అబ్బాయి పెళ్ళిసంబంధం నిశ్చితార్థ ముహూర్తం కోసం ఆ దంపతులు మా దగ్గఱికొచ్చారు. మాటల సందర్భంలో "అభిజిన్ముహూర్తం సర్వశ్రేష్ఠమైనది. శ్రీరామచంద్రులవారి పెళ్ళి అందులోనే జఱిగింది" అని చెప్పాము. "రాముడూ, సీతా ideal couple కాదు గదా ! వాళ్ళ ముహూర్తం మనకెందుకు ?" అన్నాడా అబ్బాయి. అనడం ఇంగ్లీషులోనే అన్నా అవి రాములవారి చెవిలో పడనేపడ్డాయి. సరే, మొత్తం ముహూర్తం పెట్టడం అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు.

మర్నాడే ఆ ముసలిదంపతుల నుంచి ఫోను : "మా కాబోయే కోడల్ని ప్రేమిస్తున్నాను, చేసుకోకపోతే విషం తాగి చచ్చిపోతానంటూ ఆమె కొలీగ్ ఒకడు తన పేరెంట్సుతో సహా వచ్చి గోల చేస్తున్నాడట. ఒకరోజంతా ఆలోచించి చెబుతానని మా కాబోయే కోడలు అతనితో చెప్పిందట. ఆమె ప్రవర్తన ఎందుకో మాకు అనుమానస్పదంగా ఉంది. ఏం చెయ్యమంటారు ?" అని ! "చేసేదేముంది ? ఆమెకి అతని మీద ఏదో ఒక అభిప్రాయం లేకపోతే అతనికలా టైమివ్వదు. ఆమె ప్రవర్తన మంచిది కాదు. తెగతెంపులు చేసుకుంటున్నట్లు ఆమె తల్లితండ్రులకి తెలియజెయ్యండి" అన్నాము.

సాయంకాలానికే మళ్ళీ ఫోను. "మా కాబోయే కోడలు సూట్ కేసు సర్దుకొని అమ్మానాన్నా చూస్తూండగానే ఆ కొలీగ్ తో లేచిపోయిందట" అని అప్ డేటు. ఏం చేద్దాం ? ఇలా ఉన్నారు సిటీలో అమ్మాయిలు, చదవేస్తే ఉన్నమతి కాస్తా పోయినట్లు ! "పోన్లెండి, మీవాడు నక్కని తొక్కాడనుకోండి. అలాంటి అమ్మాయిని చేసుకొని ఆ తరువాత ఆమె అంతకుముందే పెద్ద హీరోయిన్ అని తెలిసినప్పుడు పడే బాధ కన్నా ఆదినిష్ఠూరంగా అంతటితో పోయిందని సంతోషించండి."అని ఓదార్చాము. వరుడు మాత్రం చాలా దుఃఖంలో ఉన్నాడు. ఆ పిల్ల అందగత్తె కావడంతో అతను పీకలలోతు ప్రేమలో మునిగిపోయి ఉన్నాడు. అతన్ని ఓదార్చడం సాధ్యం కాలేదు. కానీ ఒక మాట చెప్పాము. "సాక్షాత్తు భగవంతుడైన రాములవారిమీదా, సీతమ్మవారి మీదా నువ్వలా కామెంట్ చెయ్యడం తప్పు. ఆ ఆదిదంపతుల శాపాలు తగుల్తాయి. ఈ అమ్మాయే కాదు. ఏ అమ్మాయీ నీ మొహం చూడని పరిస్థితి వస్తుంది." అని !

ఇంకాస్త తరువాత రాస్తాను.

--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

3 comments:

జ్యోతి said...

తాడేపల్లిగారు,

నాదో డౌటు.ఈ పళ్లి సంబంధం చూసినపుడే వధూవరుల జాతకాలు చూస్తారు.మరి అప్పుడు అమ్మాయి జాతకంలో అసలు సంగతి తెలుస్తుందిగా. అప్పుడే జాగ్రత్తపడకుండా పెళ్లి వరకు ఎందుకొచ్చారు? దైవదూషణ వల్ల పెళ్లి తప్పిపోయినదానికంటే మంచే జరిగిందిగా!!

తాడేపల్లి said...

జాతకంలో ప్రేమవ్యవహారాలు సూచించబడతాయి. వ్యభిచారయోగాలు కూడా సూచితమవుతాయి. కానీ మా అనుభవం ఏంటంటే ఈ మధ్య అమ్మాయిల తల్లిదండ్రులు మగపెళ్ళివారికి సరైన జాతక వివరాలు ఇవ్వడం లేదు. అందుచేత వాటి మీద ఆధారపడి చూస్తూంటే అసలు విషయాలు వెల్లడి కావడం లేదు.

ఈ అమ్మాయి కేసుకొస్తే - ఇక్కడ రామాపరాధం జఱగకపోతే ఆ అమ్మాయి లేచిపోయేది కాదు. (ఒకవేళ అంతకుముందు అఫైర్ ఉన్నా) మనసు మార్చుకొని తాళి కట్టించుకునేది. ఈ అబ్బాయి రామాపరాధం చేయక ముందురోజు దాకా సుమారు నలభైరోజుల పాటు అతనితో రోజూ గంటల తరబడి ఫోనులో మాట్లాడేది. "నా డ్రీమ్స్, పథకాలు" అంటూ ఏవేవో చాలా కబుర్లు చెప్పేది. హఠాత్తుగా ఇలా చేసేసరికి ఈ అబ్బాయి కూడా ఆశ్చర్యపోతున్నాడు.

తాడేపల్లి said...

లేచిపోవడం వల్ల మంచి జఱిగిందా ? లేదా ? అని ప్రశ్నించుకోవడం కన్నా ముఖ్యమైనది ఒకటుంది. శ్రీరామచంద్ర పరబ్రహ్మ బుద్ధి చెబుతారు తప్ప ఎవ్వరి జీవితమూ పాడుచెయ్యరు. అది ఆయన ఉద్దేశం కాదు. కామెంట్ చేసినంతమాత్రాన ఈ అబ్బాయిని శ్రీరామచంద్ర పరబ్రహ్మ శత్రువుగా చూడరు. అందుకని ఈ సంబంధం తప్పిపోవడం వల్ల ఆ అమ్మాయికి గానీ, ఈ అబ్బాయికి గానీ ఏ విధమైన నష్టమూ జఱగలేదు. దేవుణ్ణి నోటికొచ్చినట్లు తూలుమాట లనకూడదనే బుద్ధి మాత్రం వచ్చింది. దేవుడి ద్వారా మనకి కలిగే కష్టంలో అంతర్గతంగా ఏదో ఒక మంచి ఎల్లప్పుడూ ఇమిడే ఉంటుంది. సీతమ్మవారిని రానణాసురుడు అపహరించడం శ్రీరామచంద్ర పరబ్రహ్మకు కష్టాన్ని కలిగించింది. కానీ అలా జఱక్కపోతే వాడూ, వాడి రాజ్యమూ ఆయన చేతిలో నాశనమయ్యేవి కాదు గదా ! ఆయన భగవత్తత్త్వం వెలుగులోకి వచ్చేది కాదు గదా !