‘కృష్ణ’ శబ్దం మనోహరం
- దుర్గ
సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మరో రూపమే శ్రీకృష్ణ భగవానుడు. ద్వాపర యుగంలో పుట్టి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసిన కరుణామయుడు. కారుణ్యశీలుడు. ఆదర్శ పురుషుడు. ప్రేమతత్వాన్ని అనేక దృక్పథాలలో విపులీకరించిన ఆదర్శమూర్తి. భగవద్గీత ద్వారా అనేక విధాలైన ఆధ్యాత్మిక మార్గాలను మనకు అందించిన దివ్య పురుషుడు. యుగ ధర్మాలను, సాంఘిక న్యాయాలను, అనంతమైన విశ్వతత్త్వాన్ని తెలియచెప్పిన మహనీయుడు. అలాంటి శ్రీకృష్ణ మంత్రం బాహ్యశత్రువులను, అంతశ్శత్రువులను హరించే శక్తి కలది. సకల వేదాంతాలందూ చెప్పబడిన పూజ్య మంత్రమిది. సమస్త సంసార చింతనలను, సర్వైశ్వర్యాలను ఇచ్చే దివ్య మంత్రమిది. శ్రీకృష్ణునకు భక్తి పూర్వకముగా ఒక్కసారి నమస్కరిస్తే పది అశ్వమేధ యాగాలు చేసి, అవభృధ స్నానం ఆచరించినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుని త్రికరణశుద్ధిగా భక్తిశ్రద్ధలతో నమస్కరించిన మాత్రానే జన్మరాహిత్యం కలుగుతుంది. ‘కృష్’అనగా ‘సత్తు’, ‘ణ’ అనగా ఆనందమని అర్థం. అంటే సదానందము లేక సచ్చిదానందమని అర్థం.
కలియుగాన ‘కృష్ణ కృష్ణ’ అనే మంత్రాన్ని ఎవరు అహోరాత్రులు స్మరిస్తారో అలాంటివారు సాక్షాత్తు శ్రీకృష్ణ రూపాన్ని పొందుతారని పురాణోక్తి. ఓంకారం మొదలు వేదాల వరకూ ‘కృష్ణ’ అనే రెండక్షరాలు సమస్త విఘ్నాలను హరించి మనోభిష్టాలను నెరవేరుస్తున్నాయి. అలాంటి శ్రీమహావిష్ణువు స్వరూపమయిన శ్రీకృష్ణ భగవానుడు కారణజన్ముడు. మధురలో పుట్టి, గోకులంలో పెరిగి, నంద యశోద ప్రేమకు పాత్రుడైన వాడు. గోపీ మానస చోరుడు, అర్జున రథసారథి అయిన శ్రీకృష్ణ భగవానుడి ఆవిర్భావమే దుష్టశిక్షణ. కంసుని దురాగతాలను అంతమొందించడానికి, నిరాశ్రయులైన దీనులను ఉద్ధరించడానికి అవతరించినవాడు.
గోకులంలో పెరిగాడు కాబట్టి గోపాలకృష్ణుడయ్యాడు. యమునా నదీ తీరంలో కాళీయమర్థనం చేసిన మహనీయుడాయన. బాల్యంలోనే తన నోటిలో అండపిండ బ్రహ్మాండాలను చూపించిన దైవం. సాక్షాత్తు శ్రీహరి అంశ అయిన కృష్ణునికి లెక్కలేనన్ని పేర్లు... ఆ స్వామి ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. ఏమిచ్చి అర్చించినా ఆదుకుని అక్కున చేర్చుకుంటాడు.
రామ శబ్దానికి, కృష్ణ శబ్దానికి భేదం లేదు. ఈ రెండు అవతారాలు సాక్షాత్తు శ్రీహరి అవతారాలే కావడంవల్లే ఆ స్వాముల నామస్మరణ సాక్షాత్తు శ్రీహరి నామస్మరణంగా భావిస్తారు. అందుకే ‘హరేరామ హరేరామ హరే కృష్ణ హరేకృష్ణ’ అంటారు. ఇంతటి మహిమాన్వితమైన ఈ మంత్రాన్ని జపిస్తే సమస్త దోషాలూ సమూలంగా మటుమాయమై మానసిక ప్రశాంతత లభిస్తుంది.
నిష్కల్మషమైన మనస్సుతో కృష్ణుని పూజిస్తే, ఆ స్వామి కరుణించి కటాక్షిస్తాడు. కుచేలుడు, సుధాముడు లాంటి ఎందరో భక్తులను ఆదరించి, అక్కున చేర్చుకుని, ముక్తిని కల్గించిన అపురూప దైవం శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణ నామస్మరణమే పరమావధిగా ఎవరు స్మరిస్తారో, వారి మనస్సులలో శ్రీకృష్ణ్భగవానుడు కొలువై ఉంటాడు. అనేక మంది యోగులు, సిద్ధులు యోగాభ్యాస సమయాన శ్రీకృష్ణుని సహస్రారమందు ధ్యానిస్తూ ప్రాణాయామం నిలిపి మోక్షాన్ని పొందారు.
వాయువును కపాలమునందున్న సహస్రార చక్రం వరకూ తీసుకొనిపోయే సహజశక్తి ‘కృష్ణ’ శబ్దానికి కలదు. కృష్ణ శబ్దము నోటితో ఉచ్చరించినపుడు ఆయా అక్షరాలకు స్థానాలగు దౌడ, కంఠం, వీనిలో పుట్టిన వాయువు, శబ్దమూలమున శిరస్సునగల సహస్రార చక్రం వరకూ సహజసిద్ధంగా చేరుకొంటుంది.
అపుడు ‘వాయువు’ను అంటి చలించే స్వభావంగల వనస్సును, యోగప్రక్రియచే వాయువుతో లయమొనర్చి, సహస్రారమునకు తీసుకునిపోయి నిలువ వచ్చు. ఇలాంటి సిద్ధ ప్రక్రియ. మహాత్ములైన యోగులకు మాత్రమే సాధ్యపడుతుంది. ఈ విషయం సూక్ష్మాతి సూక్ష్మంగా మహాభారతంలో శ్రీకృష్ణ నామతత్వార్థ ప్రభావంగా చెప్పడం జరిగింది.
- దుర్గ
మిత్రులందరికీ నమస్కారములు.
రెండు నెలల క్రిందట ఓ దంపతులు వచ్చి ప్రాధేయపడినారు వాళ్ళ అబ్బాయ జాతకమును చూపించి.
ఆరు సం. నిండుతున్నా ఇంకా మాటలు సరిగా రాలేదని, మందులు మాకులు ఇప్పించినాము అని.
ఆ కామాక్షిని తలుచుకొని మూకపంచశతిని ఉపదేశించి, రోజూ ఒక పర్యాయము చదువుతూ 40 రోజులు ఉపవాస దీక్షలో పారాయణ చేయమని చెప్పాను.
రోజూ వాగ్దేవీ మంత్రముతో అభిమంత్రించిన బ్రాహ్మీ ఘృతమును ఒకసారి పట్టమని సలహా ఇచ్చినాను. నియమము తప్పకుండా వాళ్ళు దానిని ఆచరిన్చినారు.
ఇప్పుడే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చినది, వాళ్ళ అబ్బాయికి మాటలు, తెలివి బాగా వచ్చినాయి అని, చాలా మార్పు వున్నదని కృతజ్ఞతలు తెలుపుతూ.
నమ్మి కొలిచే వాళ్ళకు భగవదర్శనం, అనుగ్రహం ఎలా దొరుకుతుందో దీనిని బట్టి తెలుస్తుంది...
ఆ తల్లి కామాక్షి లీలలు మరోసారి నిరూపించబడినవి. అమ్మా మహామాయీ ధన్యవాదములు నీకు, బిడ్డలను కాపాడుతున్నందులకు.
మీ
భాస్కరానందనాధ
------------------------------------------------------------------------------------
పూజ్య శ్రీ భాస్కరానందనాథ గారికి నమస్కారము,
అమ్మవారి యొక్క అద్భుతమైన లీలను మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదములు. నిజంగా మూక శంకరులు, కామాక్షి అమ్మ వారి అనుగ్రహముతోనే మాటలు వచ్చి ఐదు వందల శ్లోకాలు అమ్మని కీర్తిస్తూ చేయగలిగారు.
అటువంటి అద్భుతమైన మూక పంచశతి పారాయణ చేస్తే, ఇప్పటికి కూడా, అమ్మ అనుగ్రహం ప్రసరించి మాటలు రాని పిల్లవాడికి మాటలు వచ్చాయి అంటే, ఈ స్తోత్రం ఎంత మహిమాన్వితమైనదో, అర్ధం అవుతోంది.
అసందర్భం అనుకోకపోతే, చిన్న సందేహం, "బ్రాహ్మీ ఘృతము" అంటే ఏమిటో తెలియజేయగలరు. అదేమైనా ఆయుర్వేదముకి సంబంధించిన ఘృతమా?
మీ..
----------------------------------------------------------------------------------
అవును. బ్రాహ్మీ అంటే సరస్వతీ. గోమూత్రములో ముందుగా శుద్ధి చేసిన శీలాజిత్తు, సరస్వతీ ఆకు (బ్రాహ్మీ) చూర్ణము మరియి అశ్వగంధ చూర్ణము, శతావరీ చూర్ణము, తేనె ఇత్యాది దినుసులతో మరియి నేతితో చేయబడిన పాకమును "బ్రాహ్మీ ఘృతము" అని అందురు. ఇది చాలా గాఢమైనది. నాడీ మండలమును, మెదడును, స్వరపేటికను ఉత్తేజపరచును. మాటలు సరిగా రానివారికీ, నత్తిగా మాటలడుచున్న వారికీ ఇది దివ్యమైన ఔషధము. ఆయుర్వేదిక మందులషాపులలో దొరకును.
ఇట్లాంటిదే బ్రాహ్మీ లేహ్యము లేదా సరస్వతీ లేహ్యము ఆయుర్వేదిక మందులషాపులలో దొరకును. పిల్లలకు మంచి స్పురణ శక్తిని అందించును.
ఒక్కోసారి ఒక్క తంత్రము సరిపోదు. తంత్రముతో బాటు మంత్రము కూడా వుండాలి. మందుతో బాటు మంత్రము. మందు అనేది తంత్రము.
మీ
భాస్కరానందనాధ
Labels: దుర్గ 0 comments
భగవాన్ - భగవద్గీత!
ఎన్ని కంఠాలు పఠించినా, ఎన్ని కలాలు వ్యాఖ్యానం చిందించినా, ఎన్ని ప్రవచనాలు ప్రవహించినా, ఎన్ని భాష్యాలు వినిపించినా, గంగవలె, గోవువలె, అతిపవిత్ర 'గీత', భగవద్గీత. సమస్త ప్రపంచానికి శ్రీకృష్ణుడందించిన శాస్త్రసర్వస్వం భగవద్గీత. అధ్యాత్మ సాధకుడికి అది కరదీపిక. చదువుతున్న కొద్దీ నూతన కోణాలను ఆవిష్కరించే జ్ఞానభాండాగారం భగవద్గీత.ఆత్మానుభవంతో జీవన్ముక్తుడై, సహజస్థితిలో స్వాత్మానందుడై, జ్ఞానమే సాకారమైన భగవాన్ శ్రీరమణ మహర్షి భగవద్గీతను అరచేతిలో అమలకంగా అందిస్తే? అందుకోగలిగినవాడికది ఒక అపురూపఫలం. అదొక రమణీయ గీతం! ఆ పాత మధురగీతం! "జననమరణాలు , భూత భవిష్యత్, వర్తమానాలు అనే విభజన మనం చేసుకున్నవే. కాలం అఖండం! నీవు-నేను అన్న ద్వైతం మనం అనుకుంటున్నదే. అపరిణామము, కాలాద్యవిచ్ఛిన్నమైన సత్యమే శాశ్వతం.
అది మార్పెరగనిది. బంధము, బంధన, ముక్తి దేహానికే గాని ఆత్మకు లేవు. అభ్యాసం ఒక నిరంతర ప్రక్రియ. వైరాగ్యం ఒక అంతరంగ భావన. ఇవన్నీ సహజస్థితులే. ప్రపంచమంతా పరమాత్మ రూపమే. నీవు విస్తృతమౌతున్న కొద్దీ పరిపూర్ణత అనుభవంలోకి వస్తుంది. దేహమే 'అసలునీవు' కానపుడు, నీవు కర్తవూ కాదు. కర్తృత్వమూ లేదు, జరుగుతున్న అనేక విషయాలలో నీ ప్రమేయం నిజానికి శూన్యం. ఉన్నదంతా అనుకోవటంలోనే ఉన్నది. ఇటువంటి భావనే కర్మయోగం. కర్మలన్నిటికీ నీవు కర్తవు కాదు. కర్మలు జరుగుతూనే ఉంటాయి. నీ సాధనతోనే సమాధానం పొందాలి.
మనసు నియంత్రించుకోవడం, ఆలోచనలను క్రమబద్ధీకరించుకోవటం, అభ్యాసం. నిరంతరాభ్యాసం భౌతిక వస్తువుల పరిమితిని తెలియచెప్పి అవి అందించే సుఖసంతోషాలు తాత్కాలికమని బోధిస్తుంది. ఒక అనుభవాన్ని కలిగిస్తుంది. అది వివేకాన్ని ప్రసాదిస్తుంది. దాంతో వైరాగ్యం లభిస్తుంది. ఇకపై మిగిలినదంతా శాంతే. శాంతి లోపల ఉన్నదని, ఎవరో యిచ్చేది కాదని, మనంతట మనమే పొందాలని అనుభవమౌతుంది. నువ్వన్నావన్న వాస్తవమే, దైవమున్నాడనటానికి తిరుగులేని సాక్ష్యం.
పరమాత్మ ప్రకాశాన్ని కంటితో దర్శించలేకపోవటానికి కారణం కన్ను భౌతికస్థాయిలో ఉండటమే. అది పనిచేయటానికి మూలమైన కారణాన్ని, వస్తువును, శక్తిని తెలుసుకోగలిగితే, ఆ శక్తే 'ఆత్మ' అని తెలుస్తుంది. మూడో కన్ను అంటే ఆత్మే! తాను చూడటానికి తనకంటే భిన్నమైన వస్తువేదీ ప్రత్యేకంగా లేదు కనుక, ఆత్మకు చూడటం అంటూ లేదు. ఉండటమే! అదీ సాక్షిగా. 'నేను చేస్తున్నాను' అనే కర్తృతభావం ఉన్నంతకాలం, అది కర్మే! ఆ భావం నశించి కర్మలు జరుగుతుంటే అదే కర్మయోగం. భగవంతుని పట్ల ఉండే తీవ్ర ఆవేశము, ఉద్విగ్నము, తాదాత్మ్యము కలిస్తే అది భక్తి.
నిర్మలము, నిశ్చలము, అరుణము, నికామము కలిగిన భక్తిభావమే భక్తియోగం. అహం నశించి, మనసు హృదయంలో లీనమై, ఆత్మ విచారంలో నిలకడ చెందితే అది జ్ఞానయోగం. నీలో నీవు ఉంటేనే నీవు ధ్యానివి. నీతో నీవు ఉంటేనే నీవు యోగివి. వాస్తవంలో జీవించమని, వాస్తవాన్ని గ్రహించమని, ఆత్మే వాస్తవమని భగవద్గీత బోధిస్తుంది. అనుభవజ్ఞానమే అసలు విద్య. అనుభవమే గురువు. అనుభవమే ఆత్మ. సర్వప్రాణుల హృదయాలలో ఉన్న 'నేను' ఆత్మే! శ్రీమత్ భగవత్ గీతా సారమంతా, కర్మ భక్తి జ్ఞానయోగాల విచారణంతా, ఆత్మ విచారమార్గం వైపు నడిచే సాధకుడికి భగవాన్ రమణులు అనుగ్రహించిన సంక్షిప్త గీతోపదేశం అన్ని స్థితులలో ఉన్నవారికి మార్గదర్శకం. అది సరళమైన అధ్యాత్మ సాధనకు దివ్య ఉపకరణం.
వి.యస్.ఆర్ మూర్తి
ఆధ్మాత్మిక శాస్త్రవేత్త
