అది 1991-92.అప్పట్లో నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. బంధువులచే
మోసగించబడి సమారు అప్పుచేసి తెచ్చిన డబ్బు 5.5 లక్షలవరకూ వారిచే
మోసగింపబడి భార్యాపుత్రులతో అత్తవారింట్లో ఆశ్రయం పొందుతున్నరోజులవి.
నిరుద్యోగిగా సుమారు 2.5 సంవత్సరములు గడిచినవి.భార్య భారతి సుగరు
వ్యాధితో మంచం పట్టింది.కాలిలో కురుపు(డయాబెటిక్ ఫుట్)తో నెల రోజులు
తణుకులో హాస్పిటలులో ఉన్నా డాక్టరుగారి నిర్లక్ష్యవైద్యం వల్ల
తగ్గకపోయినా ఇంటికి తీసుకుని వచ్చిన పరిస్థితి.అప్పుడే నాకు హైదరాబాదులో
ఉద్యోగం దొరికితే ఒక్కణ్ణీ వెళ్ళి జాయినయ్యాను.రెండో రోజునే భారతి
డయాబెటిక్ ఫుట్ కురుపు చీముపట్టి వాసన వస్తోందని కబురు.వెంటనే మెరుగైన
వైద్యం కోసమని ఆవిడను తణుకునుంచి హైదరాబాదు రైలులో పంపించారు.గౌతమి
ట్రైను సికిందరాబాదు స్టేషను చేరేసరికే ఆవిడకు ఇన్ఫెక్షనువల్ల జ్వరం కూడా
వచ్చింది. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం కావటం చేత వెంటనే పెద్ద డాక్టరు ఎవరూ
దొరకక పోవటం, మర్నాడు సాయంత్రం డాక్టరు ఎప్పాయింట్మెంట్ దొరికింది.
మధురానగర్ దగ్గరలోని సిక్ బే హేస్పిటలులో చేరాం. వైద్యం ఇంకా
మొదలుపెట్టకుండానే ఆ రాత్రే ఆమె కోమా లోనికి వెళ్ళిపోవటం జరిగింది.
శ్రీనివాస రెడ్డిగారనే డాక్టరుగారు ఆమెకు వెంటనే చికిత్స మొదలుపెట్టి
నాలుగు సీసాల రక్తం ఎక్కించి ఆవిడను తిరిగి స్ప్రహ లోనికి తెచ్చారు.ఆ
సమయంలో పేషంటు పరిస్థితిని గురించి ఏమీ చెప్పలేమనిన్ని, చివరి చూపుకోసం
మా అబ్బాయిని కూడా హైదరాబాదు పిలిపించుకోమనీ కూడా డాక్టర్లు చెప్పటం
జరిగింది. మా అబ్బాయినికూడా పిలిపించాం.మానవ ప్రయత్నాలన్నీ ఎన్ని
చేస్తున్నా దేవుని మీద భారం వేసి తిరుపతి వెంకన్నకూ(నా స్వామి),
సిర్డిసాయిబాబాకు(మా ఆవిడ ఇస్టదైవం) మొక్కులు మొక్కుకున్నాం.
డాక్టర్ల కృషిచేతనూ,దైవం మాయందుండటం చేతనూ కష్టం గడిచి ఆవిడ కోలుకోవటం
జరిగింది. సమారుగా నెలరోజులు పైగా హాస్పిటలులో ఉండాల్సొచ్చింది.ఆ సమయంలో
హైదరాబాదులోనే కాపురం ఉంటున్న మా ఆవిడ అన్నయ్య(కజిన్),ఇంకా
ఇతరబంధువులు(ఆవిడ తరఫువారే) చేసిన సహాయాన్ని మేమెప్పుడూ మర్చిపోలేము.
అప్పుడు జరిగిన హడావుడీ కంగారూ ఇంతింతని చెప్పలేను.
తరువాత గత పదిహేను సంవత్సరాలలోనూ కూడా ఇంకో రెండుసార్లు ఆ కాలికీ
రెండోకాలికీ కూడా ఇన్ఫెక్షన్లు రావటం బాగు చేసుకోవటం కూడా
జరిగింది.వైద్యనారాయణులకృషితో పాటుగా ఆ శ్రీమన్నారాయణుని కృపకూడా మామీద
ఉండబట్టి ఆవిడ క్షేమంగా రోగాలనుండి బయటపడింది.--ఇవి నా జీవితంలో మేము
ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలూ దైవకృపతో ఆ గండాలను దాటిన వైనమూను.




వ్రాసినవారు :- మల్లిననరసింహరావుగారు


నా జీవితంలో దైవ లీలలు:
నాకు జీవితంలో ఎప్పుడూ అహా ఇది భగవంతుని లీల అని అనిపించే అద్భుతాలు ఏమీ జరగలేదు. నేను పెద్ద పూజలు పున:స్కారాలు చేసే మనిషిని కాదు. నేను ఇప్పటికీ గుడికి వెళ్లిన నాకి ఇది కావాలి అని కోరుకోను. మా నాన్న గారు చాలా కాలం నాస్థికుడు. ఆయన జంధ్యం కూడా వేస్కునే వారు కాదు. మా అమ్మ మాత్రం సనాతన ధర్మాలని కాపాడుకుంటూ, మడికట్టుకోవటం, పూజా పున:స్కారాలు చెయ్యటం, ప్రతీ రోజూ మహానైవేద్యాలు పెట్టటం అవీ చేస్తుండేది. తర్వాత తర్వాత నేనూ నెమ్మదిగా నమ:స్కారం పెట్టుకోవటం ప్రారంభించా. 1996 లో మా నాన్న ఆలోచనా విధానంలో కొంచెం మార్పు రావటం మొదలైంది, అదేనాలోనూ మార్పుకి శ్రీకారం చుట్టింది. 1996 లో మా నాన్న వైతీశ్వరన్ కోయిల్ కి వెళ్లొచ్చారు, ఆ గుడిని చూడాగానే మా నాన్న కి ఎదో అలజడి కలిగి వెంటనే జంధ్యం ధరించి స్నానం గట్రా చేసి వెళ్లి వైతీశ్వరన్ దర్శనం చేస్కున్నారు. అప్పటినుంది కొన్ని కారణాల వల్ల కొన్ని సంఘటనల వల్లా మా నాన్నకీ నాకూ అలవాటైయింది దేవుడు భక్తి. ఆయన నెమ్మదిగా షిర్డీ సాయిబాబా వైపుకి మళ్లారు. చాలా సార్లు షిర్డీ కి కూడా వెళ్లొచ్చారు.
1999 లో మా నాన్నకి గుండె పెరిగి ఆశ్పత్రికి వెళ్లాం. డాక్టరు చూసి, మీ బంధువులందర్నీ పిల్చుకోండి అని కూడా చెప్పారు. మా నాన్న షిర్డీ సాయి నమ్ముకున్నారు, మా అమ్మ కనపడిన దేవుళ్లకీ మొక్కుకుంది. నేనేమి అనుకోలేదు. మానాన్న క్షేమంగా తిరిగి ఇంటికి వస్తే శ్రీశైలం వస్తా అనుకున్నా. పదిరోజుల్లో మా నాన్న తేరుకుని ఇంటికి వచ్చేసారు. నేను ఆరాత్రికి రాత్రే శ్రీశైలం వేళ్లి తలనీలాలు ఇచ్చేసి, శ్రీశైలనాధుని గర్భ గుడిలో ఆ యన పక్కనే కూర్చుని అభిషేకం చేస్కుని వచ్చా. నా మొట్టమొదటిసారి శ్రీశైల ప్రయాణం, ఆ శివలింగం పక్కనే కూర్చొని మొట్టమొదటి సారి తాకినప్పటి ఆ అనుభూతి, తృప్తి, ఆనందం, రోమాంఛం. మళ్లీ నాకె ఎన్ని సార్లు శ్రీశైలం వెళ్లినా కలగలా, మరెక్కడికి వెళ్లినా కలగలా.
తర్వాత్తర్వాత 2005 లో మా నాన్నగారు మమ్మల్నందర్నీ ఆశ్చర్యంగా శోకంలోకి నెట్టేసి ఆ శివంలోకి కలిసిపొయ్యారు.
నాకు అంతా శూన్యం అయిపోయింది. అప్పుడూ, మొట్టమొదట మానాన్నకి ఎంతో ఇష్టమైన పొందుగుల లో మా నాన్న అస్తికలు నిమజ్జనం చేసాం. కొందరు ప్రయాగలో చెయ్యండీ అని కొందరు కాశీలో చెయ్యండీ అని సలహాలు ఇచ్చారు. నేనాలోచించి, ప్రయాగ త్రివేణీ సంగమంలోనూ, కాశీలోనూ కలుపుతా అని బయలుదేరా. నాకు ట్రైన్లో ఒకతను పరిచెయం అయ్యారు. చక్కటి భాష, స్థిరమైన దృష్టి. పరిచయం అయ్యింది. అతనిది చీరాలే. ప్రయాగ లో ఇద్దరం కలిసే లాడ్జీ తీస్కున్నాం. అక్కడి అస్సిస్టెంటు కమీషనర్ ఆఫ్ పోలీస్, ఆయన క్లాస్మేటే అట, ఫోన్ చేస్తే వెంటనే ఒక యస్.ఐ వచ్చాడు. మమ్మల్ని త్రివేణీ సంగమం దెగ్గరకి సునాయాసంగా తీకెళ్లి అక్కడి మోసగాళ్ల చేతిలో పడకుండ అన్నీ కార్యక్రమాలు దెగ్గరఊంది చేయించి పంపించాడు. వెంటానే కాశి వెళ్లాం ఇద్దరం. అక్కడకూడా కలిసే గది తీస్కున్నాం. అతను కార్యక్రమాలు చేకుని నిష్క్రమించారు. ఆయన అవాయా అనే కమ్మ్యూనికేషన్స్ కంపెనీకి వైస్ప్రెసిడేంటు. నేను మూడు రాత్రులు ఉందాం అని నిర్ణయించుకుని ఉండి, ఆ శంభూనాధుని దర్శనం చేస్కుని, కాశీలోని అన్నీ గుళ్లూ గోపురాలూ చూస్కొని, సంకట హనుమాన్ని కొల్చుకుని, రుద్రుడ్ని కూడా దర్శించుకుని బయల్దేరా. కానీ నాకు అంత తృప్తి అనిపించలా. శ్రీశైలం అంత ప్రశాంతంగా ఏదీలేదు అనిపించింది.
మా నాన్న నిష్కమణాశూన్యం నుండి నెమ్మదిగా నిలదొక్కుకుని, మళ్లీ నన్ను నేను జీవనశ్రవంతిలోకి తెచ్చుకుని, పొట్టచేతబట్టుకుని అమెరికాకి వచ్చి ఇక్కడ ఉద్యోగం సంపాదించి, ఇదిగో ఇలా ఉన్నా. ఈ ప్రయాణంలో మా నాన్న నావెనక ఉండి నన్ను నడిపిస్తున్నాడనే భావన. మా అమ్మ కొడుకు వృధ్ధిలోకి రావాలీ అనే సంకల్పం. నాభార్య,మా ఆయన జీవితపు ఉఛ్ఛస్థితికి వెళ్లాలి అనే సంకల్పం అన్నీ మిళితమై ఉన్నాయి.
మా పాప పుట్టుక మాత్రం నాకు కొంచెం దైవలీలేనా అనిపించింది. దేనికంటే
అక్టోబరు 6 ప్రసవం కావొచ్చని డాక్టర్లు ఇచ్చిన తారీఖు. సెప్టెంబరులో మన సహ బ్లాగరు, మాష్టారు దుర్గేశ్వర గారు ఓ రోజున ఛాట్లో కలిసి, మీరు ఇరవైఒక్క రోజులు రుద్రం చెయ్యండీ మంచిదీ అని చెప్పారు. విఘ్నం కలుగకుండా చేయ్యండీ అన్నారు. మరి ఇలా అక్టోబరు 6 న డెలివరీ కదా అన్నా. అప్పటికి ఇరవైఒక్క రోజులు కావు మాష్టారూ అన్నా. పర్లేదు, ఆ సమయం వచ్చినప్పుడు నాకు చెప్పండీ మీపేరు మీద నేను చేస్తా అన్నారు ఆయన. మొదలు పెట్టాను చెయ్యటం. ఈ లోపల సెప్టెంబరు 29, శరన్నవరాత్రులు మొదలయ్యాయి. నిండు నెలలతో సాయంత్రం 6 కల్లా వంటా వార్పూ సిద్ధం చేస్కుని, ప్రసాదం తయ్యారు చేస్కొని, పిల్లాడికి స్నానం గట్రా చేయించి, వాడికి ఏదోకటి తింటానికి మూట కట్టుకుని గుడికెళ్లే వాళ్లం. నవరాత్రులు మొత్తం ప్రతీరోజూ అమ్మవారి అలంకారం, మరియూ శ్రీ లలితా సహస్రనామ పారాయణార్చన జరుగుతాయ్ అని ముందే ప్రకటించారు గుడివాళ్లు.
ప్రతీ రోజు వెళ్లాం. తను కష్టపడి కూర్చొని మొత్తం పారాయణ చేసి, తీర్ధ ప్రసాదాలు తీస్కుని అప్పుడు ఇంటికి వచ్చేవాళ్లం. ప్రతీరోజు జనాలు అడిగేవారు ఇంకా కాలేదా అని. తలా ఒకలా చెప్పేవారు ఇక ఈరోజు అవుతుందిలే, 3 న అవుతుంది అని నాకనిపిస్తుంది అని ఒకావిడ అంటె, 5 న అవుతుంది అని ఇంకొకళ్లు ఇలా. మొత్తానికి, లెక్క ప్రకారం నా రుద్ర పారాయణ అక్టోబరు 8 కి అయిపోయింది. లెక్క ప్రకారం దేవీ నవరాత్రులు తిథుల ప్రకారంకాకుండా రోజుల ప్రకారం, సెప్టెంబరు 29 నుండి తొమ్మిదిరోజులు కలిపితే అక్టోబరు 8 కి అయిపొయ్యాయి. అక్తోబరు 8 న కూడా గుడికి వెళ్లాము. అందరూ ఆశ్చర్య పోవటం ఇంకా కాలేదా అని. మొత్తానికి అక్టోబరు తొమ్మిదిన, అంటే విజయ దశమినాడు, శ్రవణా నక్షత్రం రోజున పాప పుట్టి మమ్మల్నందర్నీ ఆనందంలో ముంచేసింది.
ఇది ఆ అమ్మవారి లీలేనా? ఏమో అలా రాసిపెట్టి ఉందేమో....
శుభం
{పంపినవారు.....రామరాజు భాస్కర్..అమెరికానుండి}

Thanks and Regards
Bhaskar Ramaraju
http://www.linkedin.com/in/ramarajubhaskar
http://javagongura.blogspot.com
http://ramakantharao.blogspot.com
http://projectsforfuture.blogspot.com/
http://nalabhima.blogspot.com/
http://verbosegc.blogspot.com
http://ramaraju.org
http://it.toolbox.com/people/bhaskar_ramaraju/

[ ఒంటరిగా నున్నానని ఎలా ఈపరిస్తితినుంచి గట్టేక్కాలా అని ఆందోళన చెందుతున్న సమయములో తానే తోడునీడై పరమేశ్వరుడు కాపాడుతూ భాస్కర్ గారికి విజయదశమినాడు అమ్మవారి ప్రసాదంగా ప్రభవించిన పాపపేరు అనఘ.దత్తాత్రేయస్వామి సహచారిణి]


1916 ప్రాంతంలో పావన తుంగభద్రనదీ తీరంలోని మంత్రాలయంలో జరిగిన దైవలీల
ఇది. అప్పటి మద్రాస్ డిస్ట్రిక్ట్ గజెట్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన
ప్రత్యేకత ఎమిటంటే లీలకు లోనైన వారు హిందూ మతస్తుడు కాకపోవటం.

థామస్ మున్రో అనే బ్రిటిష్ అధికారికి ప్రభుత్వం ఒక బాధ్యత అప్పజెప్పింది.
చాలా కాలం క్రితం రాఘవేంద్ర కృపా పాత్రుడైన ఒక అవధ్ నవాబు, బృందావనంలో
జరిగే పూజలకు తగిన వనరులు సమకూర్చుకోవటానికి కొంత భూమిని జాగీరుగా
ప్రకటించాడు. ఆ జాగీరును వెనక్కి తీసుకునే ఆలోచన చేసింది అప్పటి బ్రిటీషు
ప్రభుత్వం. కాని అక్కడి మఠాధిపతులు ఇతర ఆస్తికులు నిరశించడంతో ఆ విషయంపై
నివేదిక పంపమని మున్రోని ఆదేశించింది ప్రభుత్వం.

హిందూ మత సాంపదాయాలని తెలిసిన మున్రో మంత్రాలయానికి చేరుకొని అక్కడి
ఆస్తికులతో చర్చించాడు. ప్రధాన ఆలయంలోకి తన టోపీ, కాళ్ళకున్న బూట్లు
తొలగించి ప్రవేశించాడు. అక్కడ అప్పుడు జరగబోయే సంఘటనను ఆయన కలలో కూడా
వూహించి వుండడు.

ఒక్క క్షణంలో ఏదో మాయ జరిగినట్టు తన చుట్టూ వున్న మనుషులు పరిసరాలను
మరిచిపోయాడు. ఆయన ఎదురుగా వున్న రాఘవేంద్ర సమాధి బృందావనం. అటు పక్కనే
తెల్లటి గడ్డంతో, కాషాయ వస్త్రాలతో ఒక సన్యాసి. మదహాసంతో మాయ చేస్తూ
మున్రో దగ్గరకి వచ్చాడు. మంద్రంగా ఆయన గొంతు వినపడింది.

"జాగీరు ప్రభుత్వం తీసేసుకుంటే ఇక్కడ జరిగే భక్తి పూజలు, అన్న దానాలు ఏవీ
జరగవు. ఆలయం మూత పడుతుంది. ఆలయమనేది జీవత ఎడారిలో ఆధ్యాత్మిక దాహం తీర్చే
ఎండమావి లాంటిది. ప్రజల మత విశ్వాసాలను గౌరవించడం పాలకుల బాధ్యత కాదా.
అలాంటి బాధ్యత నెరవేర్చినప్పుడే ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసం
చూపిస్తారు. ఆలోచించు.." అంటూ ఆశీర్వదించాడు.

మున్రో మళ్ళీ ప్రస్తుత లోకంలో మేల్కొన్నాడు. జరిగింది చుట్టుపక్కల
వున్నవారికి చెప్పాడు. అది కలా, మాయ, భ్రమా అతనికి అర్థం కాలేదు. తలపై
చెయ్యి పెట్టుకొని చూశాడు. మంత్రాక్షతలు..!! ఆ సన్యాసి ఆశీర్వదిస్తూ తనపై
వేసినవి..!!

చూట్టూ వున్న మఠాధిపతులు, సాధువులు, భక్తులు తల వంచి మున్రోకి
నమస్కరించారు. ఏ విధంగానూ తనకి తెలిసిన తర్కాని అందని ఆ లీలని తలుస్తూ
బయటకి నడిచాడు మున్రో. ఆ సన్యాసి చెప్పిన విషయమే బ్రిటీషు ప్రభుత్వానికి
వ్రాశాడు. ప్రభుత్వం జాగీరుని వెనక్కి తీసుకునే ఆలోచన మానుకుంది. { కర్నూల్ కలెక్టర్గా ఆయన వ్రాసిన ఆ వుత్తర్వులపై తానే తరువాత మద్రాస్ గవర్నర్ గా ఆమోదించవలసి రావటం మరొక విచిత్రం]

మున్రోకి అర్థం కాని విషయం ఒకటే - ఎవరా సాధువు? తను చెయ్యాల్సిన పనికి
మార్గం చూపిన ఆ గురువెవ్వరు?


[వ్రాసినవారు. అరిపిరాల సత్యప్రసాద్]ఈ కథ కే.కే.మూర్తి అనే ఒక రచయిత వ్రాసిన పుస్తకం (The miracles of God
for the debacles of human) నుండి స్వేచానువాదం)


బస్తిపాడు గ్రామ మునుసబుగనన్న చిన్నశేషిరెడ్డి జ్యేష్ట పుత్రుడు లక్క్ష్మి కాంతా రెడ్డికి ఐదు సంవత్సరముల క్రిందట మనస్సు స్ఠాయితప్పి, అతడు పిచ్చి చేష్టలను చేయుచుండెను. అతనిని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించినపట్టికిని ఏమియు ప్రయోజనము లేకుండెను.
ఏమి చేయుటకును తోచక, ఒకనాడు చిన్న శేషి రెడ్డి తన కుమారుని నాతావునకు పిలుచుకునివఛ్చి, అతిని పరిస్థిని తెలియజేసి, అందుండి బయట పడుటకు మార్గమును ప్రసాదింపుడుని విన్నవించుకొనెను. సర్వశక్తివంతమగు రామనామము ను నిండుభక్తితో జపించుచుఁడిన తమ బాధలన్నియూ తీరునని ధైర్యము చెప్పితిని
తదుపరి నేను శ్రీరాములను హృదయ పూర్వకముగా స్మరించి ధ్యానమగ్నుడనై ఒక గంటకు పైగా ఏకధారగా శక్తికిరణములను ప్రసరింపజేసితిని. అందువలన ఆయన కుమారుని మనసు ప్రశాంతతనొంది స్వాధీనములోనికి వచ్చెను.

చిన్నతనము నుండి లక్ష్మీకాంతరెడ్డి తనతండ్రి తోపాటు నావద్దకు వచ్చుచుండుటచే, అతనికి కూడ నా యందు విశ్వాసముండును. అందువలన అతనితో ' లక్క్ష్మికాంతా రెడ్డి, నీవు నా సమక్షమున అచ్చట ఎలాంటి అల్లరి చేయక మీ తండ్రి ఆజ్ఞానుసారము నకడుచుకొనవలెను. నీ మనస్సు స్థాయితప్పునను భీతి కలిగినప్పుడెల్ల, నీవు వెంటనే రామ నామమును జపించిన నీ మనస్సు తిరిగి ప్రశాంతతనొందును. నీవు నేను చెప్పిన అతడట్లుండటకు సమ్మతించెను. ఇంటికి వెళ్ళిన తర్వాత తన కుమారుడు ఏదైనా అల్లరి చేసిన నా తావునకు వెంటనె పిలుచుకొని రమ్మని చిన్నశేషి రెడ్డికి తెలిపితివి
అటు తర్వత , నేను శ్రీరామలను స్మరించి వారిని హ్రుదయ పూర్తిగ దీవించి కుంకుమ ప్రసాదమునిచ్చి పంపితిని .
తనమనస్సు స్వాధీనము తప్పుచున్నదన్న భీతి కలిగినప్పుడెల్ల లక్ష్మీ కాంతరెడ్డి వెంటనే తన గదిలోనికి పోయి నా పటము ముందు నిలుచుకుని కొంత తడువు శ్రీరామ నామమ్మును స్మరించుచుఁడెను. అప్పుడప్పుడు అతడు నాతావునకు వచ్చి నేను ధ్యానము నందుండగా నా ఎదుట కూర్చుని శ్రీరామ నామమును జపించుచుండెను. శ్రీరాముల అనుగ్రహ ప్రభావమున త్వరలోనే అతని కుండు మనోబాధంతయు నివారణమై మామూలు స్తాయిలోనికొచ్చి అంతకు ముందెన్నడూ లేని ప్రశాంతతో ఇంటిపనులన్నియూ చూచుకొను సమర్ధత కలిగెను.
[పసుపుల రామకృ ష్ణారావుగారి ,శ్రీరామ నామ మహిమ గ్రంథము నుండి]


పియుసి చదువుతున్నప్పటినుండి రాజేశ్వరి అనె బాలిక తన తల్లిదండ్ర్లులతో పాటు నావద్దకు వచ్చు చుండెడిది. త్వరలోనే ఆమెకు రామనామమునందు,మంచి విశ్వాసముకలిగెను. శ్రీరామానుగ్రహం వలన ఆమె వివాహము శుభకరము గా జరిగెను. అటుతరువాత కొంతకాలమునకు రాజేశ్వరియొక్క ఆరోగ్యము చెడి మిక్కిలి ప్రమాదస్థితిలో నుండుటచేత ఆమెను కర్నూల్ జనరల్ హస్పటల్ లో చేర్చిరి. అచ్చట చికిత్సవలన ఏమీ లాభం లేకుండినందున ఆమెను మరలా ఇంటికి తీసుకొనివచ్చిరి.
దినదినమునకు ఆమె బాధ ఎక్కువగుచుండెను. తుదకు రెండురోజులు పూర్తిగా నీళ్ళుత్రాగుటను కూడామాని వేసి రాత్రింబవళ్ళు విపరీతబాధపడుచుండెను. అట్లే కొంతకాలముండిన ఆమె గుండె ఆగి పోవు ప్రమదము కలుగవచ్చునని ఆమె తండ్రి భీతిల్లి నాతావునకు వచ్చి ఆమెస్థితిని తెలిపి ఆమెకేహాని లేకుండునట్లుగా దీవించుడని ఎంతో బాధతో విన్నవించుకునెను.
నేను శ్రీరాములను స్మరించి వెంటనే ధ్యాననిమగ్నుడనై ప్రశాంతశక్తి పూరిత ధ్యానకిరణములను ఆమె లోనికి పంపమొదలిడితిని. ఇట్లు సుమారు ఒక గంటకాలము గడపితిని. అదివరలో రెండురోజులుగా నిద్రాహారములు లేక మిక్కిలి బాధపడుచుండిన రాజేశ్వరికి నేను ధ్యానమును మొదలిడినప్పటినుండి యు శ్రీరామానుగ్రహము వలన మంచి నిద్రపట్టి తెల్లవారేవరకు ఆమె సుఖముగా నిద్రించెను . ఎనిమిది రోజులుగా కండ్లు తెరవబడకున్నందున ఆమె కంటి చూపుకు తీరని ప్రమాదము కలుగునేమోయని ఆమె తల్లిదండ్రులు భీతిల్లుచుండిరి.కానీ శ్రీరామానుగ్రహము ఆమె మరుసటి దినమే తన కళ్లను సునాయాసముగా తెరువగలిగెను. కంటి చూపు ఏకొంచెం చెడకుండా శ్రీరామానుగ్రహము ఆమెకున్ పూర్ణారోగ్యమును కలుగజేసి కోలుకొనులాగ చెసినది. తరువాత కాలేజీ లో చేరి సునాయాసముగా బి .ఏ. పరీక్షయందు ఉత్తీర్ణతనొంది తదుపరి ఎమ్.ఏ కూడా ఉత్తమశ్రేణిలో కృతార్ధురాలై గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ గా నియమింపబడెను.

[పసుపుల రామకృష్ణారావు,కర్నూల్ వారి శ్రీరామనామ మహిమ నుండి.]




నేటికి 80 సంవత్సరాలకుపూర్వం బృందావనంలో మదన్ మోహన్ మందిరానికి దగ్గరగా ఒక కుటీరములో ఒక అంధుడయిన సాధువు ఉండేవారు. ఆయన పేరు ఎవరికీ తెలియదు. ఆయన మదన టేర్ లో ఎక్కువగా ఉంటాడు కనుక ఆయనను మదనటేర్ బాబా అని పిలుస్తుంటారు.
ఆయన నిద్రలేవటమ్ తోనే స్నానాదులను కానిచ్చి,నీటి కుండ్ను ఒకటి తీసుకుని మదనటేర్ లోని దట్తమైన పొదలలోకి వెళ్ళి కూర్చుని రోజంతా రాధాకృష్ణుల లీలలను మననం చేస్తూ కన్నీరు కారుస్తూవుండేవారు. సంధ్యా సమయం లో గోవింద్ జీ మందిరానికి వెళ్ళి తన ఆవేదనను నివేదించుకుని తిరిగివచ్చేవాడు. వస్తూ రెండు మూడు ఇళ్లలో మధుకరాన్ని యాచించి అది తిని నిదురపోయేవాడు. కానీ వస్తూ పోతూ తింటూ త్రాగుతూ అన్నివేళలా రాధాక్రిష్ణుల చింతన సాగిస్తూ కన్నీరు కారుతూనే ఉండేవి ..

ఈవిధంగా నిరంతరం ఏడుస్తూవుండటంవలన ఆయన చూపు కూడా ఫోయింది. దానికాయన బాధపడలేదు.ఎందుకంటే ఆయనదృష్టిలో దేవుని దర్శించే కళ్ళే కళ్ళు. ఆభగవద్దర్శనానికి నోచుకోని కళ్ళు వున్నా లేకున్నా ఒకటే నని ఆయన భావన. ఈవిధంగా రాత్రిల్లు పగల్లు ఏడుస్తూ 40 సంవత్సరాలు గడచిపోయాయి. జీవనసంధ్యా సమయము ప్రవేశించినది. ధైర్యం సన్నగిల్లినది .భగవంతుని విరహం భరింపరానిదైనది. ఆ ఆవేదనలో ,ఆయన ఆపొదలలో మూర్చ్హపోయారు.ఆయన పట్ల సానుభూతివ్యక్తం చేసేవారెవరూ లేరక్కడ. కానీ అక్కడి పక్షులు,నెమళ్ళు,కోయిలలు మొదలయినవి తమతమ అరుపులతో ఆయన్ను మేల్కొల్పాలని ప్రయత్నించి విఫలమైనవి.అలా ఆవేదనతో స్మృతి కోల్పోతూ గడుపుతున్నాడు కాలాన్ని నామస్మరణలో.
ఒకరోజు ఆయన మదన టేర్ లో కూర్చుని ఏడుస్తూవున్నాడు. లీలావినోదంగా రాధాకృష్ణులు తిరుగుతూ తిరుగుతూ అక్కడకు చేరుకున్నారు. బాబా బాగాఏడుస్తూఉండటంచూసి ఆతల్లి భక్తానుగ్రహకాతారయగు రాధ కన్నయ్యతో ఇలా అంటున్నది."బాబా ఏడుస్తున్నాడు,వెళ్ళి నవ్వించు ప్రియా .

బాలకృష్ణుడు బాబా దగ్గరకు వెళ్ళి బాబా ఎందుకేడుస్తున్నావు? నిన్నెవరన్నా కొట్టారా? నీదగ్గరనుంచిఏదైఅనా లాక్కున్నారా? అని ముద్దుగా అడిగాడు.లేదు... లేదు.. ఇక్కడనుడి వెళ్లు అని బాబా అనిపలికాడు బాబా. బాబా నీకు మజ్జిగ తీసుకురానా?రొట్టె తీసుకురానా? ఏ
కావాలంటే అది తీసుకువస్తాను అన్నాడు కన్నయ్య."లేదు లేదు నువ్వెళ్ళు విసుక్కున్నడు బాబా."ఐనా వదలకుండా చిన్ని కృష్ణుడు మరలా మరలా అడుగుతున్నాడు.దాంటో బాబా విసుక్కుంటూ"అరే గొల్లపిల్లవాడా!వెళ్ళు వెళ్ళి గోవులని మేపుకోఫో.. నాతో నీకేం పని ? అని మరలా విలపించసాగాడు.ఇక వల్లగాక కృష్ణుడు రాధను సమీపించి బాబా నామాటవినటంలేదు. ఏడుస్తూనే ఉన్నాడు అనిపలికాడు.
అప్పుడురాధాదేవి ప్రియా బాబానెందుకు నవ్వించలేకపోయావు. నేను వెళ్ళి నవ్విస్తాను చూడు అని పలికి బాబాను సమీపించినది.బుంగమూతి పెట్టి బాబా!ఎందుకేడుస్తున్నావు?నీభార్య చని పోయినదా? అని అడిగినది. ఆచిన్నారి పాప అడిగినతీరు విని నవ్వి తల్లీ !నాకెవ్వరు లేరుఅని పలికాడు. అయితే మరెవ్వరూ లేనప్పుడు నువ్వెందుకేడుస్తున్నవు?అని మరలా అడగగా "నావాల్లంతా నన్ను మర్చిపోయారమ్మా?అంటూ " నీకుతెలియదు తల్లీ! వ్రజ లో ఒక మోసగాడున్నాడు. వానిని స్మరిస్తూ భజిస్తూ ముసలివాడినయిపోయాను. ఒక్కసారికూడా నాకు కనపడలేదు. ఇక వాడితో స్నేహంచేసి నాతల్లి రాధాదేవి కూడా కఠినురాలైనది అనిపలికెను.
రాధాదేవి ఉలిక్కిపడి.... నేనాకఠినురాలిని? అని నోరుజారి మరుక్షణమే బాబాతో ..బాబా!నాపేరు కూడారాధయే నీకు ఏమికావాలో చెప్పు?అనిఅడుగగా నాకేంకావాలిచిట్టితల్లీ ! ఈవయస్సులో .ఒక్కసారి వాళ్ళదర్శనం లభిస్తేచాలు అన్నాడు బాబా. అంతట రాధ ,బాబా నీవు వట్టి అమాయకుడవు. నీకు చూపులేదు కదా? వారిని ఎలా చూడగలవు? అనిప్రశ్నించింది. దానికి బాబా...నీవేవట్టి అమాయకురాలవు నీకు తెలియదా నా చిన్నారి తనచేత్తోనన్ను తాకగనే నాకు చూపువస్తుంది అన్నాడు ధృఢ నిశ్చయంతో.
ఇక రాధాదేవి ఉండలేక అతని కన్నులను తనచేతితోతాకింది కృష్ణుడు కూడావచ్చి తనచేతితో బాబానుతాకాడు. బాబాకన్నులు ఒక్కసారి గా కాంతివంతమయ్యాయి. ఎదుటగా నిల్చిన రాధాకృష్ణులను చూచి ఆనందముతో మూర్ఛిల్లాడు. మూర్ఛలోనే ఆరాత్రంతా పడివున్నాడు. ఉదయం బృందావన పరికమణచేసే ప్రజలు ఇతనిని గుర్తించి ఆస్థితిలోనే మధుసూదన్ మందిర్ కు తీసుకు వెళ్ళిరి. మందిరములో గోస్వామి బాబాను మదనమోహనుడు కటాక్షించెనని గ్రహించాడు. ఆయన అక్కడవారందరితో కలసి కీర్తనప్రారంభించారు. కీర్తనచెవినపడిన వెంటనే బాబాలో చలనం వచ్చినది..తరువాత గోస్వామి ఆయనను ఏకాంతనికి తీసుకవెళ్ళి తగువిధంగా పరిచర్యలు చేశాక కారణం అడుగగా ,ఏడుస్తూ జరిగినదంతా చెప్పాడట.
బాబా ఏదైతే కోరుకున్నాడో అది లభించింది. కానీ అతనిఏడుపుఆగలేదు. ఏడ్వడం మునపటికన్నాఎక్కువైనది. రాధాకృ ష్ణులను ఒకసారి కలసివిడిపోవటం కలవకముందుకంటే ఎక్కువ బాధాకరం. ఈవిధంగా విలపిస్తూ వి;అపిస్తూ,కొన్నిరోజులతరువాత ,ఈభౌతిక దేహాన్ని విడిచి సిధ్ధదేహంతో గోలోకం వెళ్ళిపోయాడు.

[మాపూజ్యగురుదేవులు శ్రీరాధికాప్రసాద్ మహరాజ్ గారుప్రసాదించిన ' బృందావనేశ్వరి రాధ " నుండి ]