అపార కరుణాసింధుం 
జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం 
ప్రణమామి ముదావహం !!

కామకోటి పీఠంలో 16-18 వ తేదీ వరకూ పరమాచార్య ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి... మన సత్సంగంలోనూ ఆ స్పర్శ ఉండాలనే ఉద్దేశ్యంతో, చంద్రశేఖరేంద్రుల ఆశీర్వచనం ఎల్లప్పుడూ మనకి ఉండాలనీ వారికి సంబంధించి కొన్ని విషయాలు పంచుకునే ప్రయత్నం... వీలైన అందరూ అటువంటి విషయాలు అందరితో పంచమనవి...

1961వ సంవత్సరంలో..... నడిచే దేవుడు, మహాస్వామి జగద్గురు పరమాచార్యా శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్య స్వామి వారు, దక్షిణదేశం లోని చిదంబర యాత్ర ముగించుకుని, దాని సమీపంలోని తాండవన్ పురం అనే గ్రామానికి చేరారు. స్వామివారికి ఆ గ్రామస్తులు, పండితులు ఘన స్వాగతం పలికారు. ఆ గ్రామంలోని  కామాక్షి అమ్మవారి అతి పురాతనమయిన ఆలయంలో పూజలు నిర్వహించిన పిమ్మట, స్వామి వారు, ఆ ఆలయప్రాంగణం లోని మహామంటపంలో చేరిన భక్త సమూహానికి ' చిదంబర రగస్యాన్ని (రహస్యాన్ని) ' వివరిస్తున్నారు. 

సభకు సమీపంలో,  బిగ్గరగా అరుస్తూ, అల్లరి చేస్తూ ఆటలాడుకుంటున్న కొందరు బాలురుని వారించడానికి వెళ్ళుతున్న ఆలయ సిబ్బందిని పిలిచి " ఆ పిల్లలను నా వద్దకు తీసుకు రండి " అని చెప్పారు పరమాచార్య .  భయం భయం గా వచ్చి చేరిన ఆ పిల్లలకు తెల్లకాగితాలు ఇచ్చి, " మీ అందరూ ' శ్రీ రామాయ నమః ' అని నూరు సార్లు వ్రాసి నాకు చూపించండి....మీ అందరికీ మంచి బహుమతులు ఇస్తాను " అన్నారు మహాస్వామి. 

పిల్లలందరూ, స్వామి వారు చెప్పినట్టుగా, బుద్ధిగా వ్రాస్తూ కూర్చోడంతో, స్వామి ప్రశాంతంగా ప్రజలకు ' చిదంబర రహస్యాన్ని' విప్పి చెప్పారు. అనంతరం ఆ బాలురు ఒక్కోకరుగా వారు రాసిన పత్రాలను స్వామికి సమర్పిస్తున్నారు. పిల్లల చేత స్వామివారు, వారు వ్రాసిన ' శ్రీ రామాయ నమః ' అనే పదాన్ని ఒక్కసారి చెప్పించి మరీ ఆ పత్రాన్ని తీసుకుంటూ, వారికి కామాక్షీ అమ్మవారి బంగారు ముద్రను బహుకరిస్తున్నారు. ఆ వరుసలో వచ్చిన ఓ పది - పదకండేళ్ళ పిల్లాడి వద్ద కూడా పత్రాన్ని తీసుకుని " సొల్లు (చెప్పు) ....' శ్రీ రామాయ నమః '....సోల్లూ " అని, తానూ వ్రాసింది పలకమంటున్నారు స్వామి. కానీ ఆ పిల్లవాడు పలకడంలేదు. బిక్కమొఖం వేసుకుని స్వామి వారి వంక భయంగా చూస్తున్నాడు. 

ఆ భగవంతుని తప్ప మరేవ్వరనీ తాకని ఆ స్వామి, ఆ పిల్లవాడి అరచేతులను గట్టిగా పట్టుకుని, ఆ అరచేతుల్ని తమ బ్రోటని వ్రేళ్ళతో గట్టిగా రాపిడి కలుగజేస్తూ " సొల్లు.....శ్రీ రామాయ నమః ...." అంటూ, ఆ పిల్లవాడి వైపు తీక్షణంగా చూస్తున్నారు. ఆ ఊరి పండితులు  " అయం మూకః ( అతడు మూగవాడు ) " అని స్వామికి చెప్పారు. అయినా అవేమి పట్టించుకోని ఆ స్వామి " సొల్లు.....శ్రీ రామాయ నమః " అని పిల్లాడి వైపు చూస్తూ బిగ్గరగా అరిచారు. 

పిల్లవాడు భయంతో గజగజా వణికి పోతున్నాడు....కళ్ళ వెంట నీరు ధారగా ప్రవహిస్తోంది. ఆ ఆలయంలో ' sweeper ' గా పనిచేసే ఆ పిల్లవాని తండ్రి, అతని తల్లీ, మిగతా భక్త జనం, పండిత సమూహం, స్వామివారి శిష్యులూ....ఇలా అంతా కళ్ళప్పగించి, చేతులు జోడించి జరుగుతున్న దృశ్యాన్ని చూస్తూ నిలబడిపోయారు.            

" సీ..... లా....మా నమ " భయంతో వణికిపోతున్న పిల్లవాడు, తన జీవితంలో పలికిన మొట్ట మొదటి మాట.
 " శ్రీ రామాయ నమః .... " ( మళ్ళా మళ్ళా చెప్పిస్తున్నారు స్వామివారు. )    
" సీ రామా నమ " ( ఇంతకు మించి చెప్పలేను అంటున్నాడు పిల్లవాడు.) 
 " శ్రీ రామాయ నమః " ( నువ్వు అందుకునే వరకూ వదలనంటున్నాడు పరమాచార్యుడు.)
" సీ రామాయ నమః " ( నేనూ మాట్లాడగలుగుతున్నాను...)
" శ్రీ రామాయ నమః " (పాప ప్రక్షాళన జరిగిపోయింది, ఇప్పుడు నీవేమైనా చెయ్యగలవు....)  
" శ్రీ రామాయ నమః " ( నడిచొచ్చిన దేవుడా ....ఎప్పటికీ నిన్ను వదలక పట్టెద....)

అంతే.... ఒక్కసారి కళ్ళముందు జరుగుతున్నది నమ్మలేక మూగబోయి....అంతలోనే తేరుకుని సంభ్రమాశ్చర్యాలతో గొల్లు మంది జనవాహిని. ఆనందంలో తల్లి స్పృహకోల్పోగా, తండ్రి పరుగున వెళ్ళి పరమాచార్యుని పాదాల పై పడ్డాడు. మూకుమ్మడి సాష్టాంగ నమస్కారాల మధ్య ఆ దేవుడు నడుస్తూ, అందరినీ దీవిస్తూ, తమ వ్యాను వైపుకు వెళ్ళుతుంటే....వారి పాదముద్రల మధ్య మన్నునే వీభూదిగా స్వీకరించి ఆనందంలో తాండవించింది...ఆ ' తాండవన్ పురం '.      

-మంచి కుటుంబం వారి వద్దనుండి తీసుకున్నది  [అయ్యంగారి సూర్య నాగేంద్రకుమార్]

0 comments: