-----------------------------------

ఈ వృత్తాంతం పూరీ మహాక్షేత్రం దగ్గర ఒక ఊరిలో జరిగిందని ప్రతీతి.
భగవన్నామ బోధేంద్రసరస్వతిస్వామివారు కాశీ యాత్రా సమయంలో పూరీ క్షేత్ర సమీపంలోని ఒక గ్రామంలో నడుస్తూ ఒక ఇంటి అరుగు మీద సేద తీర్చుకోవటానికి కూర్చుని ధ్యాన నిమగ్నులై ఉన్నారు. అటువంటి మహానుభావుడు యాదృచ్చికంగా కనిపించే ఏ పని చేసినా మహత్కార్యంగా రూపొందుతుంది. వారు కూర్చున్న ఆ అరుగుగల ఇల్లు మహాపండితుడైన ఒక అపూర్వ రామ భక్తునిది. (వారిపేరు సరిగా గుర్తులేదు.) వారు రామనామసంకీర్తనా మాహాత్మ్యం మీద అనేక సప్రామాణిక గ్రంథాలను సంస్కృతంలో విరచించారు. వారు శరీరంతో ఉండేటప్పుడు ఎందరినో ఆదుకొని, ఎందరి జీవితాలనో రామనామ భిక్షతో తరింపజేశారు. అప్పటికీ ఇప్పటికీ ఆ ప్రాంతాలలో ఏ సమస్య తలెత్తినా పరిష్కారనికై వారింటికి పరుగిడి రావడమే అక్కడివారందరి అలవాటు.

మనస్వామి ఆ అరుగుపై కూర్చుని ఉండగా తమిళనాటికు చెందిన ఒక సద్బ్రాహ్మణుడు, ఒక ముస్లిం యువతి రాత్రిపూట చీకటి మరుగున అక్కడ చేరారు. వారిద్దరూ ఏదో ఆపదలో ఉన్నారు. అప్పటికి ఆ పండితుడు పరమపదించగా వారి తనయులు జగన్నాథశాస్త్రిగారు ఉన్నారు. ఈ ఆపన్నులు జగన్నాథశాస్త్రిగారిని గట్టిగా ఆర్తనాదాలలో పిలిచి లేపి వారి కథ చెప్పుకున్నారు.

జరిగిన విషయం ఏమనగా: ఆ సద్బ్రాహ్మణుదు భార్యా సమేతుడై దక్షిణాదినుండి కాశీ క్షేత్రానికి కాలినడకన వెళ్తూండగా దారిలో వారు విశ్రమిస్తున్న ఒక చోటు నుండి ముస్లిం దుండగులు వీరికి మత్తిచ్చి ఆయువతిని నోరు కట్టి అపహరించుకుని పోయారు. జరిగినదేమిటో తెలియక, దిక్కు తోచక కొంతకాలం తిరుగాడి ఈ సద్బ్రాహ్మణుడు కాశీకి కొనసాగి క్షేత్రధర్మములాచరించి అక్కడ చేయవలసినవనుష్ఠించి మరలి వస్తూండగా ఈ యువతి (అపహరింపబడిన తన భార్య) ముస్లిం వేషధారణలో తన్ను బంధించిన వారినుండి పారిపోతూ కనపడింది. అప్పటికే కొన్ని నెలలు కావటం చేత ఈయన గుర్తు పట్టకపోయినా ఆమె గుర్తు పట్టింది. తిరిగి ఈ అనపరాధయైన యువతిని భార్యగా స్వీకరించాలా లేదా అన్నది ఆయనకు ధర్మసందేహం. భార్యగా కాకపోయినా కనీసం ఒక సేవిక గా స్వీకరించటానికి ధర్మశాస్త్రంలో వీలు ఉందా అని ఆశ కలిగింది. దుండగుల కంటపడకుండా అర్థరాత్రిళ్ళు సంచరిస్తూ సమస్యా పరిష్కారానికై వీరింటికి చేరారు.

జగన్నాథ పండితుల వారు ఏమి చెప్తారా అని మన స్వామివారు ఊపిరి బిగపట్టి వింటూన్నారు. స్వామివారి శరీరం రోమాచితం కాగా వారి హృదయం పులకించగా జగన్నాథ పండితులవారు ఒక్క క్షణం కుడా ఆలోచించకుండా చెప్పిన విషయం ఏమిటంటే, "ఓ బ్రాహ్మణా, ఈ యువతి తాను చేయని నేరానికి ముస్లింలచే చెరచబడి వారి మతములోకి మార్చబడినది. ఇదేమాత్రము? ఈ యువతి రామనామమును ’రామా రామా రామా’ యని మూడుసార్లు వల్లించిన ఎటువంటి దోషమైనా పరిహారమగును; నిశ్చింతగా నిశ్శంకగా నీవామెను భార్యగా తిరిగి స్వీకరించవచ్చు. శ్రీజగన్నాథుల మీద ఆన" అని పలికెను. అప్పటికే నిద్రలేచిన వారి తల్లి "జగన్నాథా, నీవేల ఇంత చిన్న తప్పిదానికి రామనామమును మూడు సార్లు వల్లించమని చెప్పి రామనామ మహిమను కించపరుస్తున్నావు? ఇదే మీ తండ్రిగారైతే ఒకేఒక్క సారి చెప్పమనియుండెడివారు" అన్నారు. అప్పుడు స్వామివారు "మాతా, ఇప్పుడు జరిగిన సంఘటనను కన్నులారా చూసి చెవులారా వినిన భాగ్యము ఆ శ్రీరాంచంద్రుడు నాకు కలుగచేశారు. అమ్మా అన్యథా భావించక, మీరిరువురూ ధైర్యముగా చెప్పిన ఈ పరిహారమునకు ప్రమాణము కలదా?" అని అడిగారు. వెంటనే జగన్నాథ శాస్త్రి గారు వారి తండ్రిగారు రచించిన సప్రమాణిక గ్రంథాన్ని వీరికందించారు. స్వామివారు ఒక దీపం వెలిగించమని ప్రక్కన కూర్చుని ఆ గ్రంథాన్ని అక్కడే సాంతం చదివేశారు.

తదుపరి, వారు ఆ నలుగురినీ ఉద్దేశించి "ఇంత గొప్ప మహత్తరమైన విషయం మన నలుగురిలో అణగారిపోకూడదు. ఇది అందరికీ చాటి చెప్ప వలసిన విషయం" అని చెప్పి తెల్లవారాక అక్కడున్నవారినందరినీ ప్రోగేసి నదీ తటానికిపోయి (నది పేరు నాకు గుర్తులేదు)
అక్కడచేరినవారందరి మధ్యా ఒక ప్రతినబూనారు. "రామనామం పవిత్రమైనదైతే, రామనామ సంకీర్తన ఉత్కృష్టమై పతితపావనమైతే, ఈ ముస్లిం వేషధారిణియైయున్న యువతి రామనామం జపిస్తూ నదీ జలంలో మునుగగా పవిత్రురాలై ముస్లిం వేష వివర్జితయై వెలికి వస్తుంది." అలా చెప్పి ఆ యువతి వైపు చూసి "నీకు రామభక్తి ఉందా, రామనామం పట్ల శ్రధ్ధా, రామనామం పట్ల నమ్మకం ఉందా?" అని అడిగారు. ఆమె, "ఇంతవరకు అంతగా లేదు, ఇదిగో ఇప్పుడు మీరు చెప్పిన మాటలవల్ల అమితమైన గురి కుదిరింది స్వామీ" అని బదులిచ్చింది.

వీరికీ జగన్నాథ పండితులకీ నమస్కారములిడి భక్తితో రామనామం ఉచ్చరిస్తూ నదిలోనికి దిగి మునకవేసిన ఆమె పూర్తి పునిస్త్రీగా పసుపు నీటిలో స్నానం చేసినట్టు కనిపిస్తూ పసుపు కుంకుమలతో పువ్వులతో చీరతో బయటకి వచ్చింది!

రామనామ మాహాత్మ్యం పట్ల అద్వితీయమైన నమ్మకం కలిగిన భగవన్నాములవారు పూనుకుని పలువురి ఎదుట ఈ యుగంలో చేసిన ఒక గొప్ప మహత్యం ఇది.

ఇప్పటికీ ఆ ప్రాంతాలలోను, గోవిందపురం ప్రాంతాలలోను కుడా ఈ వృతాంతాన్ని రామభక్తులు సదా ఒకరికొకరు చెప్పుకుంటూ ఆనందిస్తూంటారు.

శ్రీ అరుణాచల రమణార్పణమస్తు.

0 comments: