మన దేశంలోని అతి పురాతన ఆధ్యాత్మిక గిరి శిఖరాల్లో ప్రసిద్ధి చెందినది సింహాచలం. దాదాపు రెండు సహస్రాబ్దుల చరిత్ర కలిగినదైనా, నిర్దిష్టంగా మనకు లభించే వివరాలు 11వ శతాబ్ది నుండి మాత్రమే. అయితేనేమి, ఎన్ని రాచరికాల ప్రభావం! ఎన్ని వైభవ తరంగాలు! మనసును కదిలించే సుదీర్ఘ చరిత్ర. ఈ ఏడాది చందనోత్సవం, నృసింహ జయంతి సందర్భంగా, ఈ మహా క్షేత్రంలో పొంగి పొరలిన భక్తిరస గాథల వైభవాన్ని ఒక్కసారి స్మరించుకుందాం.

ఇక్కడి మహాభక్తుడు కృష్ణమాచార్యుని గాథ రసరమ్య భరితం. తిరుమల క్షేత్రంలో అన్నమాచార్యుని స్థానమెంతటిదో, సింహాచల క్షేత్రంలో కృష్ణమాచార్య అంతస్థంతటిది. ఈ మహాభక్తుడు తన 16వ యేటనే సంకీర్తన సేవకు శ్రీకారం చుట్టాడు. సంకీర్తనకు అతడెంచుకున్న మార్గం వచనం. వచన భక్తి వాజ్ఞ్మయంలో ఇతడే ప్రథమా చార్యుడు.

అది ఏ స్థాయికి చేరినదంటే, అతడు ఆడినా, పాడినా స్వామితోనే. భక్తిరస వాహినిలో మాధుర్యం పెల్లుబుకుతుండగా, స్వామి సన్నిధిలో పరవశించి గానం చేసేవాడు. తుంబుర మీటుతూ మైమరచి చేస్తున్న అతడి సంకీర్తన వాక్పూజకు, సింహాద్రినాథుడు ప్రతిస్పందించి, తానూ ప్రత్యక్షంగా నృత్యం చేస్తూ మైమరచే వాడట. ఈ పరస్పర నృత్య గానాదుల మకరందంతో, భక్తి భావ కుసుమాల పరిమళంతో, సింహాచల క్షేత్రం ఆధ్యాత్మిక చైతన్యంతో వెలుగులు విరజిమ్మింది.

ఒకనాడు కృష్ణమాచార్యులు స్వామి సన్నిధిలో గానం చేస్తూండగా, స్వామి బాలకుని రూపంలో వచ్చి, వారి తొడ మీద కూర్చుని, ఆ వచనాలను తాళపత్రం మీద గంటంతో రాయసాగాడుట. అంతవరకూ ఆశువుగా, ఎప్పటికప్పుడు భావావేశంతో గానం చేస్తున్న ఆచార్యుల వారికి, ఈ సంఘటన తర్వాత, తన వచన సంకీర్తనలను అక్షర బద్ధం చేయాలన్న ఆదేశంగా తోచిందట. అప్పటినుంచీ అలాగే చేస్తూ వచ్చాడు.

ఇంతటి మహాభక్తుని జీవితంలో భగవంతుని లీలలు, కర్మసూత్రపు చిత్ర విచిత్ర గతులెన్నో మనకు గోచరిస్తాయి. కృష్ణమాచార్యునికి మేనమామ కూతురితో వివాహం జరిగింది. వీరి ఏకైక కుమారుడు తన ఏడవ యేటనే మరణించటంతో, ఆ ఆవేదననధిగమించే ప్రయత్నంలో తన సంకీర్తనలో మరింతగా మునిగిపోయాడు. ఇక్కడే ఈ జగత్తు మాయాజాలం ప్రదర్శిత మౌతుంది. అప్పటికి పరిపూర్ణ యవ్వనంలో నున్న ఆచార్యులవారు స్వామి ఎదుట చిరుతాళాలు మోయిస్తూ, దండెం మీటుతూ, సింహాద్రినాథుని కీర్తిస్తున్న దృశ్యం చూసి, జగన్మోహిని అనే దేవదాసి ఆయనపై మరులుగొన్నదట.

ఆమె అసమాన సౌందర్యం, హావభావాల చొరవ, కపటం లేని సాహచర్య కాంక్షతో, ఆచార్యుల వారి హృదయాన్ని ఆకట్టుకున్నదా మోహనాంగి. ఇంతటి మహాభక్తునికీ వికారా లేమిటనిపించవచ్చు. ఈ జగత్తనేది ఉన్నదే, ఇది వింత మాయావి! పోనీ ఆ స్వామి అయినా ఒక అడ్డుపుల్ల వేయవచ్చు గదా! ఇలాంటి సమయాల్లో ఆయన కేవలం సాక్షీభూతుడుగా ఉంటాడుట.

ఈ మలుపు ముక్తిపరంగా వీరిద్దరూ అనుభవించి తీర వలసిన కర్మశేషంగా భావించవచ్చు. నృసింహుని అనుగ్రహంతో ఇలా తీరి పోయింది. కృష్ణమాచార్యుని వచనాలు నాలుగైదు లక్షల పైమాటేనని విశ్వసిస్తున్నా, ఇప్పటి వరకూ లభించినవి 60 మాత్రమే. వీరి వచనాలిలా అదృశ్యం కావటానికొక రమ్యమైన గాథ బహుళ ప్రచారంలో ఉంది. రామానుజాచార్యులవారు సింహాచలం విచ్చేసి, ఆ క్షేత్రంలో తపస్సు చేసుకుంటు న్నారు. వారిని కృష్ణమాచార్యులు అంతగా లక్ష్య పెట్టలేదు. తన భక్తి తరంగాలతో సాక్షాత్తూ నృసింహునే పరవశింప జేస్తున్నానన్న గర్వరేఖ దీనికి కారణం.

ఇది తొలగించకపోతే అతడి పురోగతికి ఆటంకంగా నిలుస్తుంది. పరమాచార్యులైన రామానుజులు, తన సహజ కృపా దృష్టితో ఈ పనికి పూనుకున్నారు. వారు కృష్ణమా చార్యునితో, తాము నృసింహుని సన్నిధికి వచ్చామని, కృష్ణమాచార్యులు భగవంతునికి బహు సన్నిహితులు గనుక, తనకు ముక్తి లభిస్తుందో లేదో స్వామిని విచారించి తనకు తెలియజేయమని కోరారు.

తన స్థాయిని రామానుజులు గుర్తించినందుకు కృష్ణమా చార్యులు పరమానందంతో దీనికంగీక రించాడు. ఆ రోజు తన గాన నృత్య కలాపం ముగిసిన తర్వాత, రామానుజుల వారి ముక్తి గురించి స్వామిని విచారించారు. ఆ పరమాత్ముడాశ్చర్యం నటిస్తూ, తాను రామానుజునికి ముక్తి ప్రసాదించటమేమిటి? ఆయనే అందరికీ ముక్తిని ప్రసాదించగల మహానుభావుడన్నాడు. కృష్ణమాచార్యులకిది గట్టిగా తగిలింది. నిర్విణ్నుడైపోయాడు.

ఇంతకాలంగా ఇంతటి భక్తితో స్వామిని సేవిస్తున్న తనకు లేని ఆధిక్యత, నిన్నగాక మొన్న వచ్చి, ఎక్కడో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్న ఈ సన్యాసికి దక్కటమా? తానిన్నాళ్లూ ఎవరినైతే లక్ష్య పెట్టలేదో అతడే అందరికీ ముక్తినిచ్చేవాడని ఈ స్వామి చెప్పటమా? ఏమిటీ దేవుని న్యాయరీతి? ఒక పక్క గుండెలు రగులు తూంటే స్వామినడిగాడు॥పోనీ, నా జీవిత మంతా నీ కైంకర్యానికే వినియోగించాను కదా! మరి నాకైనా నీవు ముక్తినిస్తావా?** అని.

॥నీకైనా ముక్తిని ప్రసాదించగలవాడు రామానుజుడే** అని సమాధానం. కృష్ణమాచార్యుడిక నిగ్రహించుకోలేక పోయాడు. ఎవరినైతే తానిన్నాళ్లూ నిరాద రించాడో, తన ముక్తి కొరకు అతడి పాదాలనే ఆశ్రయించాలా? తన జీవితమంతా ఎవరి సేవ కొరకు వినియోగించాడో, ఆ సింహాచల నాథుడనవలసిన మాటేనా ఇది? క్రోధావేశం తన్నుకు వచ్చింది. తిట్లు లంకించుకున్నాడు. స్వామి కూడా మొహమాటమేమీ లేకుండా నిష్కర్షగానే ఉన్నాడు.

॥ముక్తియంతటి స్థితి నీకివ్వటానికి, నేనేమీ నీకు రుణపడిలేను. నీవు సంకీర్తనతో నన్ను పరవశింపజేస్తే, నేను నాట్యంతో నీకు పరమానందం కలిగించాను. బాకీ చెల్లి పోయింది. అయినా అకారణంగా దైవ దూషణ చేశావు గనుక, ఏ పద వాఙ్మయం చూసుకుని నీవింతగా గర్విస్తున్నావో, అది భావితరాలకు అందకుండా పోతుంది** అని శపించాడు.

ఈ అఘాతానికి ఆచార్యుల మతి స్థిమితం కూడా పోయింది. ముక్తి సంగతి అలా ఉంచితే, శాపమా తనకు దక్కేది! ప్రతీకారేచ్ఛ రగులుతూంటే, ॥నీ ఆలయం ఏడు రోజులపాటు అగ్నికి ఆహుతి అవుతుంది** అని ప్రతి శాపమిచ్చాడు. ఈ శాపాల ప్రభావమా అన్నట్లు, 18వ శతాబ్దంలో జరిగిన విదేశీ దండయాత్రల్లో ఈ క్షేత్రం విధ్వంసానికి గురికాగా, ఆచార్యుల సంకీర్తన వాఙ్మయం అంతరించి, నేడు కేవలం 60 సంకీర్తనలు మాత్రమే లభ్యమౌతున్నాయి.

ఈ సందర్భంగా రెండు విశిష్టమైన అంశాలు మనకు గోచరిస్తాయి. ఒకటి అహంకారం ఎంతటి సూక్ష్మతరమో, దానిని వదిలించుకోవటం ఎంతటి మహా భక్తుని కైనా ఎంతటి జటిలమైన విషయమో చక్కగా వివరిస్తుందీ గాథ. రెండవది, భక్తి మార్గంలో గురువు విశిష్టమైన స్థానం, సాధన వక్ర మార్గం పట్టకుండా కాపాడి, గమ్యం చేర్చ గలవాడు గురువే. అతడు లేక సాధన సాధ్యం కాదు; ఎవరో ఒకరిద్దరు కారణ జన్ములకు తప్ప. ఇంతటి లోతైన ఆధ్యాత్మిక సూక్ష్మాలు ఈ గాథలో ఇమిడి ఉన్నాయి.

కృష్ణమాచార్యుల వచనాలు పరిపూర్ణ భక్తి పరిమళంతో, మన అంతరంగమంతా నిండి పులకింపజేస్తాయి. ఆర్తి, శరణాగతితో నిండి లయ బద్ధంగా, రాగయుక్తంగా ఉండటం వల్ల, వచన గేయాలుగా ప్రసిద్ధికెక్కాయి. ప్రతి వచనమూ ।దేవా* అనే సంబోధనతో మొదలై, ।సింహగిరి వరహరీ! నమో నమో దయానిధీ* అన్న మకుటంతో ముగుస్తుంది. వీటిలో వ్యక్తమయ్యే దృఢభావాలు।సింహగిరి నృసింహుని మించిన దైవం లేదు శ్రీ వైకుంఠం కంటే మరో ప్రయోజనం లేదు* అని.


ఇలాంటి భక్త్యావేశం పరాకాష్ట చేరుకున్న మరోగాథ కూర్మనాథునిది. ఇతడు స్వామిని సేవిస్తున్న కాలంలో, సింహాచల క్షేత్రం విదేశీ దండయాత్రలకు గురయ్యింది. శత్రుసేనలు యథేచ్ఛగా విధ్వంసానికి తెగబడ్డాయి. ఈ బీభత్సానికి తట్టుకోలేక, అర్చకులు, సేవకులు ఎటు వారటు పారిపోయారు. కూర్మనాథుడు మాత్రం స్వామిని వదలి పోలేకపోయాడు. అలాగని తానొక్కడే శత్రువునెదుర్కొనలేడు.

స్వామి ఒక్కడే శరణ్యమని స్ఫురించింది. ఆవేదన పొంగి పొరలుతుండగా, జరుగు తున్న విధ్వంసకాండను వివరించే ప్రయత్నంలో అది కవితారూపంలో వెలు వడింది. అతడి నిర్మలమైన భక్తి స్వామిని సంప్రీతుని చేసింది. స్వామి స్పందించాడు. ఆ సమయంలో ఎక్కడి నుండి వచ్చాయో గాని వేల వేలుగా రేగింది తేనెటీగల దండు.

తెరలు తెరలుగా సైనికులను చుట్టుముట్టింది. కత్తులు కటారులతో విధ్వంసానికి తెగబడుతున్న వీరులకు, ఈ అల్పజీవులనెలా ఎదుర్కోవాలో దిక్కు తోచలేదు. అతి బాధాకరమైన వాటి కాట్లకు, ఊపిరి సలుపుకోనివ్వని వాటి రణ చాతుర్యానికీ భీతిల్లిపోయిన సేనలు, వెనుదిరిగి చూడకుండా పారిపోయాయి. ఇతడి కవితాధారయే మనకీనాడు లభిస్తున్న సింహాద్రి నారసింహ శతకం.

విశాఖపట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో, తూర్పు కనుమలలో 800 అడుగుల ఎత్తునున్న కైలాస పర్వతంపై వెలసిన ఈ క్షేత్రానికి, ఉత్తర దిశగా గోస్తనీ నది, దక్షిణాన వరాహ నది, పశ్చిమాన శారదా నదులు ప్రవహిస్తూ ఈ క్షేత్రానికి త్రివేణీ పరిరంభమై సింహాద్రినాథునకు తమ ప్రపత్తిని వ్యక్తం చేసుకుంటూ కనువిందు చేస్తాయి. అసలీ ప్రాంతమంతా సెలయేటి ధారలే. నీటి వనరుల సమృద్ధితో, చుట్టూ పెరిగిన దట్టమైన అరణ్యం, మరింత దట్టంగా అల్లుకున్న లలితా వల్లికలు, ఈ వసంత కాలపు శోభతో మనోహరంగా విరబూసిన పుష్ప సంపద, వనదేవతల కలంకరించిన పుష్పమాల వలే భాసిస్తాయి.

కొన్ని పుష్ప జాతుల పరిమళాలు, వనమూలికల సుగంధాలు, నీటి బుగ్గల మీదుగా వీచే చల్లని గాలి తెరలు తాకి, శరీరం, మనస్సు పరవశిస్తాయి. ఆధ్యాత్మిక వైభవం, ప్రకృతి సౌందర్య వైభవం కలబోసుకుని మనల్ని ఆహ్వానించే దివ్య ధామం సింహాచలం. ఇక్కడ స్వామి నిజరూపం, కొన్ని మణుగుల చందన లేపనంతో కప్పి పెద్ద లింగాకృతితో ఉంటుంది. ఒక్క వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రం ఈ చందనం తొలగించి, విశేష పూజలు నిర్వహించి, మళ్లీ చందనంతో కప్పి వేస్తారు. భక్తులీ దర్శనాన్ని అతి పవిత్రంగా, జన్మ సార్థకతగా భావిస్తారు. ఎ.రాధాకృష్ణమూర్తి

0 comments: