దైవ లీలలు ఎన్నెన్నో! మన జీవితంలో బాధలు కలిగినపుడు, మనకు ఎటు వెళ్ళాలో దారి తెలీనప్పుడు, ఆ భగవంతుని శరణు వేడితే, సకలమూ భగవత్సహాయంతోనే చక్కబడతాయి. నా జీవితంలో ఎంతో బాధల్లో, నిర్ణయాలు తీసుకోలేని సందిగ్ధ క్షణాల్లో తానే నాకు తోడుగా నిలచి, నా జీవితాన్ని ఆ అంజనేయస్వామి ఒక మలుపుని తిప్పారు. నా జీవితం ఈ రోజు ఈ మాత్రం సంతోషంగా సాగుతోందంటే, అది ఆ స్వామి చలవే.

మా నాన్నగారు నాకై చాలా పెళ్ళి సంబంధాలు వెతికారు. దాదాపు 4 ఏళ్ళ పాటు నాకు సంబంధాలు చూసారు. నా పెళ్ళికై చాలా అలోచించి, బాధపడేవారు. ఆ పరిస్థితుల్లో నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది. నాకు అక్కడ ఒక మంచి అతనితో పరిచయం కలిగింది. నా పై అధికారి అయిన అతను, నన్ను ఇష్టపడుతున్నారని తెలుసు, కానీ ఎలా.... ఆయన్ని నేను పెళ్ళి చేసుకోవడం జరగని పని... అతని కులమూ, నా కులమూ వేరు. నేనా బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టినదాన్ని, ఆయన చూస్తే వెలమ. ఈ పొత్తు కుదిరేది కాదులే అనుకున్నాను. కానీ, ఆ ఒక్క విషయం తప్పిస్తే కాదనడానుకోవడానికి నాకు ఏ కారణమూ కనిపించలేదు. ఆ భగవంతుడి నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుందిలే అనుకొని, ఒక గడువు వరకూ మా నాన్న తెచ్చిన సంబంధం ఏదీ కుదరకపోతే, ఆ వ్యక్తినే నాకు జీవిత భాగస్వామి చెయ్యాలని ఆ భగవంతుడే నిర్ణయించాడేమో అని అనుకున్నాను. అదే మాట అతనికి కూడా చెప్పాను. మళ్ళీ నాపై ఆశలు పెంచుకోవద్దని, నేను చెప్పిన గడువులోగా మా నాన్న తెచ్చిన సంబంధం ఏదైనా కుదిరితే నేను చేసుకుంటానని, నాకోసం వేచి చూడవద్దని, నా సంగతి అనిశ్చితిలో ఉంది కనుక నాకోసం అలోచించవద్దనీ చెప్పాను. అతను నాకు కూడా కుదరకుంటే... అని నవ్వి వదిలేసాడు.

విధి నాకు పరీక్ష పెట్టనే పెట్టింది. నేను అనుకున్న గడువులో మా నాన్న తెచ్చిన సంబధం ఏదీ కుదరలేదు. నాకోసం ఎదురుచూసే అతనితో జీవితం పంచుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన తరువాత.... ఆ విషయం మా ఇంట్లో చెప్పాను. ఏముంది, అంతా మామూలే. మా నాన్న ఒప్పుకోలేదు. చాలా ప్రయత్నించాను. కానీ అస్సలు ఒప్పుకోలేదు. అతని ఇంట్లో కూడా అదే పరిస్థితి. పెద్దల్ని ఒప్పించి పెళ్ళి చేసుకోవాలనే ఎవరికైనా ఉంటుంది కానీ నొప్పించాలని ఏ పిల్లలకి ఉంటుంది చెప్పండి? మేమూ అలాగే అలోచించి చాలా ప్రయత్నం చేసాము. అప్పుడు నేను చాలా దిక్కుతోచని పరిస్థితిలో ప్రతి రోజూ ఒక యుగంగా ఏ రోజు ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉన్నాను. మా నాన్న వదలకుండా సంబంధాలు చూస్తున్నారు. కానీ ఒక్క సంబంధం కూడా ఇంటి దాకా రాకుండా చూడు స్వామీ అని దణ్ణం పెట్టుకుంటూ ఉన్నాను. ఒక నిర్ణయం తీసుకున్నాక, ఒకరిని భర్తగా అలోచించాక ఏ ఆడపిల్ల అయినా
మరొకరితో జీవితం ఎలా పంచుకోగలదు? ఈ మాట చెప్పినా మా నాన్న కరగలేదు.

ఆ బాధలో దేవుడినే నమ్ముకున్న నేను, ప్రతీ మంగళవారం ఉపవాసం ఉండి, ఆ రోజు 108 సార్లు ఆంజనేయస్వామికి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాను. ఆ దేవుడికి నాపై దయ కలగలేదని బాధ పడుతూ ఉన్నాను. ఆ సమయంలో మా అమ్మమ్మ ఒక ప్రత్యేకమైన పూజ చెప్పింది. అదేమిటంటే, 108 రోజులు, రోజుకి ఒక రకం పూలతో నీకు నచ్చిన దేవత కి పూజ చేయాలి. రోజుకి 11 పూలతో మాత్రమే (వాడినవి వాడకుండా) పూజ చేయాలని నేను అనుకున్నాను. 11 పూలే ఎందుకంటే, నేను ఆ రోజు నుంచీ 11 సార్లు హనుమాన్ చాలిసా చదవాలని నిర్ణయించుకున్నాను. అలాగే వారానికి ఒక్క రోజు కాక, ప్రతీ రోజూ 108 ప్రదక్షిణలు కూడా చేయ్యాలని అనుకున్నాను. నా పూజ మొదలు పెట్టి - రోజు కి ఒకరకం పూలతో పూజ చేస్తూనే ఉన్నాను. 108 రకాల పూలు అసలు దొరుకుతాయా? అదీ తప్పనిసరిగా ప్రతి రోజూ 11 పూలు కావాలి.... ఎంత కష్టమో చెప్పండి! కానీ ఆ భగవంతుడు మా పెళ్ళి చేసేదీ లేనిదీ ఈ 108 రోజుల్లో తేలి పోవాలని నిశ్చయించుకున్నాను.

మంచి రోజు చూసుకోని, నా పూజ మొదలు పెట్టాను. మా కాలనీ లో ఉన్న పూలు వెతికి చూసుకున్నాను. మా పక్క కాలనీ లో ప్రసన్నాంజనేయ స్వామి గుడి ఉంది. రోజూ అక్కడికి వెళ్ళి, ప్రదక్షిణలు చేసి, వస్తూ, వచ్చే దారిలో పూలు కోసి తెచ్చుకునేదాన్ని. ఒకవేళ కొత్త రకాలు ఎమైనా కనబడితే గుర్తు పెట్టుకొని, మర్రోజు ఆ కొత్త రకాలు కోసుకు వచ్చేదాన్ని. ఇళ్ళల్లో పూలే కాదు, రోడ్లకు పక్కన మున్సిపల్ వాళ్ళు వేసే చెట్ల పూలు కూడా (ఉదా: అగ్ని పూలు) ఎలాగో ఒకలా 11 పూలు కోసి తెచ్చేదాన్ని. పూల మార్కెట్టుకు వెళ్ళినపుడు, అక్కడ దొరికే పూలని కూడా కొని తెచ్చేదాన్ని (మల్లెలు, కాగడాలు, చామంతులు లాటి కొన్ని రకాలు బజారులో దొరుకుతాయి - వాటికోసం ఇళ్ళ వెంబడి తిరగడం అవసరం లేదు కదా! అయితే మార్కెట్టు లో నాకు తామర పూలు, డాలియా పూలు లాటి చాలా మంచి రకాలు కూడా దొరికాయి.) 107 రోజులు వరుసగా పూజ చేసాను. అంతలోగా మా అత్తగారి ఇంట్లో మా పెళ్ళికి ఒప్పుకోవడం, నాకు వేరే మంచి ఉద్యోగం రావడం జరిగాయి. 108వ రోజు మాత్రం నాకు పెద్ద పరీక్ష నే పెట్టాడు ఆ స్వామి. ఎక్కడా కొత్త రకం పూలు దొరకలేదు. ఒక గంట సేపు తిరిగాను. ఏ వీధిలో చూసినా, అన్నీ వాడిన రకాలే కనిపిస్తున్నాయి. ఇక ఆ హనుమంతుని ధ్యనించి, మరో రెండు వీధులు వెతికి, దొరకక పోతే అస్సలు ఆయన దయ నాపై లేదు అని నిశ్చయించుకొని... ఆ రెండు వీధులూ వెతికాను. ఆఖరు వీధిలో - ఆఖరి ఇంటి ముందు - నేను వాడని పూలు - బొండు మల్లె పూలు (గులాబి రంగులో ఉంటాయి - చాలా సువాసన గా ఉంటాయి) దొరికాయి.

సంతోషంగా ఆ రోజు ఇంటికి ఆ పూలు తెచ్చాను. ఆఖరు రోజు పూజ చేసుకున్నాను ఆ తరువాత 6 నెలలు తిరిగే లోపు నేను కోరుకున్న వ్యక్తితో, మా అత్తగారి తరపు వారి అందరి ఆశీర్వాదాల మధ్యా నా పెళ్ళి జరిగింది. మా నాన్నగారు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ఆ విషయం లో బాధగా ఉన్నా, కనీసం ఒక వైపు పెద్దలైనా ఒప్పుకున్నారు కదా అని కాస్త తృప్తి పడి ఊరుకున్నాము. నా పుట్టింటికి ఇంకా రాకపోకలు లేవు కానీ మా అత్తగారు వాళ్ళు నన్ను బాగా ఆదరించడం వల్ల, ఆ లోటు ని తల్చుకోకుండా ఉండగలుగుతున్నాను. అదీ దైవానుగ్రహమే కదా!

మనం భగవంతుని నమ్మి, సర్వస్వమూ ఆయనపై వదిలి, మన~హ్స్ఫూర్తిగా శరణాగతి వేడితే, తప్పక దైవ కృప మనపై ఉంటుంది.

సర్వేజనా సుఖినోభవంతు

జై రామ భక్త హనుమాన్ !

{వ్రాసినవారు : శిరిషా మురళి ,హైదరాబాద్ }

1 comments:

ఆత్రేయ కొండూరు said...

శిరీషా మురళి గారు మీకు మీ కుటుంబానికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.