నిష్కామంగా ఉండటం తేలిక కాదు!

దైవానికి చేరువ కావాలంటే బాహ్య వ్యవహారాలు మానేయాలా? అని చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. మీరసలు బాహ్య వ్యవహారాలు పూర్తిగా మానేయగలరా? ఓ సారి గమనించి చూడండి. మీరసలు వేటిని బాహ్య వ్యవహారాలని అంటారు. ఉదాహరణకు నేను ఒక కొబ్బరిచెట్టును పెంచుతున్నాను అనుకోండి. అది ప్రాపంచిక వ్యవహారమే. నా అన్నం నేను వండుకుంటున్నాను అనుకోండి. అది కూడా ప్రాపంచిక వ్యవహారమే. అంటే ప్రాపంచిక వ్యవహారాలు తప్పవు. అవిలేకుండా మీరు బతకలేరు. బాహ్యంగా ఏం చేస్తారో అది మీ వ్యక్తిగతం. ఉదాహరణకు అందరూ రాజకీ యాల్లో చేరనవసరం లేదు. సంఘంలో ఒకరు రాజకీయాలలోకి వెళితే ఇంకొకరు ఆఫీసు పని చేయవలసి వస్తుంది. మరొకరు ఫ్యాక్టరీ నడపవలసి వస్తుంది. మరొకరు రోడ్లు ఊడ్చవలసి వస్తుంది. అందరూ ప్రాపంచిక వ్యవహారాలే చేస్తున్నారు. అందుకే మనం ప్రాపంచిక వ్యవహారాల నుంచి పూర్తిగా వైదొలగలేం.

బాధ్యత తెలియందెవరికి?
బాహ్యంగా ఏం చేయాలనుకుంటున్నామో, ఎంత చేయాలనుకుంటున్నామనే విషయాన్ని మాత్రమే మనం నిర్ణయించుకోగలం. అంతే. అందరికీ ఆ అవకాశం ఉండాలి. ఉంది కూడా. ఏమి చేయాలో తెలియని వారే మిగతా వాళ్లు చేసేది అనుకరిస్తూ ఇలా ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. స్వతహాగా ఏమి చేయాలో వారికి తెలియదు. కావలసింది చేసుకోవడానికి అవసరమైన తెలివి, సామర్థ్యాలు వారికి లేవు.

అలాంటి వారే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్లను గురించి, "వీళ్లకు అసలు బాధ్యత తెలియదు. ప్రపంచానికి కావలసింది కాకుండా ఏదేదో చేస్తుంటారు'' అని ఫిర్యాదులు చేస్తుంటారు. అసలు తమ ఆఫీసులోనో, ఇంటిలోనో ఉండేవారు కూడా తమ పనులే చేసుకుంటున్నారు. వారికి ప్రపంచ సౌఖ్యం గురించి ఆసక్తే వుండదు. అసలు తమకేమి కావాలో కూడా వారికి తెలియదు. తాము కూరుకుపోయిన ఊబిలో నుంచి అసలు ఎలా బయటపడాలో కూడా వారికి తెలియదు. తమకు చేతకాకపోగా తమ వ్యవహారాలను తమకు కావలసిన రీతిలో చక్కదిద్దుకుంటున్న ఇతరులదే తప్పు అంటున్నారు.

అందరూ పనిచేస్తే... అంతే!
ఒకరోజు ఒక తాగుబోతు ఎలాగో బస్సెక్కాడు. ముందరి వారిని తొక్కుకుంటూ, సామానులు పడేసుకుంటూ హాయిగా కూర్చున్న ఓ ముసలావిడ పక్కసీట్లో కూర్చోబోతూ ఆమె మీద పడ్డాడు. అమె వాడిని తోసేస్తూ, 'నువ్వు సరాసరి నరకానికి పోతావు' అని తిట్టింది. ఆ తాగుబోతు ఒక్కసారిగా లేచి అవునా, అయితే నేను పొరపాటున ఈ బస్సెక్కాను, అంటూ బస్సులో నుంచి దూకేశాడు. తాగుబోతులకు ఎవరు తప్పుడు బస్సెక్కారో తెలియదు. తాము కూరుకుపోయిన స్థితి నుంచి బయటకు రావటం చేతకాని వారికి తమకు కావలసిన రీతిలో బతుకులు చక్కదిద్దుకుంటున్న వారంటే అసూయ.

వాళ్లెప్పుడూ ఫిర్యాదులు చేస్తునే ఉంటారు. వీళ్లు ప్రపంచం నుంచి తప్పించుకుంటున్నారని అంటునే ఉంటారు. ఈ తరహాలో ఇంతమంది ఇలా శ్రమిస్తుంటే, ఈ భూగోళం పదేళ్లు కూడా ఉండలేదు. అదృష్టవశాత్తు భూమి మీద సగం మంది బద్ధకస్తులే. మిగిలిన సగం మంది శ్రమించే వారే ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. నిజంగా ఆధ్యాత్మికతలో ఉన్న వారు బహుశా ఒక శాతం మంది ఉంటారేమో. ఈ ప్రపంచాన్ని సరిచేయాలంటే సగం మందినైనా ఆధ్యాత్మిక మార్గంలో పెట్టాల్సిన అవసరం ఉంది.

అధికశ్రమ నుంచి తప్పుకునే వారు తమకు కానీ, ప్రపంచానికి కానీ, పర్యావరణానికి కానీ ఎలాంటి హానీ కలిగించటం లేదు. అనవసరంగా శ్రమించే వారే నిజంగా ప్రపంచానికి హాని చేస్తున్నారు. అవునా? మూఢంగా ఏమి చేస్తున్నామో గమనించకుండా, ఎవరో చేస్తున్నది అనుకరిస్తూ, అందరికన్నా వారే ఎక్కువ హాని కలిగిస్తున్నారు. ప్రపంచానికి, దాని మీద మనుగడకూ వారే అపకారం చేస్తున్నారు. వారే ఈ ప్రపంచ నాశనానికి కారణం అవుతున్నారు.

అందుకే ఈ అనవసరపు, అర్థంలేని పనుల నుంచి తప్పుకోవడమే మీ తక్షణ కర్తవ్యం. కానీ అది అంత సులభం కాదు. ఊరకే కూర్చోవడం అంటే ఎంతో పరిణితి అవసరం. అవసరమైన మేరకే పనులు చేయడమే కావలసింది. ఇది మీరు బద్ధంకంతోనో, బాధ్యతారహితంగానో చేయగలిగిన పని కాదు. మీరు ఎంతో ఎరుకతోనూ, వివేకంతోనూ మాత్రమే చేయగలుగుతారు.
- సద్గురు

2 comments:

anrd said...

చక్కటి పోస్ట్ ను అందించినందుకు ధన్యవాదాలండి.

Sai said...

చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు..