భగవాన్ - భగవద్గీత!
ఆత్మానుభవంతో జీవన్ముక్తుడై, సహజస్థితిలో స్వాత్మానందుడై, జ్ఞానమే సాకారమైన భగవాన్ శ్రీరమణ మహర్షి భగవద్గీతను అరచేతిలో అమలకంగా అందిస్తే? అందుకోగలిగినవాడికది ఒక అపురూపఫలం. అదొక రమణీయ గీతం! ఆ పాత మధురగీతం! "జననమరణాలు , భూత భవిష్యత్, వర్తమానాలు అనే విభజన మనం చేసుకున్నవే. కాలం అఖండం! నీవు-నేను అన్న ద్వైతం మనం అనుకుంటున్నదే. అపరిణామము, కాలాద్యవిచ్ఛిన్నమైన సత్యమే శాశ్వతం.
అది మార్పెరగనిది. బంధము, బంధన, ముక్తి దేహానికే గాని ఆత్మకు లేవు. అభ్యాసం ఒక నిరంతర ప్రక్రియ. వైరాగ్యం ఒక అంతరంగ భావన. ఇవన్నీ సహజస్థితులే. ప్రపంచమంతా పరమాత్మ రూపమే. నీవు విస్తృతమౌతున్న కొద్దీ పరిపూర్ణత అనుభవంలోకి వస్తుంది. దేహమే 'అసలునీవు' కానపుడు, నీవు కర్తవూ కాదు. కర్తృత్వమూ లేదు, జరుగుతున్న అనేక విషయాలలో నీ ప్రమేయం నిజానికి శూన్యం. ఉన్నదంతా అనుకోవటంలోనే ఉన్నది. ఇటువంటి భావనే కర్మయోగం. కర్మలన్నిటికీ నీవు కర్తవు కాదు. కర్మలు జరుగుతూనే ఉంటాయి. నీ సాధనతోనే సమాధానం పొందాలి.
మనసు నియంత్రించుకోవడం, ఆలోచనలను క్రమబద్ధీకరించుకోవటం, అభ్యాసం. నిరంతరాభ్యాసం భౌతిక వస్తువుల పరిమితిని తెలియచెప్పి అవి అందించే సుఖసంతోషాలు తాత్కాలికమని బోధిస్తుంది. ఒక అనుభవాన్ని కలిగిస్తుంది. అది వివేకాన్ని ప్రసాదిస్తుంది. దాంతో వైరాగ్యం లభిస్తుంది. ఇకపై మిగిలినదంతా శాంతే. శాంతి లోపల ఉన్నదని, ఎవరో యిచ్చేది కాదని, మనంతట మనమే పొందాలని అనుభవమౌతుంది. నువ్వన్నావన్న వాస్తవమే, దైవమున్నాడనటానికి తిరుగులేని సాక్ష్యం.
పరమాత్మ ప్రకాశాన్ని కంటితో దర్శించలేకపోవటానికి కారణం కన్ను భౌతికస్థాయిలో ఉండటమే. అది పనిచేయటానికి మూలమైన కారణాన్ని, వస్తువును, శక్తిని తెలుసుకోగలిగితే, ఆ శక్తే 'ఆత్మ' అని తెలుస్తుంది. మూడో కన్ను అంటే ఆత్మే! తాను చూడటానికి తనకంటే భిన్నమైన వస్తువేదీ ప్రత్యేకంగా లేదు కనుక, ఆత్మకు చూడటం అంటూ లేదు. ఉండటమే! అదీ సాక్షిగా. 'నేను చేస్తున్నాను' అనే కర్తృతభావం ఉన్నంతకాలం, అది కర్మే! ఆ భావం నశించి కర్మలు జరుగుతుంటే అదే కర్మయోగం. భగవంతుని పట్ల ఉండే తీవ్ర ఆవేశము, ఉద్విగ్నము, తాదాత్మ్యము కలిస్తే అది భక్తి.
నిర్మలము, నిశ్చలము, అరుణము, నికామము కలిగిన భక్తిభావమే భక్తియోగం. అహం నశించి, మనసు హృదయంలో లీనమై, ఆత్మ విచారంలో నిలకడ చెందితే అది జ్ఞానయోగం. నీలో నీవు ఉంటేనే నీవు ధ్యానివి. నీతో నీవు ఉంటేనే నీవు యోగివి. వాస్తవంలో జీవించమని, వాస్తవాన్ని గ్రహించమని, ఆత్మే వాస్తవమని భగవద్గీత బోధిస్తుంది. అనుభవజ్ఞానమే అసలు విద్య. అనుభవమే గురువు. అనుభవమే ఆత్మ. సర్వప్రాణుల హృదయాలలో ఉన్న 'నేను' ఆత్మే! శ్రీమత్ భగవత్ గీతా సారమంతా, కర్మ భక్తి జ్ఞానయోగాల విచారణంతా, ఆత్మ విచారమార్గం వైపు నడిచే సాధకుడికి భగవాన్ రమణులు అనుగ్రహించిన సంక్షిప్త గీతోపదేశం అన్ని స్థితులలో ఉన్నవారికి మార్గదర్శకం. అది సరళమైన అధ్యాత్మ సాధనకు దివ్య ఉపకరణం.
వి.యస్.ఆర్ మూర్తి
ఆధ్మాత్మిక శాస్త్రవేత్త
0 comments:
Post a Comment