2006 వ సంవత్సరం. రేపు హోళీ పండుగ రోజు చిలుకూరి బాలాజీ గుడి కి వెళదామా... మిత్రుడి సలహా. అప్పటికే ఆ గుడి గురించి విని ఉండటంతో అందరమూ
చిలుకూరికి వెళదామని నిర్ణయించుకున్నాము. హోళీ పండుగ రోజు అందరమూ కలిసి చిలుకూరికి బయలుదేరాము. ఆలయంలోకి ప్రవేశించగానే, అక్కడ
అప్పటికే చాలామంది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అది చూసి మాలో ఒకడు...ఇక్కడ మొదట పదకొండు ప్రదక్షిణలు చేసి, మనం ఏదైనా కోరిక కోరుకోవాలి. కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి 108 ప్రదక్షిణలు చేయాలి అన్నాడు. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. ఎలాగూ ఇంతదూరం వచ్చాం కాబట్టి, 108 ప్రదక్షిణలు ఇప్పుడే చేద్దాం అన్నాను నేను. అందరమూ కలిసి గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేశాము. అప్పట్లో నాకు పెద్దకోరికలేమీ లేకపోవడంతో, అలాగే దేవుణ్ణి ఏమి కోరుకోవాలో తెలియక "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి, దేవుణ్ణి దర్శించుకొని ఏమీ కోరకుండానే వచ్చేశాను.

చిలుకూరి నుంచి తిరిగి అమీర్ పేట కు వచ్చేటప్పటికి సాయంత్రం అవ్వడంతో, ఛాయ్ తాగుదామని అందరమూ మా రూముకు దగ్గరలో వున్న కెఫే కు వెళ్ళాము. మా ప్రక్క టేబుల్ లో ముగ్గురు కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళల్లో ఒకడు, మామా... GATE ర్యాంకు వచ్చింది కదా, మంచి పార్టీ ఇవ్వాలి అన్నాడు. అది విన్న నాకు అనుమానమొచ్చి, వాళ్ళను అడిగాను ఇవ్వాళ GATE రిజల్ట్స్ వచ్చాయా అని. అవునని సమాధానం చెప్పారు వాళ్ళు. నేను GATE exam అంత బాగా వ్రాసి ఉండకపోవటంతో, ర్యాంకు రాదన్న గట్టి నమ్మకంతో దాని గురించి పట్టించుకోవడం మానేశా. కాని కనీసం qualify అన్నా అయ్యానో లేదో తెలుసుకుందామని ప్రక్కనే వున్న ఇంటర్నెట్ కెఫే కి వెళ్ళాను. సైట్ లో నా నంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చూడగానే not qualified అని వచ్చింది. exam సరిగ్గా వ్రాయలేదని తెలుసుకాబట్టి qualify కాకపోయినా లైట్ తీసుకున్నాను. కాని ఎందుకో అనుమానమొచ్చి, మళ్ళీ నంబర్ చూసుకొని ఎంటర్ చేశాను. అంతే నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. నా శరీరంలో చిన్న వణుకు. నాదో కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికి బయట వున్న ఫ్రెండుగాడిని పిలిచి అడిగా. వాడు చూసి నాదేనని కన్ఫర్మ్ చేశాడు. అంతే ఒక్కసారిగా గాల్లో తేలిపోయా. మిగతా ఫ్రెండ్సుకు చెబుదామని, మా కాలేజీలో ఉన్న ఫ్రెండ్సుకు ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళు పగలబడి నవ్వడం మొదలుపెట్టారు. జోకులాపి పని చూడరా అన్నారు. నేనెంత చెప్పినా వాళ్ళు నమ్మలేదు. ఆఖరికి నా హాల్ టికెట్ నంబర్ ఇచ్చి, కావాలంటే మీరే రిజల్ట్స్ చూసుకోండిరా అని చెప్పాను. నాకు ర్యాంకు వచ్చిందనే విషయాన్ని, మా కాలేజీలో ఎవ్వరూ నమ్మలేకపోయారు. ఆఖరికి నా రూమ్మేట్స్ కూడా. నీకు ర్యాంకు వచ్చిన సంగతిని మేమెవ్వరమూ జీర్ణించుకోలేకపోతున్నాం రా అన్నారు కొద్దిమంది స్నేహితులు. వాళ్ళు జీర్ణించుకోలేకపోవడానికి, మా కాలేజీ లో ఎవ్వరూ నమ్మలేకపోవడానికి మరో పెద్ద ఫ్లాష్ బ్యాక్ వుంది. ఏదేమైనా నేనేమీ కోరకున్నా, నాకు కావలిసినదేంటో అనుగ్రహించిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి వేన వేల దండాలు.


--ధన్యవాదములతో
నాగప్రసాద్.
ఇంజనీరింగ్ విద్యార్ధి ,మరియు తెలుగుబ్లాగర్

2 comments:

మనోహర్ చెనికల said...

ఆ రూమ్మేట్స్ లో నేను కూడా ఉన్నాను. షాక్ అయిన మాట వాస్తవమే కానీ ఆనందపడిన మాట నిజం

మనోహర్ చెనికల said...

i am also there in those room mates. shocked but felt happy after confirming.