ప్రహ్లాదుని నిర్మల భక్తి





మంచి వల్ల కలిగే మేలును, చెడు వల్ల కలిగే కీడును కథల రూపంలో వివరించడమే పురాణ లక్షణం. ఎంత కష్టమైనా చెడుపై మంచి సాధించే గెలుపుకు తోడుగా దేవుడు ఉంటాడని, తద్వారా మంచిని పెంచుకోవడమే దైవత్వమని ఈ కథలు బోధిస్తాయి. ఈ కోవకు చెందినదే ప్రహ్లాద, హిరణ్య కశిపుల కథ.

మంచికి మారుపేరు ప్రహ్లాదుడైతే, చెడుకు రూపం హిరణ్య కశిపుడు. ప్రహ్లాదుడి గుణగణాలను శత్రువులు కూడా పొగుడుతారు. హిరణ్య కశిపుని పేరు తలచుకుంటే ముల్లోకాలూ గడగడలాడిపోతాయి. విభిన్న గుణాలు కలిగిన వీరిద్దరూ తండ్రీకొడుకులు కావడం దైవ సంకల్పం.

ఘోర తపస్సు చేసి, ప్రాణుల వల్ల గాని, ఆయుధాల వల్ల గాని, పంచభూతాలలో దేని వల్లగాని చావులేని అపూర్వ వరాన్ని పొందిన హిరణ్య కశిపుడికి ప్రధాన శత్రువు విష్ణువు. దేవతలను కాపాడే అతన్ని ఎలాగైనా చంపాలన్నది అతని లక్ష్యం. ప్రహ్లాదుడు పూర్వపుణ్యం వల్ల తల్లి కడుపులో ఉన్నప్పటి నుండీ జీవులు తరించడానికి అవసరమైన మోక్ష మార్గాన్ని, దాన్ని ప్రసాదించే పరమాత్మ స్వరూపాన్ని గ్రహించాడు.

జగమంతా నిండిన ఆ పరమాత్మను స్మరించడమే అతని ఏకైక వ్యాపకం. ఆకలి అని గాని, దాహం అని గాని అడగడు. నిద్రపోవాలని ఎవరైనా చెబితేనే నిద్రపోతాడు. హరి నామస్మరణ ఫలితంగా ఐదేళ్ల ప్రాయంలోనే అతనికి శంఖ చక్రాలు, గద, పద్మం ధరించిన నారాయణమూర్తిగా పరమాత్ముడు దర్శనమిచ్చాడు.

సహజంగానే ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేని ప్రహ్లాదుడు పరమాత్ముని దర్శనమైన తరువాత మరింత వైరాగ్యంలో పడి పోయాడు. శ్రీహరి తనతో కలిసి ఆడుకుంటున్నట్లు చేతులు చాపు తాడు. తనవైపుకు వస్తున్నట్లు భావించి పరుగెత్తేవాడు. శ్రీహరి స్వయంగా ఆహారం, పానీయాలు అందిస్తున్నట్లు నోరు తెరిచేవాడు. చక్కిలిగింతలు పెట్టినట్లు నవ్వేవాడు. శ్రీమహావిష్ణువుతో శేషతల్పంపై పడుకుంటున్నట్లు కటిక నేలపై పడుకుని హాయిగా నిద్రపోయేవాడు.

ఇలా లోక రక్షకుడైన శ్రీమహావిష్ణువు సాన్నిధ్యంలో ఉన్నట్లు భావించి, ప్రపంచాన్ని మరిచిపోయేవాడు చిన్నారి ప్రహ్లాదుడు. దాంతో దానవ చక్రవర్తి కాగల ఏ గుణాలూ లేకుండా, అతి సామాన్యంగా, తన లక్షణాలు ఇసుమంత కూడా కనిపించడంలేదని బాధపడ్డాడు హిరణ్య కశిపుడు. చదువుకుంటే బాగుపడతాడని గురువులకు అప్పగించాడు.

ప్రహ్లాదుడు గురువులను, పెద్దలను చూడగానే వినయంతో వంగి నమస్కరిస్తాడు. స్త్రీలు ఎదురుపడితే తల్లిగా భావించి తలవంచు కుంటాడు. ఆటలకైనా అబద్ధం చెప్పడు. పోట్లాట పెట్టుకోడు. రాజు కొడుకునన్న గర్వం, అహంకారం కొంచెమైనా చూపించడు. గురువులు తండ్రికి భయపడి, అతను చెప్పిన విధంగా పాఠాలు చెప్పినా, అది అబద్ధమని తెలిసినా ఎదురు తిరగడు.

కొన్నాళ్ల తరువాత కొడుకు పరిస్థితి ఎలా ఉందో తెలుసు కోవాలన్న కోరిక హిరణ్య కశిపునికి కలిగింది. వెంటనే ప్రహ్లాదుని పిలిపించి, ఒడిలో కూర్చుండబెట్టి, ఒక్క శ్లోకం చెప్పమన్నాడు. ప్రహ్లాదుడు శ్రీమహావిష్ణువు పాదాలు ఆశ్రయించినవారికి, సంసార కష్టాలు తొలగిపోతాయని ఎంతో శ్రావ్యమైన శ్లోకం చదివాడు.

శ్రీహరి ద్వేషియైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు తన కొడుకన్న విషయాన్నే మరిచాడు. శత్రువును కీర్తించే ఈ దుర్మార్గుడిని, అది మానేవరకూ కఠినంగా శిక్షించమని ఆదేశించాడు. విష సర్పాలతో కాట్లు, ఏనుగులతో తొక్కించడం, సముద్రంలోకి విసిరేయడం, కొండ పైనుండి పడేయడం, శూలాలతో గుచ్చడం... ఇలా ఎన్నో చిత్ర హింసలతో ప్రహ్లాదుడిని బాధించారు. ఇన్ని చిత్రహింసలు పెట్టినా ప్రహ్లాదుడు దైవాన్ని దూషించలేదు, అర్థించలేదు. తండ్రి అజ్ఞానానికి బాధపడ్డాడు తాను నమ్మిన సత్యానికి కట్టుబడి నిశ్చలంగా ఉన్నాడు.

ముల్లోకాలనూ గడగడలాడించిన హిరణ్య కశిపుడు, తన కొడుకు మనోనిగ్రహాన్ని చూసి మొదటిసారిగా భయపడ్డాడు. ప్రహ్లాదునికి అండగా ఉన్న ఆ శ్రీహరిని అతని ద్వారానే బయటకు రప్పించి, నాశనం చెయ్యాలనుకున్నాడు. అతడు అంతగా నమ్ముకున్న శ్రీహరి ఎక్కడున్నాడని ప్రహ్లాదుని ప్రశ్నించాడు. అండ పిండ బ్రహ్మాండాల లోని అణువణువులోనూ ఉన్నాడన్నాడు.

హిరణ్య కశిపుడి కోపం తారస్థాయికి చేరుకుంది. చేతిలో గదను పెట్టి, ॥ఎదురుగా కనిపించే స్తంభంలో శ్రీహరి ఉన్నాడా?** అని అరిచాడు. ఉన్నాడని శాంతంగా బదులు చెప్పాడు ప్రహ్లాదుడు. గదతో ఒక్కసారిగా స్తంభాన్ని తాకాడు. అప్పుడు కూడా తనను కాపాడమని ప్రహ్లాదుడు స్వామిని పిలవలేదు.

కానీ తనను నమ్ముకున్నవారిని రక్షించడమే కర్తవ్యంగా భావించి, హిరణ్య కశిపుని వరం ప్రకారం, సగం మనిషి, సగం మృగ రూపంతో నరసింహావతారంలో స్తంభం నుండి వెలువడి, తన తొడలపై హిరణ్య కశిపుని పెట్టి, ఏ ఆయుధాలు ఉపయోగించకుండా గోళ్లతో చీల్చి చంపి, హిరణ్యకశిపుడనే చెడును తొలగించాడు.

మంచి, శాంతం, దయ, కరుణ, వినయం మొదలైన లక్షణాలు కలిగిన ప్రహ్లాదుడిని భూలోక చక్రవర్తిగా సింహాసనంపై కూర్చోబెట్టి, శ్రీమన్నారాయణుడు ఆశీర్వదించాడు.
ఎస్.రాజ్యలక్ష్మి

0 comments: