Thursday, February 16, 2012

అంతా దైవేచ్ఛ!

అంతా దైవేచ్ఛ!

గురుదేవులు ఒక తులసిమాలను, ఒక డైరీని వృద్ధునికిచ్చి శ్రీకృష్ణమంత్రాన్ని ఉపదేశించారు. "గతాన్ని మరచిపో. నీ పలక శుభ్రంగా ఉంది. నీవు నా రక్షణలో ఉన్నావు. ఈ జపాన్ని రోజూ 10 మాలలు తిరిగేంతవరకు చేయ''వలసిందిగా స్వామీజీ హితోపదేశం చేశారు.

రుషీకేశ్‌లో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఒక సన్యాసి పెద్ద ఆశ్రమం నిర్వహించేవాడు. ఆయన గొప్ప సాధకుడు. సంవత్సరాల తరబడి ధ్యానంలో గడిపిన మహానుభావుడు. అంతేకాదు ఆయన ఒక బహు గ్రంథకర్త.

ఒకనాటి ఉదయం ఆశ్రమ కార్యదర్శి స్వామీజీతో ఆంతరంగికంగా మాట్లాడాలని వచ్చాడు. అతడు స్వామీజీకి "ఆశ్రమ ఆర్థికస్థితి ఏమీ బాగాలేదు. అంగటివానికి 20 వేలు బాకీఉన్నాము. ప్రచురణకర్తకు 30 వేలు, స్టేషనరీ సరఫరా చేసిన వారికి 20 వేలు బాకీ ఉన్నాము. బాకీదార్లంతా ఆశ్రమానికి వచ్చి నానా యాగీ చేస్తున్నారు. మనకు వచ్చే విరాళాలు తగ్గిపోయాయి. తక్షణం ఏదో ఒకటి చేయాలి'' అని చెప్పాడు.

గురుదేవుడు కార్యదర్శిని తన ఆలోచన చెప్పమన్నాడు. కార్యదర్శి ఇలా చెప్పాడు. "మన ఆశ్రమంలో నూరు మంది స్వామీజీలు, బ్రహ్మచారులు శాశ్వతంగా ఉంటున్నారు. వీరి వల్ల ఆశ్రమానికి కించిత్ కూడా ప్రయోజనం లేదు. వీరిలో కొత్త వారిని పంపివేస్తే మనభారం కొంత తగ్గుతుంది.'' అంతట గురుదేవులు ఇలా అన్నారు. "నీ ఆలోచన అద్భుతంగా ఉంది. నీవు సాధువు కాక ముందు ప్రభుత్వ అధికారివి అయి ఉంటావు. అయితే ఒకటి చెప్పు. మనం తొలగించిన వారంతా ఇక్కడ నుండి వెళ్లి ఎక్కడ ఆశ్రయం పొందుతారు?''.

దేవుడిదే భారం
దీనికి కార్యదర్శి ఇలా బదులిచ్చాడు. "జనం సన్యాసం తీసుకొన్నపుడు తన బాధ్యత దేవుడిదే అని భావిస్తారు తప్ప ఏదో ఒకరి ఆశ్రమంలో చోటు దొరుకుతుందని అనుకోరు. రుషీకేశ్, హరిద్వార్‌లలో బోలెడన్ని ఆశ్రమాలున్నాయి. వాటిలో ఏదో ఒక దానిలో చేరిపోతారు. కాకపోయినా ఇక్కడ అనేక సత్రాలున్నాయి. వీరికి అక్కడ నిత్యం భోజనం దొరుకుతుంది. నేను కొంతకాలంగా ఈ ఆశ్రమాన్ని కాపాడు తండ్రీ అని దేవుణ్ణి వేడుకుంటున్నాను. కాని నాకేమి అభయం రాలేదు. తీవ్ర నిరాశతో మీ వద్దకు వచ్చాను.''

గురుదేవులు నిట్టూర్పు విడుస్తూ ఇలా సెలవిచ్చారు. "ఈ ఆశ్రమం నా దయాదాక్షిణ్యాలతో నడవడం లేదు. మన అందరి ప్రారబ్ధ ఫలితంగానే నడుస్తోంది. మనం చేస్తున్నది దైవకార్యం. ఆశ్రమ నిర్వహణ ఆయనే చూసుకుంటాడు. గంట కొట్టగానే మన దగ్గరకు రావడానికి దేవుడు బంట్రోతు కాదు. ఆయన యజమాని. ప్రార్థనలకు మాత్రమే ఆయన లొంగుతాడు. మన ప్రార్థనలను కొనసాగిద్దాం. మరో ఆరునెలలు వేచి చూద్దాం. అప్పటికి మార్పు రాకపోతే మన ఆశ్రమాన్ని మూసేసి మన కమండలాలతో ఏ ఆశ్రమానికో అన్న సత్రానికో పోదాం.''

స్వామీజీ శరణు కోరిన వృద్ధుడు
మూడు నెలలు గడిచాయి. పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. ఒక రోజు ఉదయం ఆశ్రమంలోని కార్యాలయం వద్దకు గురుదేవులు రాగానే మాసిన గడ్డం, చిరుగు గుడ్డలు ధరించిన ఒక వృద్ధుడు ఆయనకు మోకరిల్లాడు. తాను దుర్భర పరిస్థితిలో ఉన్నానని, మీతో కొంతసేపు ఏకాంతంగా మాట్లాడాలని, అందుకు అనుమతించాలని అతను కోరాడు. స్వామీజీ అందుకు అంగీకరించారు. సాయంత్రం ఇక్కడే కలుసుకుందామని అన్నారు. సాయంత్రం ఆ వృద్ధుడు మరల వచ్చాడు.

ఇద్దరూ ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఆ వృద్ధుడు తన గోడును స్వామీజీకి వెళ్లబోసుకుంటూ "స్వామీ..నేను పరమ నికృష్టుణ్ని. నేను చేయని పాపం లేదు. నా మీద దయ ఉంచి దైవ సాక్షాత్కారం పొందే మార్గం చెప్పండి'' అని అర్థించాడు. గురుదేవులు ఒక తులసిమాలను, ఒక డైరీని వృద్ధునికిచ్చి శ్రీకృష్ణమంత్రాన్ని ఉపదేశించాడు. "గతాన్ని మరచిపో. నీ పలక శుభ్రంగా ఉంది. నీవు నా రక్షణలో ఉన్నావు.

ఈ జపాన్ని రోజూ 10 మాలలు తిరిగేంతవరకు చేయ''వలసిందిగా స్వామీజీ హితోపదేశం చేశారు.. అంతట ఆ వృద్ధుడు దూరంగా నిలుచున్న ఒక వ్యక్తిని సైగ చేసి పిలిచాడు. అతని వద్ద ఉన్న పెట్టెలో నుంచి డబ్బు కట్టలను తీసి స్వామీజీ పాదాల ముందు పెట్టి ఈ ఐదులక్షలను గురుదక్షిణగా స్వీకరించవలసిందిగా ప్రార్థించాడు. గురువు మన్నించాడు. ఆ వృద్ధుడు నిశ్శబ్దంగా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మరల ఎక్కడా కనిపించలేదు. అది భగవల్లీల! కాదని ఎవరు చెప్పగలరు? భగవంతుడు భక్తుల ప్రార్థనలు తప్పక మన్నిస్తాడు. అయితే ఒక్కోసారి ఆలస్యమైతే కావచ్చు.

- రావినూతల శ్రీరాములు

0 comments: