన్నాము. ఎవరి కి ఆకలైతే వారే అన్నంతినాలి అనేది సూత్రం . కనుక అమ్మాయి వివాహం సమస్యను అమ్మాయే పరిష్కరించుకోవాలి. ఏ దోషాలైనా అమ్మను ఆశ్రయిస్తే తొలగిపోతాయి. అమ్మను సర్వానుల్లంఘశాసనా అని అంటారు. అమ్మ శాసనాన్ని ఎవరూ ఉల్లంఘించ సాధ్యము కాదు అని అర్ధము. కనుక అమ్మసేవను నిష్ఠగా చేస్తే అన్ని గ్రహ దోషాలు తొలగుతాయి ,జాతకదోషాలు మిగలవు కనుక రేపు దశరా నవరాత్రులు తొ్మ్మిదిరోజులు పీఠములో ఉండి సేవచేయమను .అమ్మ మీదభారం వేయమను సంవత్సరం లో మరలా దసరాకు భర్తతో వచ్చి దర్శనం చేసుకుంటుంది. అని చెప్పారు.
మామేనకోడలు స్వాతి ఎంతో శ్రద్ధగా నవరాత్రులు లలో పీఠము లోనేవుండి సేవాకార్యక్రమాలలో పాల్గొన్నది. వచ్చిపోయే భక్తులకు అన్నాలు వడ్డించడమేకాక చిన్నపడకుండా ఎంగిలాకులు తీసివేయటం కాన్నుంచి అన్ని సేవాకార్యక్రమాలను మిగతావారితో పోటీపడి నిర్వహించింది.
అమ్మఅనుగ్రహం ,మాకు అనుకోకుండా చీరాల కుచెందిన సంబంధము కుదరటము ,మొన్న ఏడవతారీఖున అమ్మాయి వివాహము జరపటము జరిగినది.స్థితిమంతులు సాంప్రదాయముకలవారు,మంచి వ్యక్తుల సంబంధము కుదరటము అమ్మఅనుగ్రహమే.పసుపుబట్టలతో దంపతులు పీఠానికి వచ్చి అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు. ఆశ్రయించినవారి నిఆదుకోవటములో అమ్మ దయ అపారమని మాజీవితములో నిరూపితమైనది.
Labels: దుర్గ 1 comments

అది ఒక పెద్ద కుటుంబము .పండగ వచ్చినదంటే ఇంట్ళో వచ్చినబంధువులతో సందడే సందడి. అలాంటి ఇంట్లో నుంచి కేకలు వినబడుతున్నాయి. ఏమిటయ్యా అబద్దాలాడుతున్నావు . ఒకావిడ గద్దిస్తున్నది.
"లేదమ్మా నేను అబద్దం చెప్పటములేదమ్మా .నేను" ఇంతమందికి ' గాజులు వేశాను అని వివరిస్తున్నాడు గాజుల మలారం అబ్బి.
ఇంట్లో వున్న పిల్లలకంటే నువ్వు ఒకరు ఎక్కువ చెబుతున్నావు. ఆమె కోప్పడుతున్నది.
లేదమ్మా అయ్యగారింట్లో నేనే ఎప్పుడూ గాజులు వేస్తుంటాను .నేనెప్పుడూ అబద్దం చెప్పను వాదిస్తున్నాడతను.
ఇంతలో ఇంటి యజమాను రాలు బయటకు వచ్చి పోనీలేవే , పిల్లల్లో ఎవరన్నా ఆకతాయి తనంగా మరలా వేపించుకుని ఏడిపిస్తున్నారేమోలే .డబ్బులిచ్చి పంపు. అని డబ్బుతీసి ఇచ్చినది.
ఇలాంటి సన్ని వేశము మరలా మరలా ప్రతి పండగకూ ఆడపిల్లలకు గాజులు వేపించినప్పుడల్లా జరుగుతున్నది. గాజులు వేసే వాళ్ళు మారినా ఈ సన్నివేశం మరటం లేదు. ప్రతిసారీ గాజుల వాళ్ళు ఇంతమందికి గాజులు తొడిగాననటము,లెక్కచూస్తే ఇంట్లో వున్న ఆడపిల్లల కంటే ఒకరికి ఎక్కువగా గాజులు తోడిగానని గాజుల వాళ్లు లబలబలాడటము సామాన్యమయి పోయినది. ఇలా కాదని ఒకరోజు ఈసన్నివేశం ప్రత్యక్షమవగానే ఇంటియజమానిని ,అడిగాడు గాజుల వ్యాపారి. అయ్యగారూ ఒక్కరికి ఎక్కువ గాజులు తొడిగానని అబద్దమాడి డబ్బులు తీసుకుంటున్నానని అమ్మగారు వాళ్ళు తిడుతున్నారండి. నేను [ఇంత] మందికి గాజులు వేశానండి సత్యప్రమాణముగా చెబుతున్నా నండి అని బాధపడ్దాడు .
"అవును నువ్వన్నన్తమందికి గాజులు తొడిగావు.నువ్వుచెప్పినది నిజమే అన్నాడా తేజో మూర్తి.
అదెలాగండీ ,మనింట్లో వున్నవాళ్ళు ఇంతమంది ఆడపిల్లలు మాత్రమె ,ప్రతిసారీ వున్నవారికంటే ఒకరికి ఎక్కువచెబుతున్నాడు ఈగాజులశెట్టి ...ఫిర్యాదు చేసినది ఇల్లాలు. అవును నువ్వన్నది కూడా నిజమే ఇప్పుడు ఇంట్లో వున్న ఆడపిల్లలు నువ్వు చెప్పినంతమందే కాని అతను చెప్పినది కూడా నిజమే అన్నారాయన సంతోషముతో నవ్వుతూ. అదెలాగండీ చోద్యం అన్నదావిడ . ఆఒక్క చిన్నారి ఎవరనుకుంటున్నావు ? ఆజగన్మాత: "బాల "పిల్లల తో కలసి ప్రతిసారీ ఇలా వేడుకగా గాజు లేపించుకుంటున్నది ,అని వివరించాడాయన
దైవరహస్యాన్ని.
ఆతపోమూర్తి ,మహాసాధకుడూ, దత్త మూర్తి శిష్యుడూ బాలా ఉపాసకుడయిన చందోలు శాస్త్రిగారు. వారి వారిజీవితములో జరిగిన దైవలీలలను చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు. వారి పార్ధివ దేహాన్ని దహనంచేసున్నప్పుడు ఫోటోలు తీయగా ఆ-ఫోటో లో ఒక దివ్యమూర్తి కనిపించటం అది పత్రికలలో వచ్చి సంచలనము కలిగించినవిషయము ఆంధ్రులకు తెలిసినదే. నేను కూడా చదువుకునేటప్పుడు ఆ చాయా చిత్రాన్ని చూశాను. సంపాదిద్దామంటే దొరకలేదు. ఎవరిదగ్గరన్నా వుంటే పంపగలరని ప్రార్ధన.
దైవం ప్రేమ భావం నిండిన మానవ జీవితాలలో ప్రత్యక్షముగా సాక్షాత్కరించి తన లీలా వినోదాలను సాగిస్తున్నదనటానికి ఒక ఉదాహరణ చందోలు శాస్త్రిగారి జీవితము.
Labels: దుర్గ 3 comments

నేడు మానవుడు తానే గొప్పవాడు , దేవుడు లేదు, దయ్యము లేదు అనుకుని విర్రవీగుతున్నాడు. కాని ఈ విశ్వాన్నంతటిని నడిపించేది ఒకే శక్తి ఉంది. ఆ శక్తి నుండి ఉద్భవించిన కోట్లాది దేవతలు. మనకు నచ్చినట్లుగా వేర్వేరు పేర్లతో ఆ దేవుడిని పిలుచుకుంటాము. రాముడైనా, అల్లా ఐనా, క్రీస్తు ఐనా ఒక్కడే అని నా నమ్మకం. ఎవరికైనా నమస్కారం , పూజలు చేయడానికి నేను సంసిద్ధంగానే ఉంటాను. మరి ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు. నేను నోములు , వ్రతాలు, ఉపవాసాలు చేయను. అలా అని నాస్తికురాలిని కాదు. మనస్పూర్తిగా నమస్కరిస్తే ఆ దేవుడు మన మనస్సులోనే ఉంటాడు అని నమ్మేదాన్ని. ఒక గృహిణిగా నా కుటుంబ బాధ్యతలే నాకు దైవపూజతో సమానం అని భావిస్తాను. అందుకే వాటికే ముందు ప్రాముఖ్యతనిస్తూ వస్తున్నా. అవి సమర్ధవంతంగా నిర్వహిస్తూ, అప్పుడప్పుడు చేతనైనంత ఇతరులకు సాయం చేయడం . ఇవన్నీ దైవభక్తి అని నమ్ముతాను.
కాని నా పిల్లల విషయంలో జరిగిన రెండు సంఘటనలు ఎప్పటికీ మర్చిపోలేను. ఈ విషయం వింటే ఎందరో నవ్వుకోవచ్చు. పిచ్చి సెంటిమెంట్ అని. కాని నేను ఆ దేవుడి లీలను స్వయంగా చూసినదాన్ని. మా అమ్మాయి EAMCET పరీక్ష కోసం చిల్కూరు దగ్గరలో ఉన్న కాలేజిలో సెంటర్ పడింది. అప్పుడు ఆ గుడిలో మొదటిసారిగా నేను దేవుడిని కోరుకున్నాను. మా అమ్మాయికి హైదరాబాదులో, ఫ్రీ సీట్ రావాలని. ఎందుకంటే ఆ సమయంలో ఎక్కువ ఫీజ్ కట్టే పరిస్థితుల్లో లేము కాబట్టి , అమ్మాయి పెద్ద చదువులు చదవాలనే ఆశతో అలా కోరుకున్నాను. విచిత్రంగా మొదటి కౌన్సెల్లింగ్ లోనే మా అమ్మాయికి సిటీలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రీ సీటొచ్చింది. ఏడాదికి 8000 మాత్రమే. అది వాళ్లకు ఏడాది స్కూలు ఫీజ్ కంటే తక్కువే. ఆ తర్వాత నేను మా అమ్మాయి కలిసి చిల్కూరు వెళ్లి 108 ప్రదక్షిణలు చేసాము. ఎలాగూ ప్రతి సంవత్సరం తిరుపతి వెళతాము. కాని ఇది మాత్రం నాకు సంబంధించి ఒక అద్భుతం. ఇప్పటికీ కూడా తను ఆ వేంకటేశ్వరుడి కరుణతో ఉద్యోగంలో కూడా ఉన్నత స్థితిలో ఉంది.
ఇక మా అబ్బాయికి EAMCET లో చాలా ఎక్కువ ర్యాంకు వచ్చింది. అసలు అంతవరకు నంబర్లు కౌన్సెలింగుకు పిలవలేదు. ఏడాది చదువు పోయింది అనుకున్నాము. వాడు కూడా చాలా దిగాలు పడిపోయాము. డోనేషన్లు కట్టే పరిస్థితి కాదు. డిగ్రీలో చేరాలా, ఇంట్లోనే ఉండి మళ్లీ చదువుకోవాలా అని తర్జనా భర్జన పడుతున్నాడు. చివరి ప్రయత్నంగా నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న దుర్గ గుడికి వెళ్లి అమ్మకు నమస్కరించి నా కొడుకుకు ఒక దారి చూపించు తల్లి వాడి భవిష్యత్తు పాడు కానివ్వకు అని వేడుకున్నాను. ప్రతి రోజు 108 ప్రదక్షిణలు 108 రోజులు చేసాను. మా అబ్బాయి 21 రోజులు చేసాడు. పాపం వాడు కూడా చాలా నిరాశగా ఉన్నాడు. అదృష్టవశాత్తు 21 రోజులు ఐన మర్నాడే పేపర్లో ఒక వార్త వచ్చింది. ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోయినండువల్ల మళ్లీ కౌన్సెలింగ్ కు పిలవాలి అని. అందులో మా వాడిది మొదటి రెండు రోజులలోనే ఉంది. అప్పుడు కాని మా ఇంట్లో అందరికీ మనసు కుదుటపడలేదు. మావాడి మొహంలో తిరిగి కళ వచ్చింది. అసలు సీట్ రాదనుకున్న తరుణంలో మావాడికి ఊరవతల కాలేజీ ఐనా Electronics and Instrumentation లో సీట్ వచ్చింది. అది కూడా చాలా అదృష్టం కదా. అంతా ఆ అమ్మ దయ అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. నేను ప్రతి దసరా నవరాత్రులలో ప్రతి రోజు గుడికెళతాను. నేను ఏ పని చేసినా అమ్మా నీదే భారం. నాకు ఈ పని నిర్విఘ్నంగా పూర్తి చేసే శక్తి నివ్వు అని కోరుకుంటాను. అన్నీ ఆ అమ్మ చూసుకుంటుంది అనే ధైర్యం ఉంది నాకు అని చెప్పగలను. అదేంటోగాని నాకు ఆనందాన్నిచ్చే శుభవార్తలు మంగళవారాలే వస్తాయి మరి..
జ్యోతి వలబోజు...
Labels: దుర్గ 11 comments