రామ ప్రతిష్ఠ - వరద ముంపు
నాగాయలంక లాంచీరేవు గట్టున సంతరోజు చేపల తట్టలు, గడ్డి మూటలు పెట్టుకుని అమ్ముకునేవారు. అక్కడి నుండి లాంచీలమీద సుమారు వేయి మంది పెనుమూడి మీదుగా గుంటూరు జిల్లాకు పోతారు. దాదాపు వేయి మంది అక్కడికి వస్తారు.
అలాంటి తావులో భగవంతుడు జ్ఞాపకం వస్తే బాగుంటుందని తోచి, స్వహస్త పరహస్తాలతో శ్రీ కోదండరామాలయం, రమాసహిత సత్యనారాయణ ఆలయం రెండూ నిర్మించడం జరిగింది. జయిపూర్ నుండి చలువరాతి విగ్రహాలు తెప్పించాము. 1964 మే నెల 31 తేదీ నాటికి ప్రతిష్ఠకు ముహూర్తం నిశ్చయించాము. అందుకు సమస్తమైన ఏర్పాట్లు జరిగాయి.
ఇంతలో, కంచి పెద్దస్వాములు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి షష్టిపూర్తి మే నెల 25వ తేదీన కంచికి మూడుమైళ్ళ దూరంలో అంబి గ్రామంలో జరుగుతుందని తెలిసింది. నేను మా శిష్యుడు తుంగల నాగభూషణం ఇద్దరం బయలుదేరిపోతూ, 31వ తేదీ ప్రతిష్ఠ నాటికి తప్పకుండా వస్తామని, ప్రతిష్ఠకు పూర్వం జరగవలసిన అధివాసాదులు చేసి సిద్ధంగా ఉండండని చెప్పి, మేము అంబికి బయలుదేరాము. అప్పుడు అక్కడికి శ్రీ మండలీక వెంకటశాస్త్రి, శ్రీ కుప్పా లక్ష్మావధానులు, శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి గార్లు కూడా వచ్చారు.
షష్టిపూర్తి రోజున మాకెవరికీ స్వామి వారి తీర్థం దొరకలేదు. ఆ మర్నాడు 26వ తేదీ తీర్థం పుచ్చుకుందా మనుకున్నాము. ఆనాడే నేను స్వామి దర్శనం చేసింది. అంతకు పూర్వం నేనెన్నడూ చూడలేదు. నేను తీర్థానికి చెయ్యి చాచాను. స్వామి నాకు తీర్థమిచ్చి, చేతిలో ఉన్న పెద్ద ఉద్ధరిణె కింద పెట్టి, “ప్రతిష్ఠ ఎప్పుడు?” అని అడిగారు. నేను నిర్ఘాంతపోయాను. “మా ఇంట్లో మందిరంలో ఎప్పుడో అయింది” అన్నాను. “అది కాది. నది ఒడ్డున ఏర్పాటుచేశావే, ‘రామ పాద క్షేత్రం’ అక్కడి ప్రతిష్ఠ” అన్నారు.
“దానిని మే 31వ తేదీన చేద్దామని అనుకున్నాము” అన్నాన్నేను.
స్వామి వారు వెంటనే “31వ తేదీన చేస్తారా?” అని అన్నారు
స్వామి ప్రశ్నార్థకంగా అన్న మాటలో ఆ రోజున ప్రతిష్ఠ జరగదనే ధ్వని వినిపించింది.
స్వామి మాకు అక్షింతలు, కుంకుమ, కిస్మిస్ పండు ప్రసాదంగా ఇచ్చి, యంత్రానికి ప్రత్యామ్నాయంగా వాటిని విగ్రహాల కింద ఉంచందని సెలవిచ్చారు.
ఇంతలో 28-5-1964న ప్రధానమంత్రి నెహ్రూ గారు పరమపదించారు. అందుచేత ఆనాడు రైళ్ళు, బస్సులు నడవలేదు. 29వ తేదీ బయలుదేరి 30వ తేదీ సాయంత్రానికి మేము ఊరు చేరుకున్నాము. మేము ఊరిలో లేనందున ‘గురువుగారు లేని ప్రతిష్ఠా’ అంటూ గ్రామస్తులు ఏ పనీ మొదలుపెట్టలేదు. అందుచేత మళ్ళా జూన్ 11వ తేదీన ప్రతిష్ఠకు ముహూర్తం పెట్టి ఆపని నిర్వహించాము. స్వామివారన్నది నిజమైంది.
మరొక విచిత్రమేమంటే, స్వామివారాస్థలాన్ని ‘రామపాదక్షేత్ర’మని ఎందుకన్నారు? తరువాత రెండు నెలలకు నాగార్జునడాము విరిగి కృష్ణానదికి అంతులేని వరద వచ్చింది. అప్పుడు ఆ వరద నీరు గుడిలో శ్రీరామపాదాల నంటి తగ్గిపోయింది. ఆ వరద ఇంకో అంగుళం పెరిగినట్టయితే దివితాలూకాలో 70 గ్రామాలు వరదకు కొట్టుకుపోయేవి.
వారికి భూత భవిష్యత్ వర్తమానములు అన్నీ తెలుసు. వారు కాలమునకు లొంగని కాలాతీతులు.
--- శ్రీరామ శరణ్ కుందుర్తి వెంకట నరసయ్య

అపార కరుణాసింధుం 
జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం 
ప్రణమామి ముదావహం !!

కామకోటి పీఠంలో 16-18 వ తేదీ వరకూ పరమాచార్య ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి... మన సత్సంగంలోనూ ఆ స్పర్శ ఉండాలనే ఉద్దేశ్యంతో, చంద్రశేఖరేంద్రుల ఆశీర్వచనం ఎల్లప్పుడూ మనకి ఉండాలనీ వారికి సంబంధించి కొన్ని విషయాలు పంచుకునే ప్రయత్నం... వీలైన అందరూ అటువంటి విషయాలు అందరితో పంచమనవి...

1961వ సంవత్సరంలో..... నడిచే దేవుడు, మహాస్వామి జగద్గురు పరమాచార్యా శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్య స్వామి వారు, దక్షిణదేశం లోని చిదంబర యాత్ర ముగించుకుని, దాని సమీపంలోని తాండవన్ పురం అనే గ్రామానికి చేరారు. స్వామివారికి ఆ గ్రామస్తులు, పండితులు ఘన స్వాగతం పలికారు. ఆ గ్రామంలోని  కామాక్షి అమ్మవారి అతి పురాతనమయిన ఆలయంలో పూజలు నిర్వహించిన పిమ్మట, స్వామి వారు, ఆ ఆలయప్రాంగణం లోని మహామంటపంలో చేరిన భక్త సమూహానికి ' చిదంబర రగస్యాన్ని (రహస్యాన్ని) ' వివరిస్తున్నారు. 

సభకు సమీపంలో,  బిగ్గరగా అరుస్తూ, అల్లరి చేస్తూ ఆటలాడుకుంటున్న కొందరు బాలురుని వారించడానికి వెళ్ళుతున్న ఆలయ సిబ్బందిని పిలిచి " ఆ పిల్లలను నా వద్దకు తీసుకు రండి " అని చెప్పారు పరమాచార్య .  భయం భయం గా వచ్చి చేరిన ఆ పిల్లలకు తెల్లకాగితాలు ఇచ్చి, " మీ అందరూ ' శ్రీ రామాయ నమః ' అని నూరు సార్లు వ్రాసి నాకు చూపించండి....మీ అందరికీ మంచి బహుమతులు ఇస్తాను " అన్నారు మహాస్వామి. 

పిల్లలందరూ, స్వామి వారు చెప్పినట్టుగా, బుద్ధిగా వ్రాస్తూ కూర్చోడంతో, స్వామి ప్రశాంతంగా ప్రజలకు ' చిదంబర రహస్యాన్ని' విప్పి చెప్పారు. అనంతరం ఆ బాలురు ఒక్కోకరుగా వారు రాసిన పత్రాలను స్వామికి సమర్పిస్తున్నారు. పిల్లల చేత స్వామివారు, వారు వ్రాసిన ' శ్రీ రామాయ నమః ' అనే పదాన్ని ఒక్కసారి చెప్పించి మరీ ఆ పత్రాన్ని తీసుకుంటూ, వారికి కామాక్షీ అమ్మవారి బంగారు ముద్రను బహుకరిస్తున్నారు. ఆ వరుసలో వచ్చిన ఓ పది - పదకండేళ్ళ పిల్లాడి వద్ద కూడా పత్రాన్ని తీసుకుని " సొల్లు (చెప్పు) ....' శ్రీ రామాయ నమః '....సోల్లూ " అని, తానూ వ్రాసింది పలకమంటున్నారు స్వామి. కానీ ఆ పిల్లవాడు పలకడంలేదు. బిక్కమొఖం వేసుకుని స్వామి వారి వంక భయంగా చూస్తున్నాడు. 

ఆ భగవంతుని తప్ప మరేవ్వరనీ తాకని ఆ స్వామి, ఆ పిల్లవాడి అరచేతులను గట్టిగా పట్టుకుని, ఆ అరచేతుల్ని తమ బ్రోటని వ్రేళ్ళతో గట్టిగా రాపిడి కలుగజేస్తూ " సొల్లు.....శ్రీ రామాయ నమః ...." అంటూ, ఆ పిల్లవాడి వైపు తీక్షణంగా చూస్తున్నారు. ఆ ఊరి పండితులు  " అయం మూకః ( అతడు మూగవాడు ) " అని స్వామికి చెప్పారు. అయినా అవేమి పట్టించుకోని ఆ స్వామి " సొల్లు.....శ్రీ రామాయ నమః " అని పిల్లాడి వైపు చూస్తూ బిగ్గరగా అరిచారు. 

పిల్లవాడు భయంతో గజగజా వణికి పోతున్నాడు....కళ్ళ వెంట నీరు ధారగా ప్రవహిస్తోంది. ఆ ఆలయంలో ' sweeper ' గా పనిచేసే ఆ పిల్లవాని తండ్రి, అతని తల్లీ, మిగతా భక్త జనం, పండిత సమూహం, స్వామివారి శిష్యులూ....ఇలా అంతా కళ్ళప్పగించి, చేతులు జోడించి జరుగుతున్న దృశ్యాన్ని చూస్తూ నిలబడిపోయారు.            

" సీ..... లా....మా నమ " భయంతో వణికిపోతున్న పిల్లవాడు, తన జీవితంలో పలికిన మొట్ట మొదటి మాట.
 " శ్రీ రామాయ నమః .... " ( మళ్ళా మళ్ళా చెప్పిస్తున్నారు స్వామివారు. )    
" సీ రామా నమ " ( ఇంతకు మించి చెప్పలేను అంటున్నాడు పిల్లవాడు.) 
 " శ్రీ రామాయ నమః " ( నువ్వు అందుకునే వరకూ వదలనంటున్నాడు పరమాచార్యుడు.)
" సీ రామాయ నమః " ( నేనూ మాట్లాడగలుగుతున్నాను...)
" శ్రీ రామాయ నమః " (పాప ప్రక్షాళన జరిగిపోయింది, ఇప్పుడు నీవేమైనా చెయ్యగలవు....)  
" శ్రీ రామాయ నమః " ( నడిచొచ్చిన దేవుడా ....ఎప్పటికీ నిన్ను వదలక పట్టెద....)

అంతే.... ఒక్కసారి కళ్ళముందు జరుగుతున్నది నమ్మలేక మూగబోయి....అంతలోనే తేరుకుని సంభ్రమాశ్చర్యాలతో గొల్లు మంది జనవాహిని. ఆనందంలో తల్లి స్పృహకోల్పోగా, తండ్రి పరుగున వెళ్ళి పరమాచార్యుని పాదాల పై పడ్డాడు. మూకుమ్మడి సాష్టాంగ నమస్కారాల మధ్య ఆ దేవుడు నడుస్తూ, అందరినీ దీవిస్తూ, తమ వ్యాను వైపుకు వెళ్ళుతుంటే....వారి పాదముద్రల మధ్య మన్నునే వీభూదిగా స్వీకరించి ఆనందంలో తాండవించింది...ఆ ' తాండవన్ పురం '.      

-మంచి కుటుంబం వారి వద్దనుండి తీసుకున్నది  [అయ్యంగారి సూర్య నాగేంద్రకుమార్]

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
ఇరవైనాలుగుకోట్ల రామనామ జపలక్ష్యంగా ఈ సంవత్సరం జరిగిన హనుమద్రక్షాయాగం ఆరవ ఆవృత్తి మరో మూడు రోజుల్లో పూర్తి కానుంది. శుక్రవారం హనుమజ్జయంతి సంధర్భంగా స్వామికి అభిషేకాదులు, 24న పూర్ణాహుతి నిర్వహించడం జరుగుతోంది .ఈ సంవత్సరం రోజుల్లో ఆ స్వామి ఎప్పటిలాగే చాలా లీలలు కనబరిచారు. అందులో ఒకటి,
నేను ఇంతకుముందు పని చేసిన సంస్థలో నా సహోద్యోగికి ఒక సమస్య వచ్చింది. సంవత్సరం క్రితం  తనకు ఒక పెళ్ళి సంబంధం వచ్చింది. సరే చూద్దాం అనుకునే లోపు వారి వైపు పెద్దవాళ్ళు ఒకరు చనిపోయారు. దాంతో సంవత్సరం వరకు వాయిదా వెయ్యాల్సి వస్తుంది అన్నారు. పెళ్ళి కొడుకు తరపు వాళ్ళు మాకేమీ అభ్యంతరం లేదు అన్నారు. ఇక పెళ్ళి మాటలు ఏమీ మాట్లాడుకోలేదు ఎవరూ. వారింటికి వీరు వెళ్ళడం, వీరింటికి వారు వెళ్ళడం మా కోడలని, మా అల్లుడని  పరిచయం చేసుకోవడం అన్నీ జరుగుతున్నాయి. సంవత్సరం అయ్యాక పెళ్ళి మాటలు అనుకునేటప్పుడు ఇరువైపుల వారిది ఒకే కులం కాదని తెలిసింది. దాంతో పెళ్ళికూతురి తండ్రి ఈ సంబంధం వద్దు అన్నారు. వీళ్ళిద్దరేమో సంవత్సరం నుండి భార్యాభర్తలమవుతామనుకుని అనుకున్నాము. ఇప్పుడు వద్దంటే ఎలా? అని. ఆ అమ్మాయి పాపం చాలా బాధ పడుతూ ఉండేది. నన్నొకసారి అడిగింది. ఏం చెయ్యాలి అని.
"చూడండి నాకు తెలిసింది ఒకటే, ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా భగవంతుడిని అడగడమే, లేదంటే ఇదే నాకు మంచి అని భగవంతుడు నిర్ణయించాడు అనుకుంటాను. మీరు పలానాది నాకు మంచి అని అనుకుంటున్నారు కాబట్టి మీ సింహాసనం లో ఉన్న కుల దైవాన్ని అడగండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అడుగుతారు? స్వామీ నాకు దారి చూపించు అని నిలదియ్యండి" అన్నాను. ఆ అమ్మాయి కొంచెం విస్మయంగా చూసింది. "అవునండీ తప్పులేదు, మీరు రోజు దీపం పెట్టి దణ్ణం పెట్టుకునే భగవంతుడిని అడగకపోతే ఇంకెవరిని అడుగుతారు. నాకు తెలిసినంత వరకైతే ఆ స్వామి భార్యాభర్తల విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఆయనే దాంపత్యానికి రక్ష, అందుకే ఎవరి ఫొటో ఉన్నా లేకున్నా పెళ్ళిళ్ళలో ఇప్పటికీ సీతారాములుంటారు. వాళ్ళద్వారా ఆశీస్సులిస్తూ హనుమ ఉంటారు. మీరు చేస్తానంటే నాదగ్గర ఓ మార్గం ఉంది అన్నాను. " చెప్పండి అన్నది ఒకింత ఆశగా. "నేను మీకు హనుమాన్ చాలీసా ఇస్తాను. నిజమైన తాటియాకులమీద రాసిన హనుమాన్ చాలీసా ఇంతకుముందు ప్రసాదంగా హనుమద్రక్షాయాగంలో మాస్టరుగారు ఇచ్చారు. నాకెందుకు మాస్టరుగారు నేను చాలీసా చూసి చదవను కదా అంటే ఆయన ఉంచు ఎవరికైనా నిజంగా అవసరం అనిపించినప్పుడు ఇవ్వు అన్నారు. నాకెందుకో అది మీకు అవసరం అని అనిపిస్తుంది. అది ఇస్తాను . ఒక నలభై రోజులు రోజుకి పదకొండుసార్లు పారాయణ చెయ్యండి.  నలభైరోజులు పూర్తి కాకుండానే మీ పెళ్ళి పత్రిక తీసుకువస్తారు స్వామి అనుగ్రహం ఉంటే అన్నాను. నిజంగానా అన్నది. పుస్తకాల్లో చదివి నేను చెప్పడంలేదు, నా స్నేహితుడొకరికి నిజంగా జరిగింది కాబట్టి చెప్తున్నాను అన్నాను. చేస్తానండి అని చెప్పి తీసుకొన్నది. తరువాత నలభై రోజులయ్యాక ఫోను చేసాను ఏమైందండి అని, ఏమీ కాలేదండి అన్నది. మీరు హనుమాన్ చాలీసా నిజంగా చేసారా నేను చెప్పినట్టు అన్నాను. కుదిరినప్పుడల్లా చేసానండి,ఒక్కోసారి ఆఫీస్ వల్ల కుదరలేదు అన్నది.

అలాకాదండి, సీరియస్ గా నలభై రోజులు నేను చెప్పినట్టు చెయ్యండి. జరగకపోతే అప్పుడడగండి అన్నాను. సరే అని ఆ రోజునుండి చాలీసా క్రమం తప్పకుండా పారాయణ చెయ్యడం మొదలుపెట్టింది. కొన్ని రోజులయ్యాక మనోహర్ గారు ఒక గుడ్ న్యూస్ అన్నది, ఏమంటే కనీసం రెండువైపుల వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవాలని అనుకున్నారు అని చెప్పింది. మరికొన్ని రోజుల తర్వాత తరువాత పెళ్ళికి ఒప్పుకున్నారు ఉత్తరభారతంలో ఉండే మా పెదనాయన గారు ఒకాయన వచ్చి పిల్లగురించి కూడా అలోచించండి అని సర్దిచెప్పి ఒప్పించారు అని అన్నది. ఇదంతా మీనోటి చలవే మనోహర్ గారు, నాకోసమే ఆ చాలీసా మీదగ్గరకొచ్చిందేమో అని అన్నది. అలా ఏం లేదండీ, మీ కష్టం తీరే మార్గం ఉంది అని స్వామి నాతో చెప్పించారు. నేను కాకపోతే మరొకరు చెప్పేవారు, ఆ స్వామి అనుగ్రహం మీ మీద ఉంది ఒకసారి ఆయన పాదాలు పట్టి చూసారు కదా, ఇక విడవకండి. ఇంతకీ పెళ్ళెప్పుడు అన్నాను. ఇంకా ముహుర్తాలు అనుకోలేదు శ్రీరామనవమి అయిన తర్వాతి రోజు పెట్టుకుంటారు అన్నది. ఇంకేం సంపూర్ణ శ్రీరామపరివార అనుగ్రహం మీమీద ఉంది. ఇక భయపడకండి అన్నాను. ఇంకా మీపారాయణ ఎన్ని రోజులుంది అని అడిగాను. ఐపోవచ్చింది ఇంకొన్ని రోజుల్లో అయిపోతుంది అన్నది. నేను చెప్పాను కదా మీ పారాయణ పూర్తయ్యేలోపు మీ సమస్య పరిష్కారం అవుతుంది అని అన్నాను. పారాయణ పూర్తయ్యేలోపు పెళ్ళికి ముహూర్తం నిర్ణయించారు జూన్ 19 అని చెప్పింది. ఆరేడు నెలల నుండి ఆమె గొంతులో అంత సంతోషం ఎప్పుడూ వినలేదు, మనసులోనే స్వామికి సాష్టాంగ ప్రణామం చేసుకున్నాను.
అలాంటి అసాధ్యసాధక స్వామికి రేపు అభిషేకాలు, అవబృధ స్నానాలు జరుగుతాయి.  ఈ సారి నాకు మరింత ప్రత్యేకం, పెళ్ళైనతర్వాత మొదటిసారి అందరం వెళ్తున్నాం.ఆ స్వామి అనుజ్ఞ గానే పెళ్ళి చేసుకున్న నా భార్యని, ఆ స్వామి గండంనుండి బయటపడేసి బతికించిన బిడ్డని ఆయనకి చూపించడానికి తీసుకువెల్తున్నా. అన్నిటికంటే మరింత ప్రత్యేకం మా నాన్నగారు కూడా ఈసారి యాగానికి వస్తున్నారు. చాలా ఆత్రంగా ఉంది. ఈ రెండురోజులు గడిచిపోతే శుక్రవారం తెల్లారేటప్పటికి ఆ స్వామి ముందు ఉంటాను.

అవబృధ స్నానానికి భక్తుల తరపున 108 కలశాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఏవరైనా రావాలనుకున్నా, తమ పేరు మీద కలశం ఏర్పాటు చెయ్యాలనుకున్న, యాగానికి ఏదైనా సహాయం చెయ్యాలనుకున్నా నన్ను కానీ మాస్టరుగారిని కానీ సంప్రదించగలరు.         
వివరాలు
durgeswara.blogspot.in(9948235641)durgeswara@gmail.com
మనోహర్-9742702802
విధేయుడు
మనోహర్ చెనికల