భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా సమాజంలో ధర్మస్థాపన చేయాలని ఎందరో యోగులు, మతాధిపతులు, పీఠాధిపతులు కృషి చేశారు, చేస్తున్నారు. ఈ కాలం వారి మాటేమో కానీ గతంలో ఇలా కృషి చేసిన వారంతా నిస్వార్థ, నిరాడంబర మూర్తి స్వరూపులు. వారిలో రామకృష్ణ పరమహంస అగ్రగణ్యులు. ఆయన బంగారాన్ని, మట్టిని సమదృష్టితో చూడమన్నారు. మనిషిలోని వ్యామోహమే అనర్థాలకు మూలమని హెచ్చరించారు. ఆయన బోధల్లో కొనింటిని గమనిద్దాం.
దైవ ఒకరే... పేర్లు అనేకం భగవంతుడు. అంతర్యామి, నిరాకార స్వరూపుడు. రాత్రిపూట నక్షత్రాలు కనిపించనంత మాత్రాన, నక్షత్రాలు లేవని అనగలమా! అదేవిధంగా భగవంతుడు కనిపించడం లేదని అనరాదు. భగవంతునికి అనేక నామములున్నాయి. ఆయన రూపాలు అనంతములుగా ఉన్నాయి. నీకు ఏ పేరు, ఏ రూపం నచ్చిందో.. వాటి సాయంతోనే భగవత్ సాక్షాత్కారం పొందగలవు అంటారు రామకృష్ణ పరమహంస. నీరు ఎక్కడైనా ఒకటే కానీ దాన్ని ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తాతరు.
ఒకరు 'జలం' అంటారు. మరొకరు 'నీరు' ఇంకొకరు 'పానీ' మరొకరు 'వాటర్' అని ఇంకో జాతివారు 'అక్వా' అని అన్నట్లుగానే దేవుడిని కూడా కొందరు 'అల్లా' అని, కొందరు 'హరి' అని, మరికొందరు 'బ్రహ్మ' అని వ్యవహరిస్తారు. సాకార భగవంతుడికి, నిరాకార భగవంతునకు గల వ్యత్యాసాన్ని గ్రహించాలి. మంచుగడ్డలకు నీటికి గల తేడానే ఆ వ్యత్యాసం. నీరు ఘనీభవించి మంచుగడ్డ అవుతుంది. మంచు గడ్డ కరిగి, మళ్లీ నీరై పోతుంది. అప్పుడు దాని ఆకారముం అదృశ్యం అవుతుంది. ఆలాగే భక్తుడికి భగవంతుడు అనేక రూపములతో గోచరిస్తాడు అంటారు రామకృష్ణులు.
భగవంతుడు ఎక్కడ? భగవంతుని ఎలా కనుగొనాలనే సందేహం చాలామందికి కలుగుతుంది. దీనికి రామకృష్ణులు చక్కని సమాధానం ఇచ్చారు. పొద్దు పొడుపునకు మందు చిలికిన వెన్న శ్రేష్ఠము. తర్వాత చిలికినది అంత శ్రేష్ఠము కాదు. అట్లే పసితనం నుంచే భక్తి సాధన చేసి, మనసుని భగవంతునిపై మరల్చిన వారు శ్రేష్ఠులు. ఇలా దైవ చింతన అనేది చిన్నతనం నుంచే పెంపొందేలా చూడాలని ఆయన సూచించేవారు. పిరికితనము, ద్వేషము, భయము పాతుకొని ఉండే హృదయంలో భగవంతుడు ఉండడు. దైవానుగ్రహం పొందాలంటే ఉత్తమ నైతిక జీవనం, చక్కని హృదయం ఉండాలంటారు రామకృష్ణులు.
ఈ కాలంలో ఎంతమంది ఇలా ఉంటున్నారు. సమస్తమైన పాపాలు చేస్తారు. సాటి మనుషులను దోచుకుంటారు. ఇవన్నీ చేసి దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినంత మాత్రాన సరిపోదని గమనించాలి. మురికిగా ఉన్న అద్దము సూర్యకిరణాల్ని సక్రమంగా ప్రతిఫలింపచేయలేదు. అలాగే మాయా మోహితులైన మలిన హృదయులు భగవానుని మహిమలను గ్రహింపలేరు. స్వచ్ఛమయిన అద్దము ఎలా అయితే సూర్యకాంతిని సక్రమంగా ప్రతిఫలింపచేయగలదో అలాగే నిర్మల మనస్కులును భగవంతుని దర్శింపగలరు అంటారు రామకృష్ణులు.
సమస్యలు ఉంటూనే ఉంటాయి. భవబంధాలు తొలగవు. అంతమాత్రాన ఇవేవి దైవపూజకు అడ్డుకావంటారు పరమహంస. స్తంభాన్ని పట్టుకొని దాని చుట్టూ ఎంత వడిగా తిరిగినా పిల్లలు పడిపోరు. అదే విధంగా భగవంతునిపై మనసు నిలిపి, ఈ సంసారిక ధర్మములెన్ని నిర్వర్తించినా నీకు ఏ అపాయం కలుగదు. దైవస్మరణ, దైవచింతన మానసిక ప్రశాంతతకు, మూలమని ఏనాడో రామకృష్ణులు వివరించారు. ఈ కాలంలో బహుళవ్యాప్తిలో ఉన్న ధ్యానం పరమార్థం కూడా ఇదే. సంసార చింతనలో, దిగుళ్లతో మనసు కలత చెందనీయకు.
ఏది ఎప్పుడు అవసరమో దానిని అప్పుడు చేస్తూ మనసును మాత్రం సదా భగవంతునిపై స్థిరముగా నిలిపివుంచు అంటారు రామకృష్ణ పరమహంస. ఇలా రామకృష్ణులు ఆధ్మాత్మిక జీవితం గురించి చక్కగా వివరించారు.
అందుకే ఆయన అభిమానం చూరగొన్న వివేకానందుడు సైతం పాశ్చాత్యులకు అర్థమయ్యే రీతిలో సరళంగా భారతీయ ఆధ్యాత్మిక స్వరూపాన్ని కళ్లకు కట్టించారు. అందకే నేటికీ వారు చిరస్మరణీయులుగా మిగిలారు. వారి ఆధ్యాత్మిక ధార అలా చైతన్య దీపాలు వెలిగిస్తునే ఉంది.
Saturday, September 10, 2011
Labels: జయగురుదత్తా
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
చాలా చక్కగా ఉందండి.
Post a Comment