మనం చెప్పే విషయాన్ని జీవితంలో ఆచరించగలగాలి. ముఖ్యంగా ఎదుటి వారికి చెప్పే విషయం మనం ఆచరణలో పెట్టగలిగనదై ఉండాలి. గౌతమ బుద్ధుని చేత ఆణిముత్యంగా ప్రశంసలందుకున్నాడు కుమారజీవుడనే సాధువు. ఆయనను బుద్ధుడు ఆణిముత్యం అని ఎందుకు ప్రశంసించాడు. ఆయనకు ఉన్న అర్హత ఏమిటో చూద్దాం.

మూర్తీభవించిన ధర్మం ఆయన. సాకారమైన శుద్ధ ప్రేమ ఆయన. జ్ఞానభాస్కరుడూ ఆయనే. దుఃఖ సాగరంలో మునిగిపోతున్న లోకాన్ని ఉద్ధరించడానికి ఉద్భవించిన అవతారమూర్తి అతడు. ఆయనే బుద్ధ భగవానుడు. సాక్షాత్తు అతని సమక్షంలోనే ఉండి, ఆయన నోటి నుంచి వెలువడిన భోధామృతాన్ని గ్రోలి, ఆయన చూపిన దారిలోనే నడచి అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించిన వారెందరో! వారిలో మహాకాశ్యపుడు ప్రముఖుడు.

మహాకాశ్యపుడు ముందు నుంచి కూడా ఆధ్యాత్మిక చింతన ఉన్నవాడే. లౌకిక విషయాలు అంత నచ్చేవి కావు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఏకాంతంగా ఉండేవాడు. ఎలాగ వచ్చిందో గానీ ఆయనలో ఒక విధమైన మహత్యం ఉండేది. ఏ దేవాలయంలోకి వెళ్లినా దేవతామూర్తికి మొక్కితే వెంటనే, ఆ దేవతా విగ్రహం భళ్లున పగిలి ముక్కలై పోయేది. అలా జరగటం వల్ల దేవాలయాలకు వెళ్లటం గానీ, దేవతలకు మొక్కటం గానీ ఆయన మానుకున్నాడు.

చివరకు ఎదురైన, తనకు నమస్కరించిన సాధువులకు కూడా నమస్కారం చేయటం మాని వేశాడు. గర్విష్టి అని నింద భరించేందుకు ఆయన సిద్ధపడ్డాడు గానీ ఇతరులకు హాని మాత్రం చేయదలచుకోలేదు. గౌతమబుద్ధుని గూర్చి వారి ద్వారా వీరి ద్వారా విన్నాడు. ఆయన్ను చూడాలని ఉవ్విళ్లూరాడు. ఆ శుభ ఘడియ రానే వచ్చింది. తొలిసారిగా ఆయన బుద్ధ భగవానుడిని చూసిన తక్షణమే ఆయన హృదయంలో ఆయన పట్ల గౌరవ, భక్తి, శ్రద్ధలు కలిగాయి.

అయితే బుద్ధునికి నమస్కరించటానికి సంశయించాడు. దాన్ని తన సూక్ష్మదృష్టితో గమనించిన బుద్ధుడు "కాశ్యపా, సంచయించకు. తథాగతునకు నిర్భయంగా, నిస్సంకోచంగా నమస్కరించు. నీ కోరిక తీర్చుకో. నీ నమస్కారం వల్ల నాకు ఎలాంటి ప్రమాదమూ రాదు'' అంటూ ముందుకు వచ్చాడు. కాశ్యపుడు మనసారా నమస్కరించాడు. బుద్ధునికి ఏ ఆపదా రాలేదు. కాశ్యపునకు ఎంతో ఆశ్చర్యం, ఆనందం కలిగింది.

"బుద్ధం శరణం గచ్ఛామి'' అంటూ సాష్టాంగ నమస్కారం చేసి లేచి " ఈ క్షణం నుంచి మీరే నా శాస్త''(బోధకుడు) అన్నాడు. ముకుళిత హస్తాలతో. బుద్ధుడు ఆయనకు బోధించవలసినదంతా బోధించి, స్వయంగా తగు శిక్షణనిచ్చి, ఇక నీవు వెళ్లి బుద్ధ ధర్మాన్ని అందరికీ పంచు. బహుజనహితాయ, బహుజన సుఖాయ శ్రమించు అని ప్రేరణనిచ్చాడు.

ఆయన ఆజ్ఞను తలదాల్చి మహాకాశ్యపుడు తన జీవితాన్నంతా పర్యటనలోనే గడిపి, వేలమందికి ధర్మాన్ని చేరవేశాడు. తన చేతినందించి నడిపించాడు. ఎవరికి వారే జ్ఞానజ్యోతులై ప్రకాశించే వారయ్యారు. ప్రచండ గాలులు వీచినా ఆరిపోని దీపాల వలే ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మపథం నుంచి భ్రష్ఠులు కాలేదు వారు. వారిలో కుమారజీవుడు అత్యుత్తముడు.

ఏ దేవాలయంలోకి వెళ్లినా దేవతామూర్తికి మొక్కితే వెంటనే, ఆ దేవతా విగ్రహం భళ్లున పగిలి ముక్కలై పోయేది. అలా జరగటం వల్ల దేవాలయాలకు వెళ్లటం గానీ, దేవతలకు మొక్కటం గానీ ఆయన మానుకున్నాడు. చివరకు ఎదురైన, తనకు నమస్కరించిన సాధువులకు కూడా నమస్కారం చేయటం మాని వేశాడు.

కుమారజీవుడు - ధర్మం
"అతడు మన భిక్షు సంఘానికి లభించిన అమూల్య రత్నం'' అని గౌతమబుద్ధుడే ప్రశంసించినాడంటే కుమారజీవుడు ఎంతటి మహనీయుడో మనం అర్థం చేసుకోవచ్చు. మహా కాశ్యపుడు మగధ సామ్రాజ్యంలో పర్యటిస్తున్న సమయంలో కుమారజీవుడు అయన్ను కలిసి శిష్యుడయ్యాడు. బుద్ధుని నుంచి తాను గ్రహించిన ధర్మాన్ని, జ్ఞానాన్ని మహాకాశ్యపుడు ఆయనకు అందించి " నాయనా కుమారజీవా! నీవు ఎంతో అదృష్టవంతుడివి.

యువకుడైన నీవు తథాగత శాసనాన్ని విన్న భాగ్యము పొందావు. వెళ్లు నాయనా వెళ్లు. నీవు ఎక్కడున్నా అష్టలోక ధర్మాలు నిన్ను అంటకుండా జాగ్రత్త పడు'' అని దీవించి పంపాడు. లాభం- నష్టం, కీర్తి-అపకీర్తి, నింద-ప్రశంస, సుఖము-దుఃఖము...ఇవే అష్టలోక ధర్మాలు. వాటి ప్రభావానికి లోనుకావద్దనేది కుమారజీవునకు మహాకాశ్యపుడిచ్చిన సలహా. గురువు పట్ల కుమార జీవునకున్న గురి ఎలాంటిదో ఆయన జీవితమే రుజువు చేసింది. దేశ సంచారం చేస్తూ బైరియా అనే పల్లెకు చేరాడు కుమారజీవుడు.

ఊరిలోని చివరి ఇంటి వద్ద నిలబడి ఒక చిన్న గులకరాయిని తీసికొని ఊరి వెలుపలి దిక్కుగా బాగా బలంగా ఆ రాయిని విసిరి వేశాడు. ఆ రాయి పడిన చోట కుటీరాన్ని నిర్మించి అందులో నివసించసాగాడు. భిక్ష గ్రహించి జీవించేవాడు. ధర్మాన్ని బోధించేవాడు. ఆ గ్రామంలో నందిదేవుడనే ఒక ధనికుడు ఉండేవాడు. ఆయనకున్న ఒక్కగానొక్క కూతురు రత్నదీప. ఆమెను ఎంతో గారాబంగా పెంచే వారు. ఆమెకు పెళ్లీడు రావటంతో మంచి సంబంధాలు వెతికారు. ఏవో కారణాల వల్ల ఏదీ కుదరలేదు.

రత్నదీప అప్పుడప్పుడు నందిదేవుని అనుమతితోనే కొన్నిసార్లు తల్లితో కలిసి, కొన్ని సార్లు ఒంటరిగా కుమారజీవుని కుటీరానికి వెళ్లి ఆయనకు పాలు, పండ్లు ఇచ్చి వచ్చేది. కొంతకాలం గడిచాక రత్నదీప గర్భవతి అయ్యింది. పెళ్లికాకుండానే తమ కూతురు గర్భవతి అని తెలిసి నందిదేవుడు ఉగ్రరూపం దాల్చాడు. తల్లి అపరకాళిక అయ్యింది. " ఎవడే వాడు?'' అని తీవ్ర స్వరంతో ఇద్దరూ గద్దించారు. రత్నదీపను బాగా కొట్టారు. బాధను భరించలేక భరించింది.

ఏదో ఒక రోజున నిజం చెప్పక పోతుందా, అతడెవరో తెలియక పోతుందా చూద్దాం అనుకున్నారు తల్లిదండ్రులు. రత్నదీపకు ఒక బాబు పుట్టాడు. ఇక ఆగలేక పోయారు ఆమె తల్లిదండ్రులు. ఆ పిల్లవాని తండ్రి ఎవరో చెప్పక తప్పదన్నారు. ఆ పిల్లవాని తండ్రి ఎవరో కాదని, ఆ ఊరి ప్రజలందరూ ఎంతో గౌరవంగా ఆరాధించే కుమారజీవుడేనని రత్నదీప చెప్పింది. విషయం ఊరంతా పాకింది. ప్రజలంతా కోపోద్రిక్తులయ్యారు. కుమారజీవుని కుటీరానికి వెళ్లారు. కుమారజీవుని నానా దుర్భాషలాడారు. నీవు ఘోరమైన నేరాన్నే చేశావు అన్నారు. "అవునా?'' అన్నాడు కుమారజీవునితో "పాప భిక్షూ, నీ కర్మ ఫలాన్ని తెచ్చాను. ఇదిగో నీ ముద్దుబిడ్డడు, తీసికో'' అన్నాడు." అలానా?'' అంటూ ఆ పసివాడిని తన చేతుల్లోకి తీసికొన్నాడు కుమారజీవుడు. తమ ఆవేశం తగ్గే దాకా కుమారజీవున్ని తిట్టి అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

బోధించేది... ఆచరించాలి
రత్నదీపకు ఏమి చేయాలో దిక్కుతోచలేదు. మేడ మీదకెక్కి కుమారజీవుని కుటీరం వైపు ఎంతో ఆశతో కళ్లను ఇంత చేసికొని చూసింది. కుమారజీవుడు, అతని వడిలోని తన బాబు కనపడ్డాడు. బాబు ఏడ్వటం ప్రారంభించాడు. కుమారజీవుడు లేచి బాబును తన భుజంపై జాగ్రత్తగా పరుండబెట్టుకోని ఊరివైపు నడవటం, ఏదోలా ఒక గిన్నె నిండా పాలు సంపాదించటం, ఏడుస్తున్న బాబు నోటిలోకి ఆ పాలను పోయటం...అంతా చూసింది రత్నదీప.

ఇక దుఃఖాన్ని దిగమింగలేక పోయింది. ఏ శక్తీ ఆమెను ఆపగలిగే పరిస్థితిలో లేదు. సరాసరి రచ్చబండ వద్దకు వెళ్లి అక్కడ వేపచెట్టుకు వేలాడదీసిన గంటను గణగణ మోగించింది. ఊరి జనమంతా ఆశ్చర్యంతో అక్కడికి చేరారు. తన బాబుకు నిజమైన తండ్రి ఎవరో చెబితే తన తల్లిదండ్రులు అతనిని చంపివేయటమో, వారే ఆత్మహత్య చేసికోవటమో జరుగుతుందని తాను భయపడి అబద్ధం చెప్పానని, కుమారజీవుడు ఏ పాపమూ ఎరుగని పవిత్రమూర్తి అని ఏడుస్తూ చెప్పింది.

నందిదేవుడు, ఊరిపెద్దలు, ప్రజలందరూ కుమారజీవుని నిందించినందుకు, రత్నదీప మాటలను గుడ్డిగా నమ్మినందుకు ఎంతో సిగ్గు పడ్డారు, విచారపడ్డారు. కుమారజీవుని వద్దకు వెళ్లి క్షమాపణ కోరి ఆయన కాళ్లమీద పడదలిచారు. అందరూ కుమారజీవుని కుటీరానికి వెళ్లారు. కుటీరంలోనేమో కుమారజీవుడు పసిబిడ్డకి పాలు తాపి, స్నానం చేయించి, ఉయ్యాలలో వేసి నిద్రపుచ్చేందుకు జోలపాట పాడుతున్నాడు. నందిదేవుడు సరాసరి ఆయన వద్దకు వెళ్లి ఆయన పాదాలపై పడ్డాడు.

'మహానుభావా! మమ్మల్ని క్షమించాలి. ఆకాశన్నంటే మహోన్నత వ్యక్తిత్వం మీది. అహంకారంతో మిమ్మల్ని అవమానించాము. ఆ పసివాని తండ్రి మీరు కారు, మరొకరు', అని చెప్పాడు. 'అవునా?' అని ఆ బిడ్డను ఊయలలో నుంచి తీసి నందిదేవునకిచ్చాడు కుమారజీవుడు. అందరూ ఆయన పాదకమలాలకు ప్రణమిల్లారు. పూలహారాలు వేశారు. హారతులిచ్చారు, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకోవటానికి సిద్ధపడ్డారు.

ఇవి ఏవీ పట్టించుకోక కళ్లు మూసుకొని ధ్యానంలోకి వెళ్లిపోయాడు కుమారజీవుడు. నిందాస్తుతులు ఏవీ ఆయన్ను ప్రభావితం చేయలేక పోయాయి. బుద్ధునికి తగిన శిష్యుడు మహాకాశ్యపుడు ఐతే, ఆయనకు సరైన శిష్యుడు కుమారజీవుడని నాటి సంఘం గుర్తించింది. దేన్ని పరులకు బోధించారో దాన్నే తమ నిజ జీవితంలో ఆచరించిన మహనీయులు వారంతా.
- రాచమడుగు శ్రీనివాసులు

0 comments: