పూర్వము కైలాస పర్వతానికి దగ్గరగా ఒక కీకారణ్యం ఉంది. అందులో భిల్ల
దంపతులు నివసిస్తూ ఉండే వారు. వారిలో భిల్లుని పేరు ఆహుకుడూ, అతని భార్య
పేరు ఆహుకి. ఐతే నిజానికి వారు ఆటవిక జాతి వారైనా శివ భక్తులు. అంచేత
ఉదయాన్నే లేచి కాల కృత్యాలు తీర్చుకుని శివుని మనసారా ధ్యానించి పూజించి
వేట కోసం ఆహుకుడు అడవికి వెళ్ళే వాడు. పసు పక్ష్యాదులను వేటాడి
తెచ్చేవాడు. అంతే కాక వెదురు బియ్యము, పుట్ట తేనె, కంద మూలములు, రకరకాల
ఫలములు, పుష్పములు ఇంటికి తెచ్చే వాడు. అతని భార్య కూడా, అతనికనుగుణంగా
భర్త సంపాదించి తెచ్చినవి సక్రమంగా వండి అతిధి అభ్యాగతులను ఆదరించి దైవ
సమానులుగా ఎంచి భోజన సదుపాయములను చేకూర్చి వారిని సంతోష పెట్టేది. ఈ
విధముగా ఇద్దరు శివ భక్తి పరాయణులై అతిధులను పూజించి యాచకులను సత్కరించి
తమ తమ విద్యుక్త ధర్మ్మాలను చక్కగా పాటిస్తూ హాయిగా ఉండే వారు.

వారి ఆదర్శ దాంపత్యానికి దైవ భక్తికి శివుడు సంతసించి వారిని
పరీక్షించాలని బుద్ధి పుట్టింది. అందుకు పార్వతితో "దేవీ! నాకు భిల్ల
దంపతులను పరీక్షించాలన్న కోరిక కలిగింది. కావున నేను సన్యాసి రూపము
ధరించి వారి ఇంటికి వెడతాను. నీవు పెద్దపులి రూపమున అచటికి వచ్చి ఆ
భిల్లుని ప్రాణములు తీయవలెను" అని చెప్పి అంతర్ధానమయ్యాడు.

సూర్యాస్తమయ సమయం కాగానే, మసక చీకట్లు అలముకొంటున్న సమయంలో
భిల్ల దంపతుల ఇంటి ముందు నిలచాడు. ఆ సవ్వడికి మన వాకిట ఎవరో నిలిచి
నట్లినది అని భిల్ల దంపతులు తలుపు తీసి వాకిట నిలచిన సన్యాసి
వేషములోనున్న ఈశ్వరుని లోనికి గొనిపోయి కాళ్ళు కడిగి దాహము తీర్చి, అలసి
పోయినాడని ఎంచి విసన కర్రతో విసురుతూ సేవలు చేయసాగారు.

రాత్రి ఐన పిమ్మట, తీయని ఫలములు తేనె దుంపలు, వెదురు బియ్యముతో
వండిన అన్నము సంతృప్తిగా సమర్పించారు. అదే సమయంలో బయట కౄరమృగముల అరుపులు
భయంకరముగా వినబడుతున్నాయి. ఇల్లు చాలా చిన్నది. ఇద్దరు మాత్రమే
పడుకోవడానికి సరిపోతుంది. ముగ్గురిలో ఎవరో ఒకరు బయట పడుకోకతప్పదు. అది
చూసి ఆ ముని వేషములో నున్న ఈశ్వరుడు "పూజ్యులారా! రాత్రి మొదటి ఝాము
ఐనది. గడప దాటి బయటకు పోవాలంటే భయంకరంగా కౄరమృగముల అరుపులు
వినబడుతున్నాయి. ఇప్పుడేం చేయాలి?" అని అడిగాడు.

అందుకు అతని భార్య "నాధా! మీరిద్దరు లోపల విశ్రమించండి, నేను
బయట కాపలా ఉండి జంతువులను వేటాడతాను" అంది.

అప్పుడు భిల్లుడు "వద్దు ప్రేయసీ, ఈ రోజు వన్య మృగముల బాధ ఎక్కువగా
ఉంది కావున, మీరిరువురు లోన పడుకోండి, నేను బయట కాపలా ఉండి, జంతువులను
వేటాడతాను" అని చెప్పి బాణాలు తీసుకుని బయట కాపలాగా కూర్చున్నాడు. అందుకు
అతని భార్య సమ్మతించి యతీశ్వరునితో సహా లోన ఉండిపోయింది.

రాత్రి రెండు ఝాములు గడచినవి. వన్య మృగముల గర్జన అధికమైనది. ఒక
పులి అరణ్యమంతట తిరుగుతూ భయంకరమైన అరుపులతో వారి ఇంటి ముందుకే
వచ్చుచున్నది. వెంటనే భిల్లుడు విల్లెక్కుబెట్టి, పులి వైపు బాణములు
వదిలాడు. అవి తగిలీ తగలనట్టు తప్పిపోవటంతో పులి రెట్టించిన కోపంతో అతని
పైకురికింది. తన ఖడ్గముతో తెగనరుకుటకు భిల్లుడు ఎంత ప్రయత్నించిననూ లాభము
లేకపోగా, పులి అతని పైబడి ప్రాణములు తీసింది. ఇంతకీ అది ఈశ్వర సంకల్పమే
కదా!

అ ఘోర సంఘటనకి అతని భార్య ఆహుకి తట్టుకోలేక తాను కూడా సహగమనం
చేయాలని అగ్ని ప్రవేశం చేయబోయింది. అప్పుడు ఆ మంటలు చల్లార్చి పార్వతీ
పరమేశ్వరులు నిజరూపమును దాల్చి ఆమె భర్త భిల్లుని బ్రతికించారు.

ఆ దంపతులు ఇద్దరు పరవశించి శివ పార్వతుల పాదముల పై వ్రాలి
భక్తితో మొక్కారు. వారిని గాంచి "ఓ భిల్ల దంపతులారా!మీ నిశ్చలమైన భక్తికి
మీ గృహస్త ధర్మ నిర్వహణకి మేమెంతో సంతోషించాము. మిమ్మల్ని పరీక్షించదలచి
మేమీ రూపమున నాటకమాడాము. యతి రూపమున నేను శివుడను, పులి రూపములో పార్వతి.
మీ భక్తిని మెచ్చి సంతసించితిమి. మీరు చిరకాలము ధర్మతత్పరులై దాంపత్య
జీవితమున సుఖముగా వర్ధిల్లుడు" అని దీవించి, మరు జన్మలో "సూర్య వంశపు
రాజగు వీరసేనునికి నల చక్రవర్తిగాను, విదర్భ రాజగు భీమ సేనునికి కూతురగు
దమయంతి గాను మీ రివురు జన్మించెదరు. మీ అనన్య మైన ప్రేమకు మేమిద్దరము
రాజహంసలుగా మీ ప్రేమ సందేశములను నడపుటకు రాయబారము వహించెదము.
అష్టదిక్పాలకుల సమక్షమున మీ వివాహము వైభవముగా జరిపెదము" అని దీవించి
అదృశ్యమై పోయారు.

అంటే "భిల దంపతులు నల దమయంతులు, పార్వతీ పరమేశ్వరులు రాజహంసలు"
అన్న మాట.

--------------- నేదునూరి రాజేశ్వరి

0 comments: