Tuesday, February 10, 2009

నా భావం .................

Om sri sai ram my dairy:-date:08-03-08

ఈ రోజు సంక్షిప్త శ్రీరామక్రిష్ణుని జీవన చరిత్రను అర్ధం చేసుకుని నా జన్మను సార్ధకం చేసుకున్నాను.గ్రంధాన్ని పఠించే సమయమంతా ఎంతో ఆసక్తితో నా అంతఃకరణ చతుష్టయం ఒకటే అయి భక్తి పారవశ్యంలో ఉన్నాను. ఈ సమయమంతా రోమాలు నిక్కపొడుచుకునేవున్నాయి .నా మనసు దరహాసవదనీయులైన శ్రీరామక్రిష్ణుని కను కొనల వెంబడి కారే భక్తి జలాలవైపే కేంద్రీకృతమై, వివిధ నాడులలో నుంచి భక్తి, తత్పరత కలిగిన క్షణాలు అనిర్వచనీయం. శ్రీరామక్రిష్ణునికి కించిత్తైనా అహం భావం లేదు. ఈ వాక్యాలను చదివేటఫ్పుడు నా కనుల వెంబడి సద్గురువునందు అవినాభావసంబంధంతొ కూడిన ప్రేమాశ్రువులు పారినవి. శ్రీరామక్రిష్ణుని భక్తితో సేవించిన "మధుర్" అనునతనికి నా మనస్సులో పాదాభివందనం చేసాను. ఏలయన శ్రీరామక్రిష్ణుని సేవించే భాగ్యం అతనికే దక్కినది కదా. శ్రీరామక్రిష్ణుల దివ్య అనుభూతులు, విచిత్ర దర్శనాలు గాంచిన క్షణము నా మనస్సు ఆశ్చర్యంతో కూడిన మహదానందంతో ముగ్ధమయ్యేది. కామమును అహంకారమును చిత్త బేధను పొగొట్టుకోవటానికి పరమహంస చేసిన సాధన వర్ణనాతీతం. కాలక్రమేణా "నేను" అనే భావం నాశనమయ్యి వివేక వైరాగ్యాలను ఘొర తపస్సు చేత సంపాదించబడ్డ మధుర క్షణాలు అఖండం. పుట్టుకతొనే వైరాగ్యాన్ని పొందిన రామకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే అని నా ప్రగాఢ నమ్మకం. దేవి దర్శనం కోసం వేచిన సమయమంతా ఎంతో సహనంతొ, ఓర్పుతో, భౌతిక విషయాలకు అతీతుడై దేనినీ పట్టించుకోక చేసిన ధ్యానం అమొఘం. సామాన్యులకు ధ్యాన స్థితి కలుగుట ఎంత కష్టమో, గురుదేవులకు జాగృదావస్థలోకి రావటమూ అంత కంటే కష్టం. అంత సాధనతో, ప్రేమతో , తత్పరతతో భావన వుండబట్టే కదా దేవీ దర్శనాన్ని పొందింది మరి. శ్రీరామక్రిష్ణులతో పాటు శ్రీ శారదామాతనూ భగవత్ దిశలో నడిపించాడు ఆ ఈశ్వరుడు. "వివేకానందుని చూడాలని పరితపించే ఆ మనస్సు "ను చదివినప్పుడు వీరిద్దరూ ఒక్కటే అనే భావన గుండెలలో బలంగా నాటుకుంది. శ్రీరామక్రిష్ణుని మహాసమాధిని చదివే గడియలలో నా శరీరంలో నుంచి ఎవోతెలియని ప్రవాహాలు హృదయాంతరాళాలలోకి చేరి ఆ ప్రేమ కనుల ద్వారా అశ్రురూపం దాల్చింది. చాలా సేపు ఏడ్వసాగాను. కనులు ఎర్రబడి ఉబ్బినాయి. అది గమనించినప్పుడు బాహ్యస్మ్రతిలోకి వచ్చాను.చాలా సేపు ఛాయా చిత్రాన్ని చూస్తూ ఆలోచనా రహిత స్తితిని పొందాను.

ఇది శుభ దినం. ఈ జీవితంలో మరువరాని రోజు.నా అహంకారాన్ని జయించటానికి, పరిపూర్ణభక్తి బాటలో పయనించేందుకు శక్తిని ఇవ్వమని గురుదేవులనే ప్రార్ధిస్తున్నాను..

సాయిని కృష్ణునిగా ,గురుదేవులను రాధగా భావించి రాధ కోసం విలపించి నా కృష్ణుని చేర్చమన్నట్టు మనస్సు భావాస్తితిలో లగ్నమయింది.

సర్వం ఆ ఈశ్వరుడి సంకల్పమే.
[ఖరగ్ పూర్ లో ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్ధి వ్రాసిన తన డైరి లో ఒక పేజి పంపాడు ]

0 comments: