పూర్వం సేనానానీ అనే మంగలి ఉండేవాడు ఆయన ఉత్తమమైన హరి భక్తుడు. తన సహధర్మ చారిణితో పాటు ధర్మం తప్పకుండా గృహస్థ జీవనం గడుపుతున్నాడు. ప్రతిరోజూ ఉదయం శ్రీహరిపూజ ముగించుకుని తరువాత తన కర్తవ్య నిర్వహణకై రాజ మందిరానికి వెళ్ళేవాడు .

ఒకరోజు ఆయన శ్రీహరి పూజలో లీనమై అలానే ధ్యానావస్థలో చాలాసేపు కూర్చుండి పోయాడు .పూజలో ఆయనకు సహకరిస్తున్నభార్యకు రాచకార్యానికి చాలా ఆలస్యం అయిపోతునదన్న భయం వేసింది. కానీ అతని ధ్యానానికి భంగం కలిగించే సాహసం ఆమెకు లేకపోయింది . ఆమె భయపడుతున్నట్లుగానే రాజమందిరం నుంచి రాజభటుడు వచ్చాడు .
సేనానానీ ! సేనానానీ ! అని వీధిలోంచి కేకవేశాడు . అతని భార్యబయటకొచ్చి వినయంగా ,అయ్యా ! ఆయన పూజలో ఉన్నారు పూజానంతరం వెంటనే పంపిస్తాను అని చెప్పింది .అయితే అసూయపరులైన ఇరుగుపొరుగు ఆడువారు భటునికి వినపడేలా పూజట, పూజ ! ఎంత గర్వం రాజాజ్ఞకూడా లెక్కలేదు వీళ్లకి ,మధ్యలో లేపితే ఏం ? మరీ ఇంత అమర్యాదా ? అని గుసగుస లాడటం మొదలెట్టారు.

భటుడు కోపం తో వెళ్ళి రాజుగారికి విషయం విన్నవించాడు .పూజలో ఉన్నాడా ?ఎంతధైర్యం ? రాజాజ్ఞాంటే అంత చులకనై పోయిందా ? అతనిని కాళ్ళూ చేతులూ బంధించి ఈడ్చుకుని రండి అని రాజుగారు ఆవేశంలో ఆజ్ఞ ఇచ్చాడు .
పాపం పూజలో ఉన్న ఆక్షురకుడు రాజాజ్ఞను ఎలా తెలుసుకోగలుగుతాడు? భగవన్నామాన్ని స్మరిస్తూ ఆనందపరవశుడై ఉన్నాడు. ఇక ఆపరంధామునికి తప్పలేదు .తన భక్తుని వేషం ధరించి చేతిలో పొత్తిని పట్టుకుని రాజభవనానికి చేరుకున్నాడు. ఎదురుగా వస్తున్న భటులు అతనిని బంధించి రాజుగారి సమక్షానికి తీసుకువచ్చారు.
కానీ అతన్ని చూడగనే రాజుగారి మనసులో కోపం ఎగిరిపోయింది . ఇతని కట్లు విప్పండి క్షురకర్మ పూర్తవగానే నాకు తైలమర్ధనం చేయాలి అని ఆజ్ఞాపించాడు. అతడు బంధవిముక్తుడై రాజుగారికి క్షురకర్మ పూర్తిచేశాడు .అనంతరం బంగారు పీటమీద కూర్చుని నూనెరాయించుకుంటూన్న రాజుగారికి మునుపెన్నడు కలుగని తన్మయావస్థ కలుగుతున్నది.ఏదో తెలియని ఆనమ్దంతో పులకరించి పోతున్నాడు . ఆ ఆనందం లో అకస్మాత్తుగా నూనె గిన్నెలో ప్రతిబింబాన్ని చూశాడు .అందులో శంఖచక్ర ధారియగు భగవంతుడు తనకు నూనెరాస్తున్నట్లు కనపడింది .ఆశ్చర్యపోతున్నాడతను . ఇతను మంగలా ?లేక శ్రీహరా ? ఏమిటీ వింత అని వితర్కించుకుంటున్నాడు . ఆదివ్యస్పర్శ ,ఆ అద్భుతదర్శనమ్ అతని మనసును బాహ్యంవైపు మల్లనీయటం లేదు . సేనానానీ ! నేనెన్నడు జీవితం లో ఎరుగని మాహదానందం ఈరోజు పొందుతున్నాను నీవలన .కనుక నువ్వు నన్నువిడిచి వెళ్లవద్దు నాతో ఉండిపో అన్నాడు మహారాజు.
మహారాజా ! నేను మీతో టే ఉండిపోతే నా ఇతర కార్యాలన్నీ స్తంభించి పోతాయి . మీ కోపం తగ్గింది కదా ! రోజూ వస్తుంటాను ఎప్పటిలాగానే అన్నాడతను. ఒకపెద్ద బంగారు నాణెముల సంచిని మంగలి చేతికిచ్చి సేనా ! నేనొచ్చినదాకా ఉండు అని చెప్పి స్నానానిక ని వెళ్ళాడు మహారాజు. అతనటువెళ్లగనే ఆ మాయా సేనానాని ఇటు మంగలి ఇంట ప్రత్యక్షమై ఆధనాన్ని అక్కడ ఉంచి అదృశ్యమయ్యాడు. స్నానం చేసి వచ్చిన మహారాజుకు సేనానాని కనపడక హృదయం ఆవేదనకులోనైంది .అంతే మరి భగవంతుని కరుణను రుచిచూసిన వానికి ఆ ఆనంద వియోగం తట్టుకోవటం దుర్భరం . ఎవరక్కడ ? వెంటనే సేనానానీని పిలుచుకురండి అని భటులను పంపాడు .

ఇక్కడ అసలు సేనానాని ధ్యానం లో శిలావిగ్రహంలా బిగుసుకుపోయి వున్నాడు . భటులొచ్చి తలుపు తట్టేసరికి మామూలు లోకంలోకొచ్చాడు. మీకొరకు రాజభటులు రెండుసార్లు వచ్చారు అని భార్యచెప్పగా భయపడ్దాడు. ఇంతలా ఆలస్యం చేసినందుకు ప్రభువు దండిస్తాడేమోని ఆందోళన చెందుతున్నాడు . ఖంగారుగా బయలుదేరాడు వారివెంట . రాజ భవనానికి వచ్చేసరికి మహారాజు స్వయంగా ఎదురొచ్చాడు . సేనా ! ఏదీ ఇందాక నూనెలో చూపిన దివ్యమంగల రూపాన్ని మరొక్కసారి చూపవా ! అని ప్రాధేయపడుతున్నాడు. మంగలికి అర్ధం కావటం లెద. గజగజ వణుకుతూ ఏలినవారు నా తప్పు కాయాలి. ఈరోజు పూజలో స్వామి రూపాన్ని చూస్తూ మైమరచి మీవద్దకు శీఘ్రమే రాలేకపోయాను , నన్ను క్షమించి కాపాడాలని వేడుకుంటూన్నాడు.
ఏమిటిది ? నువ్వు ఇందాకవచ్చావుకదా ? నాకు ఆదివ్యమైన స్వామి రూపాన్ని నూనెలో చూపావుకదా ? ఇదమ్తా నాభ్రాంతియా ?అని రాజుగారు విస్తుపోతూ అడిగాడు మహారాజు .
ఏమో ! ప్రభూ నేను ఇప్పుడే పూజముగించుకుని తమరు పంపిన భటులవెంట వారు రాగానే వచ్చాను కావాలంటే అడగమన్నాడు. అతనిని తీసుకువచ్చిన భటుడుకూడా అవునండీ నేవెళ్లాకనే ఇతను పూజవద్దనుంచి లేచి నావెంటవచ్చాడు అని చెప్పాడు.
మహారాజుకు తలతిరిగిపోయింది . అయితే నీరూపలో .... ?ఆ వచ్చినదెవరు ?????
ప్రభుదర్శనంతో సునిశితమైన మహారాజు బుద్దిశక్తి కి విషయం అర్ధమైంది . కన్నిటిపర్యంతమవుతూ ,మహాభక్తా ! మిమ్మల్ని బంధించి తెమ్మని చెప్పిన ఈ అజ్ఞానిని మన్నించండి ,మీకొరకు పరమాత్మే స్వయంగా తరలివచ్చారంటే ! మీరెంత పుణ్యాత్ములో అని కాళ్లమీదపడ్దాడు.
ఇటు సేనానానీ కీ విషయం అర్ధమైంది పరమపురుషా ! ఏమినీ భక్తజన వాత్సల్యత ! నాలాంటి అల్పునికోసం నీవే స్వయంగా సేవకావృత్తికి కూడా వెనుకాడకుండా వచ్చావా ? తండ్రీ !మహారాజుకు కలిగిన భాగ్యం ఈ పాపాత్మునికెందకు కలిగించలేదు ? అని పరుగు పరుగునపోయి ఆశ్రీహరి దివ్యవిగ్రహం పాదాలచెంత వాలి విలపిస్తున్నాడు .............దీనుడై,ఆర్తుడై .... ఆఅఖిలాండకోటిబ్రహ్మాండనాయకుని కోసం ఎలుగెత్తి పిలుస్తూ ...జడుడై ,బాలుడై ,ఉన్మత్తుడై..................

0 comments: