జై శ్రీ రాం,
శ్రీరామదూతం శిరసా నమామి!

భగవద్భక్తులందరికీ నమస్కారం.
ముందస్తుగా ఈ మెయిల్ ఇంత ఆలస్యంగా రాస్తున్నందుకు క్షమించాలి. .
ఇక విషయానికి వస్తే, హనుమద్రక్షాయాగం జరుగుతున్న రోజుల్లో, మాస్టరుగారిని
నేను ఒక ప్రశ్న అడిగాను. మాస్టరు గారూ, వసంత గర్భవతిగా ఉంది, ఇంట్లో
పూజలు ఏమీ చెయ్యకూడదు అంటున్నారు, అసలు నేను ఏమి చెయ్యవచ్చు, ఏమి
చెయ్యకూడదు, కడుపులో ఉన్న బిడ్డకి, వసంతకి మంచి జరగాలంటే అని. దానికి
సమాధానంగా వారు "చాలీసా పారాయణం అత్యంత శక్తివంతం, మా రెండో అబ్బాయి
పుట్టినప్పుడు ప్రాణగండం ఉంది టీచర్ గారికి, నేను రెండు రోజులూ , చాలీసా
పారాయణ చేస్తూనే ఉన్నాను. చేతిలో గండం , చేతిలోనే ఆగిపోయింది
జీవితంలోకి రాకుండా." నువ్వు కూడా అలా చెయ్యవచ్చు నాయనా " అని చెప్పారు.
అది ఎందుకో మనసులో ముద్ర పడిపోయింది. అప్పటినుండి రోజూ పడుకోబోయే ముందు
కుదిరినప్పుడల్లా చాలీసా,దండకం ద్వాదశ నామాలు,కౌసల్య చేసిన మంగళాశాసనం
(యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా, అమృతం ప్రార్ధయానస్య తత్తే భవతు
మంగళం....) బిగ్గరగా చదివేవాడిని, కడుపులో బిడ్డ వింటుందని ఒక ఆశ,
నమ్మకం. రోజూ సుందరకాండో, దశమస్కంధమో చెప్పేవాడిని నా భార్యకి. నెలలు
నిండి కాన్పుకి వెళ్ళినప్పుడు నార్మల్ డెలివరీ అవుతుంది అన్నారు.

నెప్పులు వచ్చిన రోజు (సెప్టెంబర్ 10 2011) సాయంత్రం ఫోన్ చేసారు.
బయలుదేరమని. వెంటనే స్నానం చేసి బయలుదేరాను, నోట్లోంచి అప్రయత్నంగా
చాలీసా వచ్చింది, ఆ వెంటనే మాస్టరుగారి మాటలు గుర్తొచ్చాయి. ఇక ఆపకుండా
చాలీసా పారాయణ చేస్తూ హైద్రాబాద్ నుండి బయలుదేరాను. ఏడింటప్పుడు ఫోన్
చేసారు, ఉమ్మనీరు తగ్గిపోయిందట, బిడ్డ పైకి వెళ్ళిపోతుంది, ఆపరేషన్
చెయ్యాలంటున్నారు. థియేటర్ లోకి తీసుకువెల్తున్నారు అని. నాకు ఒక్క క్షణం
ఏమీ అర్ధం కాలేదు, స్వామీ నిన్నటిదాకా నార్మ డెలివరీ అన్నారు, ఈరోజు
హటాత్తుగా ఆపరేషన్ అంటున్నారు, నిన్నే నమ్ముకున్ని ఉన్నాం. నీ బిడ్డని
నువ్వే కాపాడాలి అనుకున్నాను. చాలీసా మాత్రం ఆపలేదు. తర్వాత, ఏమోలే
ఆపరేషన్ కాకపోతే ఇంకా ఇబ్బంది అయ్యుండేదేమో, ఆ స్వామి ఆపరేషన్ తప్ప ఇంకో
మార్గం లేక ఇలా చేస్తున్నారేమో, స్వామీ తనకీ బిడ్డకీ ఎలా మంచిదనిపిస్తే
అలా చెయ్యీ స్వామీ అని అనుకున్నాను, అంతలో ఒక దృశ్యం కనిపించించి.
ఆపరేషన్ బెడ్ మీద ఆకుపచ్చని దుస్తుల్లో డాక్టర్లు, వసంత ఉన్నారట. పక్కనే
స్వామి నిలబడి తన తలని చేత్తో నిమురుతున్నారట. ఆ స్వామి దయ,నా ప్రాప్తం
అనుకుని అలాగే పారాయణ చేస్తూ ఉండిపోయాను. ఇంకో అరగంటకి ఫోన్ చేసారు,
ఆడపిల్ల పుట్టింది, నార్మల్ డెలివరీ అట అని.

ఒక్క నిముషం నాకేమీ అర్ధం కాలేదు, ఆపరేషన్ అన్నారు, కంపల్సరీ అన్నారు.
మరి ఇలా ఎలా అని. అదే అడిగాను. ఆపరేషన్ కి అంతా రెడీ చేసుకుని
కూర్చున్నరట డాక్టర్లంతా. మత్తు మందు ఇవ్వాల్సిన డాక్టరు ఒక
పదినిముషాలు ఆలస్యంగా వచ్చారట. ఈ టైం లో బిడ్డ మళ్ళి కిందకి ట్రావెల్
చెయ్యడం మొదలుపెట్టిందట. ఆపరేషన్ చెయ్యకుండా డెలివరీ చేసేసారు. నా
భార్యకి కూడా తెలియదు ఆపరేషన్ జరగలేదని, తర్వాత డాక్టర్లు చెప్తే
తెలిసిందట, తను ఆపరేషన్ జరుగుతుంది అనుకుందట. కానీ కాదు.

ఆ స్వామి ఇలా ఆయన లీల చూపించారు నాకు. ఇది ఇక్కడ రాయడం సబబో కాదో నాకు
తెలియదు. ఆ స్వామి నామ జపం ఎప్పుడైనా ఎక్కడైనా చెయ్యచ్చు అనడానికి ఆ
స్వామి నాకు చూపించిన దృష్టాంతాన్ని మీతో పంచుకోవాలనిపించి రాస్తున్నాను.

ఇక పాపపేరు విషయంలో అస్వామి నా చెయ్యి పట్టుకుని నడిపించారు.

మాకు నాగారపమ్మ కులదైవం, మాలకొండస్వామి(లక్ష్మీనరసింహ స్వామి) ఇలవేల్పు.
సహజంగా మా ఇళ్ళల్లో అందరిపేర్లూ ఐతే మ తో కానీ లేదంటే కొండ తో కానీ
మొదలవుతాయి. నా పేరు మనోహర్, మా అన్నయ్య పేరు కొండలరావు, మా నాన్న పేరు
కొండయ్య ఇలా. ఇంతకు ముందు పేర్లు పెట్టేటప్పుడు గద్దె అడిగి తర్వాత
పేరు పెట్టేవారట. ఇప్పుడు అయ్యవారిని అడిగి నక్షత్రం ప్రకారం
పెడుతున్నారు. ఏ అక్షరం తో వచ్చినా మగపిల్లవాడైతే రాముడి పేరు, ఆడపిల్ల
ఐతే సీతమ్మ పేరు పెట్టుకోవాలి అనుకున్నా. పెట్టగలననుకున్నా , నా
పాండిత్యం మీద వెర్రి నమ్మకంతో. కానీ అక్షరం "గ" వచ్చింది . ఆ అక్షరం తో
నాకు సీతమ్మ పేరు దొరకలేదు, దానితో ఇక వేరే దారి లేక గీతా శ్రీ అని
పెట్టుకుందామనుకున్నాను. ఆ పేరు పాప దగ్గర అన్నప్పుడల్లా విపరీతంగా
ఏడవడం, జుట్టు తెట్లు కట్టడం , ఇలా జరిగేసరికి గద్దె అడగమన్నారు. సరే
అని అడిగితే నాగారపమ్మ , మాలకొండస్వామి పేరు మీద పెట్టకుండా ఇష్టమొచ్చిన
పేరు పెట్టారు , అందుకే ఆరళ్ళు పెడుతున్నా, పేరు మార్చు అని చెప్పారు.
ఉత్తరక్షణం నాకు తోచిన పేరు నాగ మైథిలి. ఆ పేరు పెడదామన్నాను, అందరూ సరే
అన్నారు. ఆ పేరే ఖరారు చేసాం. ఎంతైనా సీత అని తనకు తాను పేరు పెట్టుకున్న
తల్లి కదా, అందుకే నా కూతురి పేరు పట్టుబట్టి ఇలా పెట్టించిందనిపించింది.
నా అభీష్టం నెరవేర్చింది.

జై భజరంగభళీ ,


విధేయుడు,
మనోహర్ చెనికల

1 comments:

Anonymous said...

durgeswara blog kuda meedenaa?