తమ జీవిత సర్వస్వాన్ని భగవాన్ సేవకు అర్పించిన వారిని ఉద్దేశించి 1950 ఏప్రిల్ 14న, రాత్రి 8.57 గంటలకు మహాభినిష్క్రమణం చేయడానికి కొద్ది క్షణాల ముందు రమణులు పలికిన పూర్ణభావనామయమైన మాట thanks. మళ్లీ ఆయనే 'అంటే సంతోషం అని అర్థం' అన్నారు. భగవంతుడు మానవశరీరం ధరించి వచ్చినప్పుడు ఎంత వినమ్రంగా ఉంటాడో ఈ సన్నివేశం చెబుతుంది. "నేను ఎక్కడికి వెళతాను? ఇక్కడే ఉంటాను'' అంటూ సెలవు తీసుకున్నారు రమణులు. ఆయన చెప్పినట్లు గానే నేటికీ అరుణాచలం నుంచి రమణుల కరుణ కురుస్తునే ఉంది. రమణుల వర్థంతి నేడు. అ సందర్భంగా రమణతత్త్వ సారం మీ కోసం...
"ఊరకుండండి. పుట్టినది మగబిడ్డ. బంగారు తండ్రి. దివ్యజ్యోతి సముద్రమున తేలియాడుతున్నాడు. అవతారమూర్తి వలె ఉన్నాడు. చూచి ఆనందించండి'' ఈ మాటలు పలికినది పుట్టుగుడ్డి. 1879 డిసెంబర్ 30న పవిత్ర శివక్షేత్రం తిరుచ్చుళిలో జన్మించిన వెంకట్రామన్ ఈ విధంగా పుట్టిన వెంటనే తన దివ్యత్వాన్ని ప్రకటించారు. కనులున్న వారికంటే ముందే కనులు లేని అవ్వను అనుగ్రహించిన దివ్యక్షణం అది. సరిగ్గా 16 సంవత్సరాల తరువాత ఆయన జీవితంలో సంభవించిన ఒక గొప్ప పరిణామం భారతీయ ఆధ్మాత్మ చరిత్రలో మరొక మహాపురుషుని ఆగమనానికి నాంది పలికింది.
ఎటు చూసినా మౌనమే
మహాగ్ర తపస్సు చేసినా చిత్తశాంతి కలగని కావ్యకంఠ గణపతి ముని మౌనస్వామిగా పేరుపొందిన వెంకట్రామన్ దగ్గరకు వచ్చి తన సమస్యను తెలియజేశారు. "ఈ నేను అనే భావము ఎక్కడి నుంచి వస్తుందో పరికిస్తే మనసు అందులో లీనం అవుతుంది అదే తపస్సు. మంత్రజప సమయంలో మంత్రనాదం ఎక్కడి నుంచి పుడుతున్నదో పరికిస్తే మనసు అందులో లీనం అవుతుంది. అదే తపస్సు'' అంటూ మౌనం వీడి తొలిబోధ చేశారు.
నాటి నుంచి శ్రీ రమణమహర్షిగా జగత్తును నడిపించారు. ఎందరో జ్ఞానార్థులు, సిద్ధపురుషులు, తాత్త్వికులు, రుషివరులు, సాధకులు, మాన్యులు, సామాన్యులు, పాశ్చాత్యులు, పామరులు, పరమగురువులు ఆయనను దర్శించి, స్వస్వరూప జ్ఞానాన్ని, జీవిత పరమార్థాన్ని పొంది, వారి అనుగ్రహ వీక్షణంలో తడిసి, తమను తాము తెలుసుకొని తరించారు. మహాభినిష్క్రమణం వరకు రమణులు తమ బోధ ద్వారా, మౌనం ద్వారా, దక్షిణామూర్తి వలె ఈ జగత్తును ప్రభావితం చేశారు.
16వ ఏట అరుణాచలంలో అడుగుపెట్టిన తరువాత ఆయన అరుణాచలాన్ని వదిలి పెట్టలేదు. తిరుగులేని ఆత్మార్పణ అది. తిరువణ్ణామలైలో అరుణాచలుడు గుడిలో నిలిచిన దేవత. ఆయన పలకడు. అరుణాచలం కొండదేవర. అది పలకదు. అరుణాచల మునివర్యుడు రమణులు. ఆయనా పలుకరు! ఎటు చూసినా మౌనమే. ఏం చేసినా ఆచలమే. ఏమి విన్నా మహానిశ్శబ్దంలోంచి వినిపించే నాదమే!
గురువులకు గురువు
తనను తానెరుగు 'ఎరుక', తనదైన స్వస్థితి, ఆత్మానందంతో వెలిగిన భగవాన్ ఉనికితో అరుణాచలం రమణాచలమైంది. కాశీలో గంగాస్నానం కన్నా, చిదంబరంలో నటరాజ దర్శనం కన్నా, అరుణాచల స్మరణం ఒక్కటే చాలు మోక్షప్రాప్తికి. తత్త్వం బోధించే గురువులు అయిదు విధాలు. బ్రహ్మచారి, గృహస్థు, మానప్రస్థుడు, భిక్షుకుడు, అతివర్ణాశ్రమి. వీరు అయిదుగురు వరుసక్రమంలో అయిదు మెట్లు వంటివారు.
అతివర్ణాశ్రమి అయిన గురువు గురువులకు గురువని చెబుతారు. భగవాన్ రమణులు అలాంటివారే. ఆధ్యాత్మ చరిత్రలో భగవాన్ రమణులొక్కరే పరశివావతారమైన దక్షిణామూర్తి. మళ్లీ ఆయనే మరణరహస్యాన్ని తెలిపిన మహర్షి. చమత్కరించి చెప్పాలంటే రమణులు లౌకికంగా బ్రహ్మచారే. నిరంతరం బ్రహ్మమందే చరించారు! రమణులు గృహస్థు కూడా. విశ్వసంసారాన్ని గంభీరంగా నడిపి, రమణాశ్రమంలోనే అతిథి వలె భిక్ష స్వీకరించిన తామరాకుమీద నీటిబొట్టు. పిన్నవయసులో ఇల్లు వదిలి అరుణాచలం చేరిన వానప్రస్థి. తిరువణ్ణామల వీధులలో తొలినాళ్లలో తిరిపమెత్తిన భిక్షకుడు. జగమెరిగిన అతివర్ణాశ్రమి.
ఇదే జీవితం
"నిన్ను నీవు తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే''. ఎంతటి గొప్ప సత్యం? మన ం ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టి మిగిలినవి అన్నీ తెలుసుకుంటాం. ఆ ప్రయత్నంలో మనల్ని మనం మరచిపోతాం. అంతా అయిపోయిన తరువాత, మనమేమిటో తెలుసుకోకుండా మరణిస్తాం. అదే విధంగా ఒకరోజు ఆనందంగా నిద్రలేస్తాం. మరొకరోజు కారణం లేకుండానే ఎంతో విచారంగా, దుఃఖంగా, నిరాశగా నిద్రలేస్తాం.
ఒకరోజు దాకా ఎందుకు? ఒక క్షణం విచారం. మరుక్షణమే పట్టలేనంత ఆనందం మనల్ని మరిపిస్తాయి. ఒక చిన్న విజయం మనల్ని ఉప్పొంగిపోయేలా చేస్తుంది. చిన్న వైఫల్యం ఎంతో విషాదంతో కృంగిపోయేలా చేస్తుంది. మనల్ని మనలా ఉండనీయదు. ఇంతెందుకు? ఏదైనా విషయం మనకు అర్థం అయినప్పుడు, అంతా తెలిసిపోయిందని అహంకరిస్తాం. మనంతటి వాడు లేడని గర్విస్తాం. మనకంటే తెలివిగల వారు మరొకరొస్తే సహించం. జీవితం మనం కోరుకున్నట్లుగా, అనుకూలంగా, నీటివాలు ప్రవాహంలా సాగినంత సేపూ అంతా మన ప్రయోజకత్వమని అనుకుంటాం. అనుకున్న దానికంటే కాస్త భిన్నంగా జరిగితే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, సమాజాన్ని, కుటుంబాన్ని, కనబడని దైవాన్ని నిందిస్తాం.
ఎత్తుపల్లాలు, చీకటివెలుగులు, కలిమిలేములు, ఆనంద విషాదాలు, జనన మరణాలు మనల్ని నిరంతరం ఆడిస్తూ ఉంటాయి. ఆధ్మాత్మ అంటే మనం మనంగా - అంటే మనిషి మనిషిగా బ్రతకడమని, ఈ ప్రపంచంలోనే ఉండి మనల్ని మనం సంస్కరించుకోవాలని, మానవుడు పరిపూర్ణమానవుడుగా రూపాంతరం చెందాలని తెలియచెప్పిన జ్ఞానమూర్తి రమణులు. సుఖమంటే దుఃఖం లేకపోవడం కాదని, సంతోషం అంటే వస్తువులు ఇచ్చే సంతోషం కాదని, ఆనంద హృదయానికి సంబంధించినదని చెప్పిన మహనీయుడాయన. శాస్త్రపరిచయం ఆలోచనను విస్తృతపరిచేదేగానీ సత్యాన్ని ఆవిష్కరించదని, భాషలన్నీ భావవ్యక్తీకరణ సాధనాలేనని, మాటలన్నీ అసలును దాచి ఉంచే పొరలేనని, తెరలేనంటారు రమణులు.
హృదయమే ఆరామస్థలి
మౌనం శక్తివంతమైనదని, మౌనం మనల్ని లోపలికి ప్రయాణం చేయించే నావ అని, మౌనం ఆలోచనలన్నింటినీ నియంత్రిస్తుందని, మనలోని వ్యతిరేక భావాలకు, శక్తులకు మన మనసే మూలమని, మనలోని దయ, కరుణ, ఆత్మీయత, ఆప్యాయత వంటి దైవీ భావాలకు మన మనసే కారణమని, మన సేదతీరే ఆరామ స్థలి మన హృదయమేనని, మన అనుభవమే మన గురువని, మన అనుభూతే నిత్యసత్యమని చెబుతారాయన. జరుగవలసింది జరుగక మానదు. జరగకూడదని ఎంత ప్రయత్నించినా మనం అనుకున్నట్లు జరగదు. ఇలా వేదాంతాన్ని హేతుబద్ధంగా, మూఢ విశ్వాసర హితంగా, మీ ప్రపంచానికి తమ జీవన విధానమే ఆధారంగా, సోదాహరణంగా చెప్పిన మహాద్భుతమూర్తి రమణులు.
ఆధ్మాత్మికంగా ఎంత ఎదిగినా కర్తవ్యం విస్మరించరాదని, కర్తవ్యం ఏద యినా ఈశ్వరార్పణ భావంతో చేయాలని చెప్పారు. ఈశ్వరుడంటే మనకు కనపడని దైవం కాదని, దైవమంతా ఈ ప్రపంచం అని, సృష్టి అని, ఆ దైవమూ మనమేనని స్పష్టంగా విశదీకరించిన విశుద్ధ రుషి రమణులు. మానవత్వం పరిపూర్ణంగా వికసిస్తే, ఆచరణలో అభివ్యక్తం అయితే అదే దివ్యత్వం అని సూత్రీకరించిన మహర్షి రమణులు. ఏది నీ అనందాన్ని అడ్డుకుంటున్నదో, ఏది నీ దుఃఖానికి కారణం అవుతున్నదో, ఆ మనసును గుర్తెరిగి, ఆలోచనలను నియంత్రించుకొని, మనసును అదుపులో ఉంచుకొని, సుఖదుఃఖాలకు అదరని, చెదరని మనోస్థితిని సాధించుకోవాలని చెప్పిన బోధాకృతి రమణులు.
- వి.ఎస్.ఆర్.మూర్తి
ఆధ్మాత్మిక శాస్త్రవేత్త
Thursday, April 14, 2011
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment