ఇది ఆపదలో చీకతి లో వున్న జీవితానికి భరోసా ఇచ్చి వెలుగుదారిన నడిపిన సద్గురువుల కృపను తెలిపే లీల. తన జీవితములో సమర్ధసద్గురువు సాయినాధుడు చూపిన అనుగ్రహాన్ని శ్రీమతి ఝాన్సీలక్ష్మీభాయి గారు తన మాటలలోనే వివరిస్తున్నారు.అవధరించండి.

1984 నాజీవితములో చీకటినినింపిన సమయము. నాభర్త ఆర్మీలో మెకానికల్ సెక్సన్ లో పని చేస్తూమమ్మల్ని దు:ఖసాగరం లో ముంచి సుదూర లోకాలకు తరలిపోయారు. చిన్నపిల్లలు.ఒక అబ్బాయి.ఇద్దరు అమ్మాయిలు. చిన్నపిల్లలను తీసుకుని నేను మా పుట్టిల్లు గిద్దలూరు చేరాను. మా అమ్మ్గారిల్లు స్టేషన్ దగ్గరే. పిల్లలను సముదాయిస్తూ నాలో నేను కుమిలి పోతూ గడుపుతున్న రోజులవి.మామూలు మనిషిని కాలేక పోతున్నాను. కానీ పిల్లలభవిష్యత్తు కోసము నన్ను నేను సమాధానపరుచుకొని బ్రతకవలసి వస్తున్నది. ఇంకా ఉద్యోగము కూడా ఇవ్వలేదు ఆర్మీ వాళ్ళు.

అలాంటీ రోజులలో ఒకరోజు గది లో విచారంగా నాలోకములో నేను వున్న సమయములో ఒక గొంతు హిందీ లో ఏదో అడుగుతున్నది. బయట మా పిన్ని గారు ఏదో చెబుతున్నట్లుగావుంటే బయటకు వచ్చాను. ఒక భిక్షుకుడు మావాల్లను టీ కావాలని అడుగుతున్నాడు.వాళ్లకు హిందీ అర్ధం కాక ఏమిటని అడుగుతున్నారు. ఆ కారం చూస్తే పాతగుడ్దలతో సాయిబాబా లా వున్నారు. కానీ నాకప్పటికి సాయిగురించి పెద్దగా వివరాలు కానీ ,భక్తి కానీ లేవు. కాకుంటే యాచిస్తున్నాడు కదా అని ఉండు మాయింట్లోవున్నాయి పెట్టిస్తాను అనిలోపలకు పోబోయాను. మరి నాకిస్తే అక్కడ నాకోసం కాచుకున్నవారికి కావాలికదా? కనుక కొద్దిగా టీపొడిఇవ్వు అన్నాడు. తెచ్చి ఇచ్చాను.మరి చక్కెర కావాలి కదా? అన్నాడు.కొద్దిగా పొట్లం కట్టి తెచ్చాను. బేటీ ఇవి కాగపెట్టాలి కదా ఒక చిన్న గిన్నెఇవ్వు అన్నాడు.తెచ్చి ఇస్తున్నాను.మా సంభాషణ హిందీ లో సాగుతున్నా మా పిన్ని కి అర్ధమవుతున్నందున పాలువద్దా అన్నది వెటకారం గా. వద్దు మేము డికాక్షన్ కాచుకుని తాగుతాము అన్నాడాయన.వెళ్ళి పోయాడు.
మరలా ఒక అర్ధగంటకు వచ్చి నేనిచ్చిన పాత్ర తిరిగిచ్చాడు. మా ఆవిడకు కావాలి ఒక కోక ఇవ్వు అన్నాడు. కొత్తకోక ఒక్కసారే కట్టు కున్నాను 750/ ది దండెం మీదనుంచి తెచ్చి ఇచ్చాను. అప్పూడు నెనొక్కదాన్నే వున్నాను. ఆయన నన్ను చూస్తూ నువ్వు నాకోసం ఇన్నిచ్చావుకదా ? మరి నెను కూడా నీకు ఏదన్నా ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. నాకేమొద్దు లే వెళ్ళు అన్నాను[మనసులో కొద్దిగా భయం. ఈ సన్యాసులు లాంటివాళ్ళు ఏమి మోసము చేస్తారో అని.] కాదు ఇదిగో చూడు తీసుకోఅని ఆయన నాచేతిలో తనగుప్పిటనుంచి ఏదో పెట్టాడు. నాకసలే భయం గావుంది. కానీ మాట్లాడ లేకపోతున్నాను. అమ్మ నువ్వు దీన్నిక్కడ వద్దు లోపలికెళ్ళీ నీ దేవుని మందిరం లోపెట్టి చూడు అన్నాడు. లోపలకెళుతూ గుప్పిటవిప్పాను. గుప్పున పూలపరిమళం గుభాళించింది. చేతిలో పూలు. చూసావా అన్నారు ఆయన లోననుండి.వామ్మో ఇదేదో ...అనే భ్యం నన్నావరించింది .ఏమీ లేవు పూలు అన్నాను నెను పెద్దగా .కాదు పూలకింద వున్నదాన్ని చూడు నిన్ను రక్షిస్తుంది దాన్ని భద్రంగా దాచుకో అని పెద్దగా చెప్పాడాయన. ఇదేదో మాయలాగున్నది ఇదినాకొద్దు నీది నువ్వే తీసుకో అని చెప్పి ఇద్దామని బయటకొచ్చాను. కానీ అక్కడాయన లేరు. ఒకవేళ మళ్ళా స్టేషన్ వైపు వెళ్లాలన్న కనీసం రెణ్డు నిమిషాలు పడుతున్నది. కానీ కనుచూపు మేర ఆయన కనిపించలేదు.గుప్పిటలో ఒక తాయెత్తులాంటి వస్తువు వున్నది భయం తో దాన్ని తీసుకెళ్ళీ దేవునున్పటాలముందు పడవేశాను. ఆతరువాత మనసుకు కాస్త ఉపశమనముగాను జీవితము మీద పిల్లలమీద ప్రేమ పెరిగాయి బాధ్యతలు నిర్వర్తిమ్చగలననే గుండెనిబ్బరము పెరిగాయి.[ మా అమ్మ వస్తే అరుస్తుందని షాప్ కెళ్ళీ మరొక చీర అలాంటిదే తెచ్చి తడిపి ఆరవేశానుఆరోజే] తరువత గుర్తుకొచ్చి ఎన్ని సార్లు వెతికినా ఆమహాను భావుడిచ్చిన తాయెత్తు కనపడలేదు. వారు సాయిబాబా అనే నమ్మకము నాకుకలిగినది. తరువాత వారిని పూజించసాగాను. నాకు ఆర్మీ లోనే యు.డి,సి. గా పోస్ట్ ఇచ్చారు. సికిందరాబాద్ లోనే పనిచేస్తున్నాను. ముగ్గురు పిల్లలు పెద్దవాల్లయి దేశరక్షణ కోసం వున్నారు. ఇద్దరికి పెళ్ళిల్లు చేశాను. నా ఇష్టదైవమయిన లలితాదేవితో పాటు,సద్గురువు సాయినాధుని గురువుగా మార్గదర్శకునిగా సేవిస్తుంటాను. సమర్ధ సద్గురు సాయి నాధులకు జయము.


వినుకొండ కొత్తపేటలో రమాదేవిగారనే టీచర్ గారు వుండేవారు

ఆవిడ మాకు 9 వ. తరగతిలో n.s. చెప్పేవారు. ఆవిడభర్తకు సరయిన వుద్యోగము లేక రక రకాల వృత్తులు చేస్తూ స్థిరత్వము లే కుండా వుంటుండేవారు. ఈయనకు పలు అవగుణాలు వున్నాయని చెప్పుకునేవారు. ఇద్దరు పిల్లలు కలిగినా ఈయన ప్రవర్తనలో మార్పులేకపోయినా ఆ తల్లి యెంతో సహనముతో కాపురము నెట్టు కొస్తుండేది. ఈయనకు గవర్నమెంట్ హాస్పటల్ లో పనిచేసె ఒక నర్సు తో అక్రమ సంబంధం ఏర్పడింది. అప్పటినుండి ఈవిడ పరిస్తితి దయనీయముగా మారింది. ప్రతిరోజూ తిట్టడం కొట్టడం ,విడాకు లివ్వమని వేధించడము మొదలయ్యాయి . తను సంపాదించేదేమీ లేకున్నా ఖర్చులకని వేధించి దడబూ తీసుకవెల్లి వుంపుడుగత్తెకు సరదాలు తీర్చడము ఇదీవరుస. వేధింపులు శృతి మించి పోయాయి. ఒకరాత్రి నిద్రపోతున్న ప్పుడు ఈవిడ ముఖముపై దిఁడు అదిమి చంపటానికి కూడా ప్రయత్నించాడు. పొద్దుటే ఈవిడ ఏడ్చు కుంటూ ఆ యింటి కెదురూగనే నివాసం వుంటున్న హనుమదుపాసకులు శ్రీ ప్రకాశమయ్య గారి వద్దకు వెళ్ళి విల పిస్తూ నాన్నగారూ[ఆయనను అందరము అలాగే పిలుస్తాము] నేనిక బ్రతకలేను. ఏదోరోజు మా ఆయన దుర్మార్గానికి బలవుతాను. నాబిడ్డలు పసివాళ్ళు. తల్లిలేక దిక్కులేనివారయిపోతారు. అలాగని పుట్టింటికి వెళ్ళి పలుచన కాలేను. నన్ను రక్షించండి . నాభర్త బుధ్ధమారి నా కాపురం నిలబెట్టే మార్గం చెప్పండని వేడుకున్నది. అమ్మా! కర్మఫలం ఇలా పట్టి పీడిస్తున్నప్పుడు మానవప్రయత్నాలు ఏమీ చేయలేవు. త్రికరణ శుద్ధి గానమ్మి హనుమంతుని ఆశ్రయించు అన్నారు. లాంగూల స్తోత్రం వుపదేశించి నారు. కస్టాలలో వున్నఈవిడ తీక్షణముగా సాధన సాగిస్తున్నది. ఈ సంఘటన జరిగిన రోజునుంచి తన భర్త ఇంటికి రావడము, అన్నము తినిపోవడము తప్ప పలకరించటము లేదు. ఒక రోజు రాత్రి నిద్రపోతున్న అతను చావుకేక పెట్టి మంచం మీదనుంచి ఎగిరిపడి లేచి గడగడా వణికిపోతూ భయంతో కేకలేస్తున్నాడు. ఈఅరుపులకు చూట్టుపక్కలవాళ్ళూ లేచివచ్చి ఏంజరిగింది... ఏంజరిగిందని అతనిని అడుగుతునారు .అతను వెర్రిచూపులు చూస్తూ అడిగో ఆంజనేయ స్వామి నన్ను తోకతో కొట్టాడు, అని బెంబేలెత్తి పోతున్నాడు. ఇక లాభం లేదు వీడేదో ఆంజనేయస్వామంటున్నాడూ అని వాళ్ళు అతనిని. ఎదురింట్ళోవున్న ప్రకాశమయ్య గారి వద్దకు తీసుకువచ్చారు. అతని వీపుపై చేంతాడుతో పీ కినట్లు వాతతేలి వుంది. ఆయన వచ్చిన వారిని బయటకు పంపి, ఒరే నీ పాపం పండింది. నీభార్యను వేధిస్తే నువ్వుచస్తావు. ఇప్పుడు స్వామి రక్షణలో వుంది ఆమె. బుధ్ధి మార్చుకుని ప్రవర్తించమని, చెప్పి అతని శిరస్సు పై చేయివుంచి అతను భయం తొలగించి తొలగించి పంపాడు. దెబ్బకు దెయ్యం వదలినట్లు తరువాత అతను భార్యా పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ, అన్యోన్యంగా వుంటున్నారు. ఇప్పుడు ఆవిడ m.e.o.పనిచేస్తున్నారు. స్వామి పరమ భక్తురాలుగా వున్నారు.


అది ఒక పెద్ద కుటుంబము .పండగ వచ్చినదంటే ఇంట్ళో వచ్చినబంధువులతో సందడే సందడి. అలాంటి ఇంట్లో నుంచి కేకలు వినబడుతున్నాయి. ఏమిటయ్యా అబద్దాలాడుతున్నావు . ఒకావిడ గద్దిస్తున్నది.
"లేదమ్మా నేను అబద్దం చెప్పటములేదమ్మా .నేను" ఇంతమందికి ' గాజులు వేశాను అని వివరిస్తున్నాడు గాజుల మలారం అబ్బి.
ఇంట్లో వున్న పిల్లలకంటే నువ్వు ఒకరు ఎక్కువ చెబుతున్నావు. ఆమె కోప్పడుతున్నది.
లేదమ్మా అయ్యగారింట్లో నేనే ఎప్పుడూ గాజులు వేస్తుంటాను .నేనెప్పుడూ అబద్దం చెప్పను వాదిస్తున్నాడతను.
ఇంతలో ఇంటి యజమాను రాలు బయటకు వచ్చి పోనీలేవే , పిల్లల్లో ఎవరన్నా ఆకతాయి తనంగా మరలా వేపించుకుని ఏడిపిస్తున్నారేమోలే .డబ్బులిచ్చి పంపు. అని డబ్బుతీసి ఇచ్చినది.
ఇలాంటి సన్ని వేశము మరలా మరలా ప్రతి పండగకూ ఆడపిల్లలకు గాజులు వేపించినప్పుడల్లా జరుగుతున్నది. గాజులు వేసే వాళ్ళు మారినా ఈ సన్నివేశం మరటం లేదు. ప్రతిసారీ గాజుల వాళ్ళు ఇంతమందికి గాజులు తొడిగాననటము,లెక్కచూస్తే ఇంట్లో వున్న ఆడపిల్లల కంటే ఒకరికి ఎక్కువగా గాజులు తోడిగానని గాజుల వాళ్లు లబలబలాడటము సామాన్యమయి పోయినది. ఇలా కాదని ఒకరోజు ఈసన్నివేశం ప్రత్యక్షమవగానే ఇంటియజమానిని ,అడిగాడు గాజుల వ్యాపారి. అయ్యగారూ ఒక్కరికి ఎక్కువ గాజులు తొడిగానని అబద్దమాడి డబ్బులు తీసుకుంటున్నానని అమ్మగారు వాళ్ళు తిడుతున్నారండి. నేను [ఇంత] మందికి గాజులు వేశానండి సత్యప్రమాణముగా చెబుతున్నా నండి అని బాధపడ్దాడు .
"అవును నువ్వన్నన్తమందికి గాజులు తొడిగావు.నువ్వుచెప్పినది నిజమే అన్నాడా తేజో మూర్తి.
అదెలాగండీ ,మనింట్లో వున్నవాళ్ళు ఇంతమంది ఆడపిల్లలు మాత్రమె ,ప్రతిసారీ వున్నవారికంటే ఒకరికి ఎక్కువచెబుతున్నాడు ఈగాజులశెట్టి ...ఫిర్యాదు చేసినది ఇల్లాలు. అవును నువ్వన్నది కూడా నిజమే ఇప్పుడు ఇంట్లో వున్న ఆడపిల్లలు నువ్వు చెప్పినంతమందే కాని అతను చెప్పినది కూడా నిజమే అన్నారాయన సంతోషముతో నవ్వుతూ. అదెలాగండీ చోద్యం అన్నదావిడ . ఆఒక్క చిన్నారి ఎవరనుకుంటున్నావు ? ఆజగన్మాత: "బాల "పిల్లల తో కలసి ప్రతిసారీ ఇలా వేడుకగా గాజు లేపించుకుంటున్నది ,అని వివరించాడాయన
దైవరహస్యాన్ని.
ఆతపోమూర్తి ,మహాసాధకుడూ, దత్త మూర్తి శిష్యుడూ బాలా ఉపాసకుడయిన చందోలు శాస్త్రిగారు. వారి వారిజీవితములో జరిగిన దైవలీలలను చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు. వారి పార్ధివ దేహాన్ని దహనంచేసున్నప్పుడు ఫోటోలు తీయగా ఆ-ఫోటో లో ఒక దివ్యమూర్తి కనిపించటం అది పత్రికలలో వచ్చి సంచలనము కలిగించినవిషయము ఆంధ్రులకు తెలిసినదే. నేను కూడా చదువుకునేటప్పుడు ఆ చాయా చిత్రాన్ని చూశాను. సంపాదిద్దామంటే దొరకలేదు. ఎవరిదగ్గరన్నా వుంటే పంపగలరని ప్రార్ధన.
దైవం ప్రేమ భావం నిండిన మానవ జీవితాలలో ప్రత్యక్షముగా సాక్షాత్కరించి తన లీలా వినోదాలను సాగిస్తున్నదనటానికి ఒక ఉదాహరణ చందోలు శాస్త్రిగారి జీవితము.


మా నాన్నగారికి స్వయంగా అనుభవమైన సంఘటన ఇది. అప్పట్లో ఆయన ఆర్‌టీసీలో
వుద్యోగం చేస్తుండేవారు. తిరుపతి వెళ్ళాలని నిర్ణయించుకొని శెలవుకోసం
ప్రయత్నించారు. శెలవు దొరకక పోవటంతో సిక్ లీవు పెట్టి తిరుపతి
ప్రయాణమయ్యారు.

తిరుపతిలో దర్శనము అదీ బాగానే జరిగింది. సిక్ లీవులో వున్నారు కదా తల
నీలాలు సమర్పిస్తే మర్నాడు ఆఫీసులో తిరుపతి వెళ్ళిన విషయం తెలిసిపోతుందని
ఆ సారికి తలనీలాలు ఇవ్వలేదు. దర్శనం పూర్తయ్యి డార్మెట్రీ చేరుకోని
కొద్దిసేపు విశ్రమించారు. అంతలోనే చిన్న నిద్ర అందులో ఒక కల -

ఆయన కోనేరు దగ్గర వున్నారు. చేతిలోవున్న చిన్న బ్రీఫ్‌కేసు గట్టు మీద
పెట్టి కోనేట్లో స్నానానికి దిగారు. మూడు మునకలేసి చూస్తే ఏముంది - ఆ
బ్రీఫ్‌కేసు మాయం. హడావిడిగా ఆ చుట్టుపక్కలంతా వెతకటం మొదలుపెట్టారు.
ఇంతలో ఒక కానిష్టేబుల్ అక్కడికి వచ్చాడు.

మనిషి నల్లటి నలుపు, బాన బొజ్జ, పాత తరం పోలీసు వేసుకున్నట్టు నిక్కరు,
మోకాళ్ళదాకా సాక్సులు, ముఖాన తిరునామాలు.

"ఏమిటయ్యా వెతుకుతున్నావు..??" అడిగాడు
"నేను కోనేట్లో మునకేసి లేచేసరికి నా బ్రీఫ్‌కేస్ పోయింది సార్.."
ఆయన చిన్నగా నవ్వి అన్నాడు -

"బ్రీఫ్‌కేస్ పోతేనేమయ్యా నీ నెత్తిన జుట్టు వుందిగా.."
అంతే - కల చెదిరింది, నిద్ర మెలుకువ వచ్చింది. ఆ తరువాత మా నాన్నగారు
కళ్యాణకట్టకి వెళ్ళారని వేరే చెప్పాలా?? ఇంతకీ ఆ తిరునామాల కానిస్టేబులు
ఎవరంటారు? పోలీసు ఎంకటసామా..??

అంత వివరంగా తెలిస్తే అది దైవలీల ఎందుకౌతుంది??

[అరిపిరాల సత్య ప్రసాద్ ]


మంచి జరిగినా చెడు జరిగినా ఎల్లప్పుడూ కృష్ణభగవానుడు నావెంటే ఉన్నాడన్న భావన ఉన్నవాడిని నేను. భగవంతుని పూర్తిగా విశ్వసించిన వానికి ఆయన లీలలు ఎప్పుడూ మనకు అవగతమవుతూ ఉంటూనే ఉంటాయి. మన మొర సహేతుకమైతే ఆయన తప్పక ఆలకిస్తాడని, తీరుస్తాడని నా నమ్మకం. మన మంచి ప్రయత్నానికి ఆయన ఆశీస్సులు కూడా తప్పక ఉంటాయనడానికి నిదర్శనంగా ఎప్పుడో కాదు ఈ టపా వ్రాయడానికి ప్ర్రారంభించడం మొదలు పెట్టడానికి "వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన, వేంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి" అని తలస్తూ టైపు చేస్తూ ఉండగానే టీ.వీలో గంభీర స్వరంలో ఆ శ్లోకమే వినిపించింది.

ఇక అసలు విషయానికొద్దాం.శ్రీ దుర్గేశ్వర రావు గారు దైవలీలల గురించి మీ జీవితంలో జరిగిన సంఘటనలను తెలుపమన్నారు. 5 సంవత్సరాల క్రితం మా ఊరిలో జరిగిన ఒక సంఘటన ఒకటి మీకు తెలియచేయాలనుకుంటున్నాను

.

"వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన

వేంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి"

"బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు, శ్రీ వేంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు భూత భవిష్యత్కాలాలలోనూ లేడు,"

ఉండబోడన్న ప్రశస్తికి నిదర్శనంగా మా గ్రామంలో జరిగిన ఒక సంఘటన ఒక మచ్చుతునక మాత్రమే. మాది అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలంలోని మిట్టమీద కొట్టాలపల్లె అనే కుగ్రామం. మా గ్రామంలో ఒక చిన్నకారు రైతు ఏకైక 20 ఏళ్ళ కుమారుడు అంతుపట్టని జ్వరంతో బెంగుళూర్ మణిపాల్ హాస్పిటల్ లో చేర్పించబడ్డాడు. వైద్యులు తమ పరిశీలనలో అతనికి డెంగ్యూ జ్వరమని నిర్ధారించి icu లో ఉంచి వెంటిలేటర్ ద్వారా శ్వాసనిస్తూ చికిత్స ప్రారంభించారు. రోగికి దాదాపు 30 సీసాలవరకు రక్తం కావాలన్నారు. విషయం తెలుసుకున్న నేను మాఊరి యువకులతో మాట్లాడి వారినందరినీ సమాయత్తం చేసి వారినందరినీ బెంగుళూరుకు తీసుకొనిపోయి వారందరితో కలిసి రక్తదానం చేసాము. బెంగుళూరులోని మాబంధువులు కూడా వచ్చి రక్తదానం చేసారు. తర్వాత రోగిని చూద్దామని లోనికి వెళ్ళాను. గ్రామంలో మా కళ్ళెదుట ఆడుతూ, పాడుతూ తిరుగుతూ అందరికీ తన చేతనైనంత సహాయం చేసే అబ్బాయి నిస్తేజంగా పడుకొనిఉన్న తీరు చూసి దుఃఖం ఆపుకోలేక కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాను.అబ్బాయితండ్రికైతే ధైర్యం చెప్పాగానీ నాకైతే అబ్బాయి బ్రతికి బట్ట కడతాడనే నమ్మకం సన్నగిల్లింది. రోగి పరిస్తితి గురించి అక్కడ వైద్యులను ప్రశ్నించగా పరిస్తితి చాలా క్లిష్టంగా ఉంది మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఆపై భగవంతుని దయ అన్నారు. అపుడే నేను శ్రీవేంకటేశ్వరున్ని " శ్రీనివాసా! భక్తిప్రపత్తులతో నిన్నుకొలిచేవాడికి విపత్తులనుండి విముక్తి కలిగిస్తావుకదా ! కలియుగ ప్రత్యక్ష్య దైవం అయిన నీవు ఈ అబ్బాయికి స్వస్తత కలిగిస్తేనే నీవున్నట్లు" అని మనసారా ప్రార్తించాను. ఆర్తికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నా కూడా అతనికి డబ్బు వేరేవారి ద్వారా సమకూరడం, రక్తం కూడా లభించడం, తర్వాత మృత్యుద్వారం అంచులవరకు వెళ్ళిన అబ్బాయి అనూహ్యంగా కోలుకుని 3 నెలల తర్వాత మాముందు మామూలుగా తిరగడం చూస్తుంటే అంతా ఆ స్వామి లీలగాక మరేంటి ?

శ్రీనివాసుని ఎల్లప్పుడూ తలచుకుంటూ, భక్తిశ్రద్ధలతో కొలిచేవాడికి ఆపదలు సులభంగా తొలగి పోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతినిత్యం దీనజనులను కాపాడుచున్న ఆ దయాసాగరమూర్తి ,కలియుగ ప్రత్యక్ష్య దైవం శ్రీవేంకటేశ్వరున్ని నిత్యం స్మరిస్తూ స్వామి కృపకు అందరూ అర్హులు కావాలనికోరుకుంటూ…………..


మీ చిలమకూరువిజయమోహన్.(లీలామోహనం)

"ఆ అబ్బాయి పేరు హరిప్రసాద్. భాస్కర్ నాయుడుగారి కుమారుడు."












నేడు మానవుడు తానే గొప్పవాడు , దేవుడు లేదు, దయ్యము లేదు అనుకుని విర్రవీగుతున్నాడు. కాని ఈ విశ్వాన్నంతటిని నడిపించేది ఒకే శక్తి ఉంది. ఆ శక్తి నుండి ఉద్భవించిన కోట్లాది దేవతలు. మనకు నచ్చినట్లుగా వేర్వేరు పేర్లతో ఆ దేవుడిని పిలుచుకుంటాము. రాముడైనా, అల్లా ఐనా, క్రీస్తు ఐనా ఒక్కడే అని నా నమ్మకం. ఎవరికైనా నమస్కారం , పూజలు చేయడానికి నేను సంసిద్ధంగానే ఉంటాను. మరి ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు. నేను నోములు , వ్రతాలు, ఉపవాసాలు చేయను. అలా అని నాస్తికురాలిని కాదు. మనస్పూర్తిగా నమస్కరిస్తే ఆ దేవుడు మన మనస్సులోనే ఉంటాడు అని నమ్మేదాన్ని. ఒక గృహిణిగా నా కుటుంబ బాధ్యతలే నాకు దైవపూజతో సమానం అని భావిస్తాను. అందుకే వాటికే ముందు ప్రాముఖ్యతనిస్తూ వస్తున్నా. అవి సమర్ధవంతంగా నిర్వహిస్తూ, అప్పుడప్పుడు చేతనైనంత ఇతరులకు సాయం చేయడం . ఇవన్నీ దైవభక్తి అని నమ్ముతాను.

కాని నా పిల్లల విషయంలో జరిగిన రెండు సంఘటనలు ఎప్పటికీ మర్చిపోలేను. ఈ విషయం వింటే ఎందరో నవ్వుకోవచ్చు. పిచ్చి సెంటిమెంట్ అని. కాని నేను ఆ దేవుడి లీలను స్వయంగా చూసినదాన్ని. మా అమ్మాయి EAMCET పరీక్ష కోసం చిల్కూరు దగ్గరలో ఉన్న కాలేజిలో సెంటర్ పడింది. అప్పుడు ఆ గుడిలో మొదటిసారిగా నేను దేవుడిని కోరుకున్నాను. మా అమ్మాయికి హైదరాబాదులో, ఫ్రీ సీట్ రావాలని. ఎందుకంటే ఆ సమయంలో ఎక్కువ ఫీజ్ కట్టే పరిస్థితుల్లో లేము కాబట్టి , అమ్మాయి పెద్ద చదువులు చదవాలనే ఆశతో అలా కోరుకున్నాను. విచిత్రంగా మొదటి కౌన్సెల్లింగ్ లోనే మా అమ్మాయికి సిటీలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రీ సీటొచ్చింది. ఏడాదికి 8000 మాత్రమే. అది వాళ్లకు ఏడాది స్కూలు ఫీజ్ కంటే తక్కువే. ఆ తర్వాత నేను మా అమ్మాయి కలిసి చిల్కూరు వెళ్లి 108 ప్రదక్షిణలు చేసాము. ఎలాగూ ప్రతి సంవత్సరం తిరుపతి వెళతాము. కాని ఇది మాత్రం నాకు సంబంధించి ఒక అద్భుతం. ఇప్పటికీ కూడా తను ఆ వేంకటేశ్వరుడి కరుణతో ఉద్యోగంలో కూడా ఉన్నత స్థితిలో ఉంది.

ఇక మా అబ్బాయికి EAMCET లో చాలా ఎక్కువ ర్యాంకు వచ్చింది. అసలు అంతవరకు నంబర్లు కౌన్సెలింగుకు పిలవలేదు. ఏడాది చదువు పోయింది అనుకున్నాము. వాడు కూడా చాలా దిగాలు పడిపోయాము. డోనేషన్లు కట్టే పరిస్థితి కాదు. డిగ్రీలో చేరాలా, ఇంట్లోనే ఉండి మళ్లీ చదువుకోవాలా అని తర్జనా భర్జన పడుతున్నాడు. చివరి ప్రయత్నంగా నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న దుర్గ గుడికి వెళ్లి అమ్మకు నమస్కరించి నా కొడుకుకు ఒక దారి చూపించు తల్లి వాడి భవిష్యత్తు పాడు కానివ్వకు అని వేడుకున్నాను. ప్రతి రోజు 108 ప్రదక్షిణలు 108 రోజులు చేసాను. మా అబ్బాయి 21 రోజులు చేసాడు. పాపం వాడు కూడా చాలా నిరాశగా ఉన్నాడు. అదృష్టవశాత్తు 21 రోజులు ఐన మర్నాడే పేపర్లో ఒక వార్త వచ్చింది. ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోయినండువల్ల మళ్లీ కౌన్సెలింగ్ కు పిలవాలి అని. అందులో మా వాడిది మొదటి రెండు రోజులలోనే ఉంది. అప్పుడు కాని మా ఇంట్లో అందరికీ మనసు కుదుటపడలేదు. మావాడి మొహంలో తిరిగి కళ వచ్చింది. అసలు సీట్ రాదనుకున్న తరుణంలో మావాడికి ఊరవతల కాలేజీ ఐనా Electronics and Instrumentation లో సీట్ వచ్చింది. అది కూడా చాలా అదృష్టం కదా. అంతా ఆ అమ్మ దయ అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. నేను ప్రతి దసరా నవరాత్రులలో ప్రతి రోజు గుడికెళతాను. నేను ఏ పని చేసినా అమ్మా నీదే భారం. నాకు ఈ పని నిర్విఘ్నంగా పూర్తి చేసే శక్తి నివ్వు అని కోరుకుంటాను. అన్నీ ఆ అమ్మ చూసుకుంటుంది అనే ధైర్యం ఉంది నాకు అని చెప్పగలను. అదేంటోగాని నాకు ఆనందాన్నిచ్చే శుభవార్తలు మంగళవారాలే వస్తాయి మరి..

జ్యోతి వలబోజు...


భక్త జనులకు ప్రణామములు.

భగవంతుని నమ్మినా నమ్మకున్నా ఆయన లీలలు నిత్యసత్యాలు అవి అలా జరుగుతూనే వుంటాయి సూర్యోదయ అస్తమయాలు లాగా. ఒకేసూర్యుడు వివిధ కుంభాలలో ఉన్న జలాలలో వాటి పరిమాణాన్ని బట్టి ఎలా ప్రతిఫలిస్తాడో అలా ఆయన లీలావినోదాలు సాగుతుంటాయి,అందరి జీవితాలలోనూ.ప్రతివారి జీవితంలోనూ ఎప్పుడో ఒకసారి తప్పనిసరిగా ఆలీలలను గమనించగల స్మృతి కలుగుతుంది. వాటిని గమనించాక ఒడలు పులకరించి మనసు దైవీభావంతో నిండి మన అడుగులు ఆయన వైపుగా సాగుతుంటాయి. అవి పదిమందికి తెలిసినప్పుడు తెలుసుకున్న వారందరికి మేలును చేకూరుస్తాయి. కనుకనే భక్తులు భగవంతుని లీలలను ఒకరితో ఒకరుచెప్పుకుని పరస్పరం శ్రేయస్సును పొందుతారు. దీనినే సత్సంగము అంటారు. సత్సంగము కలియుగములో లభించటం చాలామేలు చేస్తుంది. కలి మాయా ప్రభావాన్నుంచి తప్పించుకోవటానికి.

ఇన్ని విషయాలు మాట్లాడుకునే మనం భగవంతుని గుణగానాన్ని చేయటానికి కొంతసమయము వెచ్చించగలము కనుక లోక శేయస్సు ,అంతకంటే ముఖ్యంగా ఆత్మశ్రేయస్సు కలుగుతుందనే భావనతో బ్లాగ్ ప్రారంభిస్తున్నాను. సత్కార్యము జరగటానికి మీఅందరి సహకారము అభ్యర్ధిస్తున్నాను.

మీ జీవిత యానములో మీకు అనుభవములో కొచ్చిన ఆపరమాత్మ లీలలను వ్రాసి పంపండి. అవి దైవపరమయినవైనా ,సద్గురు పరంపరనుంచి వచ్చిన లీలలైనా. ఎవరి ఇష్ట దైవాన్నుంచి వచ్చిన అనుభూతులు ,అనుభవాలు వారు వ్రాసి పంపండి సనాతనమైన ధర్మమార్గానుయూయులందరు. అలాగే మీ కు తెలిసి మరెవరి జీవితములోనుండయినా ,ఏదయినా సద్ గ్రంథము నుండయినా ,మహాత్ముల రచనలనుండయినా .వాటిని మీ అనుభవాలుగా లేక మీరు పంపిన వాటిగా ఇందులో వుంచుదాము. అవి ఎందరో భక్తులకు సన్మార్గాన్ని చూపుతాయి. ఏమో ఎవరు చెప్పగలరు,భక్తపోతన సినిమా చూసి యోగిగా మారిన ముమ్మడివరం బాలయోగిలాంటి మహనీయులు సత్కథా ప్రయోజనాన్ని నిరూపించారు. ఎవరికేమోగాని నాకు మాత్రం అటువంటి భగవల్లీలలు వినటమ్ చదవటమ్ తప్పనిసరిగా ప్రయోజనమే. పదేపదే ప్రార్ధిస్తున్నాను. మీరుదయతలచి నాకు భగవత్ సేవలో చేయూతనివ్వాలని.

మీ వ్రాతలను durgeswara@gmail.com పంపండి. ఇక్కడ చూడండి. మీకు తెలిసినవారందరికీ ఈవిషయాన్ని చేరవేయగలరు.
భక్తజన పాదసేవలో ........దుర్గేశ్వర